ప్రస్తుతం సమాజం చాలావరకూ మారింది. ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు పిల్లలను సమానంగానే చూస్తున్నారు. అమ్మాయిలను పెద్ద చదువులు చదివిస్తున్నారు. వారిని ఉన్నత స్థానాల్లో చూడాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కడికెళ్లినా ఎదురయ్యే తోడేళ్లు ఈ కలను సాకారం కానీయకుండా అడ్డుకుంటున్నాయి. అలాంటి ఓ మృగం బారిన పడినా.. దాన్ని తట్టుకొని మరీ ఉన్నత స్థానానికి చేరిందో అమ్మాయి. అయితే ఆ వ్యక్తిని అలాగే వదిలేయకుండా ఉండాల్సిందని బాధపడుతోంది. మరి, ఆ అమ్మాయి మనోగతమేంటో మనమూ తెలుసుకుందాం రండి..
నా పేరు లాస్య(పేరు మార్చాం). నేను విశాఖపట్నంలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయిని.. నా తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వోద్యోగులే.. వారికి నేను, తమ్ముడు ఇద్దరమే సంతానం. ఒక్క కూతురినే కాబట్టి అమ్మానాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచారు. కానీ అమ్మానాన్న ఉన్నతోద్యోగులు కాబట్టి దానికి తగినట్లుగానే నా స్థాయి కూడా ఉండాలని వారు కోరుకునేవారు. అమ్మ నాకు చిన్నతనంలోనే ఇంటిపనులు చేయడం నేర్పిస్తే.. నేను ఆటల్లో, చదువులో ఎప్పుడూ ముందుండాలని నాన్న కోరుకునేవారు. ఆ విధంగానే ఉదయాన్నే టెన్నిస్ ప్రాక్టీస్‌తో నా రోజు మొదలయ్యేది. జిల్లాస్థాయి ఆటలపోటీల్లో కూడా పాల్గొన్నా.. చదువుల్లో కూడా నేనే ఎప్పుడూ ముందుండేదాన్ని. ఇదంతా పదో తరగతి వరకే.. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన నన్ను మెచ్చుకున్నారు నాన్న.. ఇదే కొనసాగిస్తూ ఐఐటీలో సీట్ సంపాదించాలన్నది ఆయన లక్ష్యం. నేనూ అదే అనుకునేదాన్ని. ఐఐటీలో ఇంజినీరింగ్ చేసి, ఏదైనా ప్రతిష్ఠాత్మకమైన సంస్థలో ఉద్యోగం సాధించాలనేది నా కోరిక. నేను చక్కటి ఉద్యోగం సంపాదించి నాన్న పేరు నిలబెట్టాలనే లక్ష్యంతోనే ఉండేదాన్ని.

పదో తరగతి పూర్తయింది. నేను ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరాను. అయితే మునుపటితో పోల్చితే లెక్కల్లో నా మార్కులు కాస్త తగ్గడం గమనించా.. దీంతో వాటిపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ట్యూషన్‌కు వెళ్లడానికి నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని నాన్నకు చెబితే సంతోషంగా ఒప్పుకున్నారు. అలా మొదటి సంవత్సరం పరీక్షలకు ముందు ట్యూషన్లో చేరాను. మా ట్యూషన్ టీచర్ నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆయన చేసిన సాయంతో నేను మొదటి సంవత్సరం లెక్కల్లో వందశాతం మార్కులతో పాసయ్యా.. దీంతో నాన్న ఆనందానికి అవధులు లేవు. ఇలాగే చక్కగా చదివి ఐఐటీ కూడా సాధించాలని ఆయన కోరుకున్నారు. తప్పక ఐఐటీ సాధిస్తానని ఆయనకు నేను మాట కూడా ఇచ్చాను. ఆ తర్వాత కొన్ని నెలలు మామూలుగానే గడిచిపోయాయి.
*****
కొన్ని రోజుల తర్వాత మా ట్యూషన్ టీచర్ ప్రవర్తన నాకెందుకో వింతగా తోచింది. ఆయన లేని సమయంలో క్లాసులో ఒకబ్బాయి నా వద్దకు వచ్చి తనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుంటున్నాడు. అప్పుడే ఆ వైపు వచ్చిన ఆయన అతన్ని బాగా తిట్టి అక్కడి నుంచి పంపించేశాడు. పక్కవాళ్ల సందేహాలతో నా సమయం వృథా చేసుకోకుండా నా చదువుపై దృష్టి పెట్టమని నన్ను కోరాడు. ఆయన ముందు నుంచీ నాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా.. ఆరోజు కాస్త వింతగా అనిపించింది. అది ఆ తర్వాత ఆయన ప్రవర్తనను నేను గమనించేలా చేసింది. అప్పుడర్థమైంది నాకు.. లెక్కల్లో సందేహాలు తీర్చే వంకతో నన్ను తాకడం, నా దుస్తుల్లోకి తొంగిచూస్తూ ఆనందించడం.. దీంతో ఆయనకు దూరంగా ఉండాలనుకున్నా.. కానీ అక్కడ ఉండగా అది కుదర్లేదు. మానేద్దామంటే అసలే రెండో సంవత్సరం.. పైగా పరీక్షల గడువు కూడా దగ్గరపడింది. ఓరోజు సరదాగా స్నేహితులతో.. 'ఇంటర్మీడియట్ పరీక్షలైపోతే చాలు.. ఇక ట్యూషన్‌కి రావాల్సిన అవసరం లేదంటూ మాట్లాడుతున్నా.. అది ఆయన వినడం నేను గమనించనే లేదు.

ఆ తర్వాత ఒకరోజు నాతో పాటు మరో ముగ్గురికి ఎక్కువ వర్క్ ఇచ్చి.. ఆ లెక్కలన్నీ పూర్తిచేస్తేనే కానీ ఇంటికి వెళ్లడానికి వీల్లేదని చెప్పాడాయన. అయితే అప్పుడు నాకు తెలియలేదు.. వాళ్లందరి కంటే నాకు ఇచ్చిన లెక్కలు ఇంకా ఎక్కువని.. వాళ్లందరి పనీ పూర్తయింది.. వాళ్లు వెళ్లిపోయారు. నా పని ఇంకా పూర్తవ్వలేదు. అప్పుడు సర్ వచ్చి నా పక్కన కూర్చొని నా మీద చేయి వేసి.. తన మనసులోని భావాలను వెల్లడించాడు. అతనికి నేనంటే చాలా ఇష్టమట.. సంవత్సరం నుంచి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి కౌగిలించుకొని ముద్దుపెట్టుకున్నాడు. నాకు అదంతా ఇష్టం లేకపోయినా నేనేం చేయలేకపోయా. అక్కడే ఉంటే ఇంకేదైనా జరుగుతుందేమోనన్న భయంతో 'ముందు నేను చదువుపై దృష్టి పెట్టాలనుకుంటున్నా.. ఆ తర్వాతే మిగిలినవన్నీ' అని సమాధానమిచ్చాను. 'ఫర్వాలేదు.. నీకు మార్కులు వచ్చేలా చూడడం నా బాధ్యత.. నన్ను నువ్వు ప్రేమగా చూసుకుంటే చాలు..' అంటూ నా మీదకు రాబోయాడు. అతన్ని తోసేసి 'ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం.. ఆలస్యమవుతోంద'ని చెప్పి అక్కడి నుంచి బయల్దేరా. అతడు పిలుస్తున్నా పట్టించుకోకుండా ఇంటివరకూ ఏడుస్తూ.. వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయా. ఇంటికెళ్లి అమ్మానాన్నలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే కన్నీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్లాను..
*****
ఆ తర్వాత రోజు ఒంట్లో బాగోలేదని చెప్పి ట్యూషన్‌కి వెళ్లలేదు. కొన్నిరోజులు అలా గడిపిన తర్వాత ఇక ట్యూషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని, నేను లెక్కల్లో పర్ఫెక్ట్ అయిపోయానని అబద్ధం చెప్పి మానేశాను. అయితే ఆ సంఘటన నా మనసులోంచి పోయేది కాదు. ఎంత ప్రయత్నించినా చదువు బుర్రకెక్కేది కాదు. అలా మార్కులు తగ్గిపోయాయి. ఓరోజు వీక్లీ టెస్ట్‌లో నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మా నాన్న బాధపడడం గమనించా. ఒక నెగెటివ్ సంఘటన మన జీవితాన్ని అధః పాతాళంలోకి నెట్టేయడం కరక్ట్ కాదనిపించింది. జరిగింది పెద్ద సంఘటనే.. కానీ అది జరిగిపోయింది. ఇకపై దాన్ని ఏం చేయలేం. కాబట్టి దానిపై దృష్టి పెట్టకుండా జరగాల్సింది చూడాలని నాకు అర్థమైంది. కష్టమైనా రోజుకు పదహారు గంటల పాటు చదవడం ప్రారంభించాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు ఐఐటీలోనూ సీట్ సంపాదించాను. ఆరోజు మా నాన్న కళ్లలో ఆనందభాష్పాలు చూసిన తర్వాత నేను పడిన శ్రమకు ఫలితం దక్కిందనిపించింది.

ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే జీవితంలో మనకు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎన్నో చెడు సంఘటనలు ఎదురవుతాయి. అయితే జీవితం అక్కడే ఆగిపోదు.. ముందుకు సాగిపోతుంది. దానితో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే. నేను ఎదుర్కొన్న ఆ సంఘటన గురించి ఇప్పటికీ నేను ఎవరితో పంచుకోలేదు. ఆరోజు కాస్త ధైర్యం చేసి ఆ వేధింపుల గురించి అమ్మానాన్నలకు చెప్పి ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ అప్పుడు చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు చెప్పినా వారిని బాధపెట్టడం తప్ప.. మరో ఉపయోగం లేదు. దాని గురించి దాచి, ఓ తప్పు చేశానన్న ఫీలింగ్ మాత్రం నా మనసులో మిగిలిపోయింది. అందుకే మీరైనా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యంగా వాటి గురించి అందరికీ చెప్పండి. సహాయం పొంది, అపరాధ భావాన్ని తొలగించుకోండి.