నమస్తే మేడమ్.. నాకు పెళ్త్లె 3 సంవత్సరాలైంది. ఒక పాప కూడా ఉంది. నా భర్తే నాకు పెద్ద సమస్య. తను బాధ్యత లేని వ్యక్తి. ఉద్యోగం చేయడం అంటే తనకు చాలా చిరాకు.. కష్టపడి పని చేయాలంటే ఏదో బాధగా, భారంగా ఫీలవుతాడు. జాబ్‌కి ఒక రోజు వెళ్లాడంటే 4 రోజులు మానేస్తాడు. ఎంతసేపూ కష్టపడకుండా, సులభంగా డబ్బులు రావాలనుకుంటాడు. తనకు తల్లి మీద కానీ, తండ్రి మీద కానీ గౌరవం లేదు. ఆత్మన్యూనతా భావం చాలా ఎక్కువ. తన కంటే తక్కువ హోదా ఉన్న వాళ్లతోనే మాట్లాడతాడు. మన కంటే మంచి స్థాయిలో, మంచి ప్రవర్తనతో ఉన్నవాళ్లతో స్నేహం చేస్తే వాళ్లు మనకు అవకాశాలు ఇస్తారు కదా అనే ఆలోచన తనకు అస్సలు ఉండదు. భవిష్యత్తులో ముందుకు వెళదాం అన్న ఆలోచన అస్సలుండదు. ఎంతసేపూ కష్టపడకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తాడు. ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ జీవితం మీద ఉండదు. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలాడతాడు. తనని నమ్మిన వాళ్లని దారుణంగా మోసం చేస్తాడు. స్వార్థం ఎక్కువ. ఏ భర్త అయినా తన భార్యాపిల్లల్ని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటాడు. కానీ తను మాత్రం నన్ను ఎలా ఏడిపించాలి?, ఎలా హింస పెట్టాలి? అని ఆలోచిస్తాడు. ప్రతి మాటకు తప్పులు తీసి గొడవ పెట్టుకుంటాడు. నన్ను మానసికంగా హింసించి, ఏడిపించి ఆనందం పొందుతాడు. నేను చాలా సెన్సిటివ్. గొడవలంటే నాకు చాలా భయం. నా చదువు పూర్తయ్యేంత వరకు మా తల్లిదండ్రులు ఎప్పుడూ నా ముందు గొడవ పడలేదు. స్కూల్, కాలేజీ, ఇల్లు తప్ప నాకు మరే ధ్యాస ఉండేది కాదు. ఇలాంటి మనస్తత్వం ఉన్న నేను నా భర్త వల్ల మానసికంగా నలిగిపోతున్నాను. ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నాను. బీటెక్ చదివాడు కానీ చదువు విలువ అస్సలు తెలీదు. పెద్దవాళ్లను ఎదిరించి మాట్లాడడమే గొప్ప అనుకుంటాడు.

నా మాటంటే లెక్క లేదు!
మీకు ఓ ఉదాహరణ చెప్తాను. తన సొంత అక్కా వాళ్లు టూర్‌కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయి వాళ్ల అక్క చనిపోయింది. ఆమె చిన్న కూతురికి యాక్సిడెంటులో కాలు, చేయి విరిగి ఐసీయూలో ఉంటే ఆ అమ్మాయి దగ్గర రెండు రోజులు ఉండి అక్కడ్నుంచి పారిపోయి ఇంటికొచ్చాడు. ఎందుకొచ్చావని అడిగితే హాస్పిటల్లో ఉండలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు అనిపించింది.. సొంత అక్క పిల్లల్నే వదిలేసి వచ్చాడు.. నన్ను, నా బిడ్డని అలానే వదిలేసి పారిపోతాడేమో అని అనుకున్నాను. కరక్ట్‌గా అలానే చేశాడు. నాకు డెలివరీ అయ్యాక 10 రోజులకి గొడవ పెట్టుకొని పారిపోయాడు. ఒకసారి మా అత్తయ్య వాళ్ల ఇంట్లో 10 రోజులు ఉన్నాం. అత్తయ్య, మావయ్య హైదరాబాదు వెళ్లారు. వెళ్లేటప్పుడు మిల్లుకి వెళ్లి వడ్లు పట్టించుకు రమ్మని చెప్పి వెళ్లింది అత్తయ్య. అదే మాట నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకోలేదు. తనకి ఇష్టమైన కరివేపాకు అయిపోతే.. అయిపోయిందని చెప్పలేదేంటని గొడవ పెట్టుకునే వాడు. కానీ రైస్ మాత్రం పట్టించుకుని తెచ్చేవాడు కాదు. తన గురించి తప్ప, ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోని అతని వైఖరి చూస్తే నాది, నా బిడ్డ పరిస్థితి ఏంటని చాలా భయం వేసింది. ఆ పది రోజులు గుడిలో రాముల వారికి తలంబ్రాలు పోసిన పసుపు బియ్యం ఉంటే అవే వండి పెడితే తిన్నాడు.. కానీ వడ్లు మాత్రం పట్టించుకు రాలేదు.

క్షణక్షణం నరకమే!
రోజూ అర్ధరాత్రి నేను పడుకున్న గది డోర్ కొడుతుంటాడు.. 'నాకు భయంగా ఉంది డోర్ కొట్టద్దు..' అని చెప్పినా అలానే చేసేవాడు. నేను ఏడుస్తుంటే ఆనందపడి నవ్వుకునేవాడు. ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుని అన్నం, కూర విసిరి కొడతాను అంటాడు. చాలా భయం వేస్తుంది. ఓ రెండు రోజులు బాగానే ఉంటాడు ఆ తరువాత రోజు నుంచి ఎలా ఉంటాడో తనకే తెలియదు. క్షణక్షణం చస్తూ బతకాలి. అలా ఒకసారి గొడవ పెట్టుకుని తను నాకు ఇచ్చిన ఫీచర్ ఫోన్‌ని లాగేసుకున్నాడు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అవ్వాలని టార్చర్ చేసేవాడు. 'నీకు నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకున్నాను. కానీ సిజేరియన్ అయ్యింది'.. కావాలని ఆపరేషన్ చేయించుకున్నానని ఏడిపించేవాడు. నాకు పాప పుట్టింది. పాపకి నక్షత్ర శాంతి పూజలు చేయించాలి అని చెప్పాను. 'అమ్మాయి పుట్టింది.. పూజలు చేయించను' అని మళ్లీ గొడవ పెట్టుకుని పారిపోయాడు. మా అత్తయ్య, మావయ్య తనకే మద్దతు పలుకుతారు. మా మావయ్య మా నాన్నని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తారు. 'మీ కొడుకు లాంటోడు.. మీరే బతిమాలి ఇంటికి రమ్మని చెప్పండి' అని చెప్పేవారు. మా నాన్న నా తప్పు లేకపోయినా అతనికి ఫోన్ చేసి వెళ్లి ఇంటికి తీసుకుని వచ్చారు. ఇలా రెండు మూడు సార్లు జరిగింది. నా తప్పు లేకపోయినా నా తండ్రి తనను అలా బతిమిలాడుతుంటే నాపైన నాకే అసహ్యం వేస్తోంది.
వేరు కాపురం అంటున్నాడు.. నావల్ల కాదు!
పెళ్త్లెన దగ్గర్నుంచి ఇప్పటి వరకు నేను మా అమ్మ వాళ్లింట్లోనే ఉన్నాను. వేరు కాపురం పెట్టలేదు. తను ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ పెట్టాలంటున్నాడు. నాకు వేరే ఫ్యామిలీ అంటేనే చాలా భయంగా ఉంది. తనకు భార్య అంటే ఓ యంత్రం లాగా పని చేసే పని మనిషి మాత్రమే. నాకు అలా పని చేసే శక్తి లేదు. తను పెట్టే మెంటల్ టార్చర్ వల్ల ప్రస్తుతం నేను ఒకరు వండిపెడితే తినే పరిస్థితిలో ఉన్నాను. నమ్మకం లేని వ్యక్తితో, అబద్ధాలు చెప్పే వ్యక్తితో, కట్టుకున్న భార్యను కూడా దారుణంగా మోసం చేసే వ్యక్తితో, మానసిక స్థిరత్వం లేని వ్యక్తితో, జీవితంలో ముందుకు వెళ్లాలన్న ఆలోచన లేని వ్యక్తితో, తన పంతం మాత్రమే గెలవాలి అనుకునే మూర్ఖుడితో, నా బాధ అర్థం చేసుకోని వ్యక్తితో, నన్ను మానసికంగా హింసించే వ్యక్తితో ఎలా కలిసుండాలి..? పాప వయసు ఇప్పుడు రెండేళ్లు. పాప పుట్టిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్‌కి వచ్చి పాప ఎదుగుదల ఎలా ఉంది అని ఒక్కసారి కూడా అడగలేదు.
కన్న బిడ్డంటే మమకారం లేదు!
పాప పుట్టిన తర్వాత కొన్ని రోజుల దాకా నా పాలు తాగలేదు.. ఓ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏడుస్తూనే ఉంది. హాస్పిటల్‌కి తీసుకుని వెళ్దాం అని ఫోన్ చేస్తే.. 'హాస్పిటల్‌కి తీసుకెళ్లడం అవసరమా' అని అడిగాడు. వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్‌కి వెళ్దామని ఫోన్ చేస్తే వచ్చేవాడు కాదు. వూరిలోనే ఉంటాడు కానీ పని ఉంది అని చెప్పి రాడు. తన కన్న బిడ్డ మీద తనకు బాధ్యతా లేకపోతే ఎలా? ఎవరు చూస్తారు? 'పాప విషయంలో మీ కొడుకు ఇలా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడ'ని మా మామయ్యతో చెబితే.. 'తల్లివి నువ్వు ఉన్నావు కదా' అంటున్నారు. అన్ని బాధ్యతలు తల్లికేనా? తండ్రికి ఏ బాధ్యత ఉండదా? తండ్రి ఏ బాధ్యతా లేకుండా బలాదూర్ తిరగొచ్చా? ఇక జీతం విషయానికొస్తే.. 'నాకు నెలకు 20,000 చాలు. అంతకన్నా ఎక్కువ కష్టపడను' అంటాడు. ఆ వచ్చే జీతం తనకే సరిపోదు. ఆరోగ్యం కోసం అని చెప్పి మొత్తం తినడానికే ఖర్చు పెడుతున్నాడు. అలా అయితే మిగతా ఖర్చులు ఎలా భరిస్తావు అనడిగితే.. నీకు డబ్బు పిచ్చి అని గొడవ పెట్టుకుని మళ్లీ పారిపోయాడు. నా భర్త ఆర్థికంగా స్థిరపడేదాకా వేరే కాపురం పెట్టడానికి నన్ను, పాపను పంపను అంటున్నారు మా నాన్న. అలా గత సంవత్సరంన్నర నుంచి కనీసం పాపను చూడటానికి కూడా రాలేదు.
నన్నూ అమ్మేస్తాడేమో?!
ఎలాంటి కష్టం లేకుండా ఉన్న ఆస్తులు అమ్ముకొని బతకాలి అని చెప్తాడు. తన లాజిక్ ప్రకారం అన్నీ అమ్ముకొని బతుకుతాడు, ఆస్తులు అన్నీ కరిగిపోయాక నన్ను, పాపని అమ్మడు అని గ్యారంటీ ఏంటి? నాకు చాలా భయంగా ఉంది మేడమ్. మా అత్తయ్య, మామయ్య వాళ్లు కూడా.. నయా పైసా ఖర్చు లేకుండా ఉంటుందని కొడుకుని అత్తగారింట్లో ఉండమని.. వాళ్లే నిన్ను పోషిస్తారని చెప్తారు. అంతేకానీ 'కష్టపడు, జీవితంలో మంచి పేరు తెచ్చుకో, ఎవరి మీదా ఆధారపడకుండా నీ భార్యాపిల్లల్ని చూసుకో' అని ఏనాడూ చెప్పరు. నేను జాబ్ చేసుకుంటూ నా పాపని నేనే చూసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను పాపను కూడా ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాను. తన మెంటల్ టార్చర్ వల్ల నా ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఇప్పుడు నన్ను, నా పాపని మా తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మెంటల్ టార్చర్ పెట్టాడు. ఇలానే ఉంటే ఇంకా ఏం చేస్తాడో అని భయంగా ఉంది. నాకేమైనా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటని రోజూ రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు. తనకున్న మెంటల్ కండిషన్‌కి నా ప్రాణాలు ఎప్పుడు తీసేస్తాడో అని చస్తూ బతుకుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు.
- ఓ సోదరి
జ: మీ భర్త వ్యక్తిత్వం విషయంలో, అతని ప్రవర్తన విషయంలో మీరు బాగా విసిగిపోయారని, మీ మనసు గాయపడిందని మీ సుదీర్ఘ ఉత్తరం స్పష్టం చేస్తోంది. అసలు సమస్య ఏంటనే స్పష్టత మీలో కనిపిస్తోంది.. కానీ మీ వైపు నుంచి తీసుకునే చర్యలు ఏంటీ? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదనిపిస్తోంది. ప్రత్యేకించి అతని మానసిక స్థితి పట్ల మీకున్న అంచనా, అవగాహన స్పష్టంగానే ఉన్నాయి. సమస్యలనేవి ఒక్కరోజులో సమసిపోయేవి కావు. గత కొన్నేళ్లుగా మీరు ఈ సమస్యలు అనుభవిస్తున్నారని మీ సుదీర్ఘ ఉత్తరం తెలియజేస్తోంది. అయితే మీ విషయంలో, మీ ఆరోగ్యం విషయంలో ముందుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు గుర్తించాలి. మీ మనసుని, మీ శరీరాన్ని పూర్తిగా మీ నియంత్రణలోకి తెచ్చుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా మొట్టమొదటి అడుగులు వేయాలి.

ఈ సమస్యలతో మీ ఆరోగ్యం చెడగొట్టుకుంటే.. మీరు కూడా మీ పాపని సరిగా చూసుకోలేని పరిస్థితి రావచ్చు. కాబట్టి ముందుగా మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విషయంపై దృష్టి పెట్టండి. దానికి మీ మనసు కూడా మీకు సహకరించాలి. కాబట్టి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి, మనసుని దృఢపరచుకోవడానికి ప్రయత్నాలు చేయండి.దీనికోసం మీకు కావాల్సింది ఆత్మస్త్థెర్యం.. ముందుగా మీ ఆత్మస్త్థెర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు చదువుకున్నారు.. ఉద్యోగం చేసే శక్తి కూడా ఉందని మీ ఉత్తరం సూచిస్తోంది. అలాంటప్పుడు అతనితో జీవితాన్ని కొనసాగించినా.. కొనసాగించకపోయినా పాపకోసం, పాప భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మీరు తగిన చర్యలు తీసుకోవడం అవసరం.
నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి...
ప్రస్తుతానికి మీ తల్లిదండ్రులు మీకు, మీ పాపకు ఆసరాగా నిలబడ్డారు కాబట్టి... దానిని వూతంగా తీసుకుని సానుకూల దృక్పథంతో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకొనే దిశగా అడుగులు వేయండి. మీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాక పై చదువులు చదవాలనుకుంటున్నారో, లేదా ఉద్యోగం చేయాలనుకుంటారో ఆలోచించుకోండి. చదువు అనేక విధాలుగా మనల్ని మనం మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దూరవిద్యా విధానం ద్వారా విద్యార్హతలు మెరుగుపర్చుకునే అవకాశాలూ ఉన్నాయి. అలాగే మీ పరిధిలో మీరున్న పరిస్థితులకనుగుణంగా, మీకు, మీ పాపకు ఇబ్బంది కలగకుండా మీరు చేయగలిగినటువంటి ఉద్యోగాలు ఏంటనేవి ఆలోచించుకోండి. ముఖ్యంగా మీ ఆరోగ్యంపైన భారం పెట్టనుటువంటి ఉద్యోగాలు ఏమున్నాయో ఆలోచించుకోండి. ఒకేసారి పూర్తిస్థాయి ఉద్యోగం చేయడం కష్టమనుకుంటే ముందు పార్ట్టైంతో మొదలుపెట్టి క్రమేపీ మీ స్థాయిని విస్తరించుకోండి.. ఈ లోపల మీ నైపుణ్యాలను, అర్హతలను కూడా మెరుగుపర్చుకోండి.
మీ కాళ్లపైన మీరు నిలబడండి...
ఇవన్నీ చేసిన తర్వాత మీలో ఆత్మవిశ్వాసం, మీరు మీ పాపను బాగా చూసుకోగలను అన్న ధైర్యం నిండినపుడు మీ భర్తతో జీవితాన్ని ముందుకు కొనసాగించాలా? వద్దా? అనే విషయాన్ని ఆలోచించండి. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం అతడికి అండగా ఉన్నారన్న ధైర్యంతో అతని తల్లిదండ్రులు అతని విషయంలో పట్టించుకోవట్లేదు.. అయితే వారు ఎక్కువ బాధ్యత తీసుకోవడం లేదో.. నిజంగానే తీసుకోలేకపోతున్నారో అన్న విషయం స్పష్టంగా తెలియదు. పెళ్త్లెన దగ్గర నుంచి మీ బాగోగులు తల్లిదండ్రులే పట్టించుకున్నారు కాబట్టి, ఇప్పుడు కూడా వాళ్లే చూసుకోవాలని మీ అత్తమామలు భావిస్తున్నట్లు మీ ఉత్తరం చెబుతోంది. అయితే మీ ఇరువురి విషయంలో కలకాలం ఇద్దరి తల్లిదండ్రులు నిలబడలేరు అనేది వాస్తవం. కాబట్టి మీ ఇద్దరూ జీవితాన్ని కలిసి గడపదలచుకున్నారా? లేదా ఎవరి జీవితం వారు గడపదలచుకున్నారా? అనే విషయంలో స్పష్టత తెచ్చుకోవాలి. అయితే ఆ దిశగా అడుగులు వేసే ముందు మీ ఆర్థిక స్థితిని ఒక స్థాయికి తెచ్చుకోవడం, మీ కాళ్ల మీద మీరు నిలబడడం, మీ పాపకు మీరు అండగా ఉండగలను అనే మనోధైర్యాన్ని, ఆత్మస్త్థెర్యాన్ని మీకు మీరు తెచ్చుకోవడం ముఖ్యం. అతనితో జీవితం గడపడమా? లేదా అన్న విషయం ఆ తర్వాతే ఆలోచించాలి.
సానుకూల సంభాషణతో..
ఈ లోపల అతనితో స్పష్టంగా మీరు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇద్దరూ కలిసి పాప బాధ్యత పంచుకోవాలి. ఇటు మీ తల్లిదండ్రులు కానీ, అతని తల్లిదండ్రులు కానీ కలకాలం మీ బాధ్యతలు పంచుకోరు అనే విషయాన్ని స్పష్టం చేయండి. కేవలం ఇరవై వేల వరకే సంపాదించడం కాకుండా పాప భవిష్యత్తు దృష్ట్యా క్రమక్రమంగా అతడు మీ కుటుంబ పరిస్థితిని ఎలా మెరుగుపరచగలడు అన్న విషయాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయమనండి. అతనితో మీరు సానుకూలంగా మాట్లాడే పరిస్థితి ఇంకా కొనసాగుతూ ఉంటే.. సానుకూలమైనటువంటి సంభాషణలో భాగంగా అతనితో ఒక్కసారిగా జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాల గురించి మాట్లాడకుండా చిన్న లక్ష్యాల గురించి, అతను సాధించగల లక్ష్యాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే అతను అలా ఇంట్లో నుంచి పారిపోవడం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం వంటి నేపథ్యంలో అతనికి అవసరమైన మానసిక నిపుణుల సహాయం అతని తల్లిదండ్రుల ద్వారా అతనికి ఇప్పించడం అవసరం. ఇలా అనేక కోణాల నుంచి ఆలోచించి మీ జీవితానికి తగ్గ నిర్ణయాన్ని తీసుకోండి. అయితే ముందుగా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, మీ కాళ్ల మీద నిలబడడం అనేది అతనితో జీవితం కొనసాగించినా, కొనసాగించకపోయినా.. అన్ని విధాలుగా అవసరమే.