ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతూ ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు వైద్యులు. తమ చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నా లెక్కచేయకుండా ఊపిరాడనివ్వని పీపీఈ కిట్లను ధరిస్తూనే కరోనా రోగులకు ఊపిరి పోస్తున్నారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరు వైద్యులు, నర్సులు అదే మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ డాక్టర్ కొన్ని రోజుల క్రితం ఇలాగే కరోనా బారిన పడింది. అదే సమయంలో న్యుమోనియా సోకడంతో మరణం అంచుల దాకా వెళ్లింది. అలా సుమారు రెండు వారాల పాటు ఐసీయూలో ఉన్న ఆమె ఇటీవల కొవిడ్ నుంచి కోలుకుంది. ఇప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్న ఈ డాక్టరమ్మ కరోనా రోగులను కాపాడేందుకు మళ్లీ ఆస్పత్రిలో అడుగుపెట్టింది.
పాపను అమ్మానాన్నలకు అప్పగించి!
‘నాపేరు శోభా కుమారి. కేరళ రాష్ర్టంలోని అలప్పుజా మా సొంతూరు. ప్రస్తుతం త్రిపురనితురాలో వైద్యురాలిగా పనిచేస్తున్నాను. ఇంజినీర్‌గా పనిచేస్తున్న నా భర్త, ఏడాదిన్నర కూతురుతో కలిసి ఇక్కడే నివాసముంటున్నాను. సెకండ్ వేవ్‌లో భాగంగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లే మా కేరళలోనూ కొవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో నేనూ కరోనా పోరులో స్వచ్ఛందంగా భాగమవ్వాలనుకున్నాను. కొవిడ్ వాలంటీర్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోగా కలూరు కొవిడ్ హాస్పిటల్లో నాకు విధులు కేటాయించారు. నా భర్తతో పాటు కుటుంబ సభ్యులందరూ నా నిర్ణయాన్ని మెచ్చుకుంటూ ముందుకెళ్లమన్నారు. దీంతో నా ఏడాదిన్నర కూతురును మా అమ్మానాన్నలకు అప్పగించి అక్టోబర్ 23న కొవిడ్ డ్యూటీకి బయలుదేరాను’..

రెండోసారి కానీ బయటపడలేదు!
‘ఎన్నో జాగ్రత్తలు, నిబంధనల నడుమ సుమారు రెండు వారాల పాటు కరోనా రోగులకు సేవలందించాను. అయితే ఆ తర్వాత నాకు ఒంట్లో నలతగా అనిపించింది. తేలికపాటి జ్వరం కూడా వచ్చింది. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా యాంటిజెన్ కరోనా టెస్ట్ చేయించుకున్నా. నెగెటివ్ అని తేలడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నా. కానీ ఆ తర్వాతే కరోనా తన అసలు రూపం చూపించింది. జ్వరం తగ్గినా విపరీతమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి. మళ్లీ కరోనా పరీక్షకు వెళదామని నిర్ణయించుకున్నాను. ఈసారి యాంటిజెన్ కాకుండా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాను. అప్పటివరకు నా శరీరంలో దాక్కొని నాతో దాగుడుమూతలు ఆడుతున్న కరోనా వైరస్ రెండో టెస్ట్‌లో కానీ బయటపడలేదు’..

అదే ఆస్పత్రిలో రోగిగా చేరాను!
‘విధి ఆడిన వింత నాటకం ఏమిటంటే... అప్పటివరకు అదే ఆస్పత్రిలో డాక్టర్‌గా సేవలందించిన నేను అక్కడే కరోనా రోగిగా చేరడం. గోరుచుట్టుపై రోకలి పోటులా అదే సమయంలో న్యుమోనియా నా ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చింది. ఊపిరితిత్తుల పనితీరు మందగించడంతో శ్వాసకోశ సమస్యలు మొదలయ్యాయి. దీంతో వైద్యులు నన్ను ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడి వైద్యులు నాకెంతో అండగా నిలిచారు. కరోనాను జయించడానికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని అందించారు. ఓ రోగి స్థానంలో ఉన్న నాకు వైద్యుల విలువేంటో అప్పుడే ప్రత్యక్షంగా తెలిసింది . పది రోజుల తర్వాత కొంచెం నా ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వడంతో సాధారణ గదికి తరలించారు. మరో ఐదు రోజులు గడిచాక నన్ను ఇంటికి పంపించారు’..

కరోనా కరుణించినా..
‘కరోనా కరుణతో రెండు వారాల తర్వాత ఇంటికి చేరుకున్న నన్ను ఇతర అనారోగ్య సమస్యలు మాత్రం అంత సులభంగా విడిచిపెట్టలేదు. మాట్లాడడానికి, నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఛాతీ నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు మళ్లీ బాధించాయి. వైద్యులు పరిశీలనలో నాకు ‘మయోకార్డయిటిస్’ (గుండె కండరాలకు సంబంధించిన సమస్య) ఉందని తేలింది.
సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన గుండెపోటు వచ్చే అవకాశముందని డాక్టర్లు హెచ్చరించారు. దీంతో మరికొన్ని రోజుల పాటు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. క్రమం తప్పకుండా మందులు తీసుకోవడంతో నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడింది. ఛాతీ నొప్పి తగ్గినా ఇంకా కొన్ని శ్వాసకోశ సమస్యలు బాధిస్తున్నాయి. అయినా సరే మళ్లీ కొవిడ్ డ్యూటీకి వెళదామని నిర్ణయించుకున్నాను. కానీ కొంతమంది నా నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. మరికొన్ని రోజులు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ నేను నా నిర్ణయానికే కట్టుబడ్డాను. ఎందుకంటే ఓ రోగిగా ఐసీయూ బెడ్‌పై ఉన్నప్పుడు వైద్యులు, వారి సేవల విలువేంటో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఆ సమయంలో వారు నాకు అన్ని విధాలా అండగా నిలిచారు. నాకు మళ్లీ ప్రాణం పోశారు. ఇప్పుడు అక్కడ నాలాంటి రోగులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఓ డాక్టర్‌గా వారిని కాపాడాలనుకుంటున్నాను. మళ్లీ సాధారణ జీవితం ప్రారంభించేలా వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిద్దామనుకుంటున్నాను’ అని అంటోందీ కరోనా వారియర్.
కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధుల్లో పాల్గొంటోన్న డాక్టర్ శోభాకుమారి, ఆమెతో పాటు అలాంటి మరెందరో కరోనా యోధులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం మన బాధ్యత. సెల్యూట్ కరోనా వారియర్స్!