Image for representation
పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు. ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి.. అందుకే ఎప్పుడూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. అందరితోనూ చక్కటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవాలి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన కోడళ్లను కూతుళ్లలా చూసుకోవాలి. అప్పుడే వృద్ధాప్యంలో వారు ఆసరాగా నిలుస్తారు.. అంటోందో కోడలు.. మరి ఆమె ఈ మాట ఎందుకు చెబుతోందో.. అసలు కోడళ్లను కూతుళ్లతో సమానంగా చూడాల్సిన అవసరం ఎందుకుందో.. తెలుసుకోవాలంటే ఈ కోడలి అంతరంగం వినాల్సిందే..
నా పేరు సరోజ. మాది గుంటూరు జిల్లాలోని ఓ చిన్న గ్రామం.. అమ్మానాన్నలకు మేం ముగ్గురం ఆడపిల్లలమే.. ముగ్గురిలో నేనే పెద్దదాన్ని.. చదువులో ఎప్పుడూ ముందే ఉండేదాన్ని. అయినా.. ఇంటర్ కాగానే మంచి సంబంధం వచ్చిందంటూ పెళ్లి నిశ్చయించారు అమ్మానాన్న. వద్దని వారిస్తుంటే.. తమ పరిస్థితిని వివరించారు.. ముగ్గురు ఆడపిల్లలు.. నాన్న వ్యవసాయం చేసి సంపాదించిన అరకొర డబ్బుతో ఇల్లు గడవాలి.. దానికి తోడు మరింత పైచదువులంటే కష్టమని అమ్మ నచ్చజెప్పడంతో పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత రాజేష్‌తో నా పెళ్లి జరిగింది. ఆయన గవర్నమెంట్ టీచర్.. తండ్రి చనిపోవడంతో వూళ్లో ఉన్న పొలాన్ని కౌలుకి ఇచ్చేసి.. వాళ్ల అమ్మ, అతను కలిసి అతడు పనిచేసే పల్లెటూల్లోనే ఉంటున్నారు. ఉన్నంతలో మంచి కట్నకానుకలిచ్చి.. ఘనంగానే నా పెళ్లి జరిపించారు మా అమ్మానాన్న..
పెళ్త్లె అత్తారింటికి వెళ్లిన నా జీవితం కొన్నాళ్లు బాగానే సాగింది. అత్తగారు అప్పుడప్పుడూ సూటిపోటి మాటలనడం తప్ప.. మా కాపురంలో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. అయితే పెళ్లయిన మూడు నెలల తర్వాత మా కాపురంలో గొడవ ప్రారంభమైంది. పెళ్లయినప్పుడు మా అమ్మావాళ్లు బంగారం చేయించలేని పరిస్థితిలో ఉన్నారు. పంటలు బాగా పండితే.. కోతలు పూర్తవగానే బంగారం పెడతామని చెప్పి నా పెళ్లి జరిపించారట. కోతలు పూర్తయ్యాయి. అయితే నా పెళ్లికి చేసిన అప్పుల కారణంగా ఆ ఏడాది వచ్చిన కొద్దిపాటి లాభాల్లో రూపాయి కూడా మిగలని పరిస్థితి ఏర్పడింది. దీంతో మా అత్తగారి వేధింపులు ప్రారంభమయ్యాయి. నా భర్త ఉన్నంతసేపూ కాస్త సూటిపోటి మాటలు మినహా పెద్దగా ఏమీ అనేవారు కాదావిడ. అయితే ఆయన వెళ్లిపోగానే నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టడం.. అప్పుడప్పుడూ కొట్టడం కూడా చేసేది. పైగా అగ్నికి ఆజ్యం పోసినట్టు.. మధ్యలో పండగలకు వచ్చినప్పుడు ఆవిడ కూతురు కూడా నాకు ఆడపడుచు కట్నం పెట్టలేదంటూ నన్ను ఈసడించుకునేది. ఇవన్నీ మా ఆయనకెందుకులే చెప్పడం.. అని నేను చాలారోజులు ఏమీ మాట్లాడలేదు.
అయితే కొన్నాళ్లకు హింస బాగా ఎక్కువవడంతో మా ఆయనకు చెప్పక తప్పలేదు. అయితే ఆయన నా మాటల్ని నమ్మలేదు. ఏదో అత్తగారు కాబట్టి నాలుగు మాటలంటుంది తప్ప.. కొట్టే స్థాయికి చేరుకోదు మా అమ్మ.. అంటూ నా మాటల్ని పెడచెవిన పెట్టేవాడు. దీంతో ఆవిడ మరింత రెచ్చిపోయేది. కొన్నిసార్లు అన్నం కూడా పెట్టకుండా నన్ను సాధించేది. ఏం చేయాలో నాకు పాలుపోయేది కాదు.. అమ్మానాన్నల్ని అడుగుదామంటే ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కరవు తాండవించడంతో వాళ్లూ నష్టాల్లోనే కూరుకుపోయారు. ఇలా చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాకో పాప. అయినా కానీ మా అత్తగారి హింస అలాగే కొనసాగుతూనే ఉంది. దీనికి ఎలాగైనా అంతం పలకాలని నిర్ణయించుకున్నా. దీంతో ఒకరోజు మా వారితో గొడవ పెట్టుకొని మరీ ఆయనకు నా బాధను వివరించా. కావాలంటే స్కూల్‌కి వెళ్లకుండా ఓరోజు మధ్యలోనే ఇంటికి వచ్చి చూడమని చెప్పా. దానికి ఆయన సరేనన్నారు.

ఆ రోజు కూడా రోజూలాగే ఇంటి పని పూర్తి చేసి, పాపకు అన్నం పెడుతున్నా.. 'కట్నం తీసుకురావడం చేతకాదు కానీ.. కుంభాలు కుంభాలు మేయడం మాత్రం చేతనవుతుంది' అన్న మా అత్తయ్య మాటలకు.. 'పాపకు తిండి పెడుతున్నా.. నేను తినట్లేదు.. దిష్టి పెట్టకండి..' అంటూ తిరిగి సమాధానమిచ్చా.. దీంతో ఆవిడ కోపం నషాళానికంటింది. నాకే ఎదురు సమాధానమిస్తావా? అంటూ నన్ను కొట్టడం ప్రారంభించింది. ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్లకు తెలియకూడదంటూ సైలెంట్‌గా ఉండిపోయే నేను.. ఆరోజు గట్టిగా ఏడవడం ప్రారంభించా. అప్పుడే ఇంటికొస్తున్న మా ఆయన ఆ ఏడుపు విని కంగారుగా ఇంట్లోకి వచ్చి చూసేసరికి మా అత్తగారి చేతిలో దుడ్డుకర్ర కనిపించింది. దీంతో ఆయనకు పరిస్థితి మొత్తం అర్థమైంది. మా అత్తగారిని ఏమీ అనలేక.. విరక్తిగా ఓ చూపు చూసి.. నన్ను తీసుకొని లోపలికి వెళ్లిపోయారు. ఆపై ఆవిడతో మాట్లాడ్డం మానేశారు. దీంతో భరించలేని మా అత్తగారు కూతురింటికి వెళ్లిపోతానంటూ బెదిరించడం ప్రారంభించారు. దానికి సరేనన్న నా భర్త ఆమెను మా ఆడపడుచు ఇంటికి తీసుకెళ్లి వదిలేసి.. నెలకు ఆమె ఖర్చులకు సరిపోనూ డబ్బులిచ్చి.. కౌలు మీద వచ్చిన డబ్బులన్నీ ఆమె అకౌంట్లోనే పడేలా ఏర్పాటు చేసి తిరిగొచ్చారు.
ఎంత డబ్బులొచ్చినా.. అత్తగారిని ఇంట్లో పెట్టుకోవడం వాళ్లాయనకు కూడా నచ్చలేదు కాబోలు.. వాళ్లూ ఆవిడను సూటిపోటి మాటలనడం ప్రారంభించారట. మా ఇంట్లో అయితే ఆవిడ ఏ పనీ చేసి ఎరుగరు. నా పెళ్లికి ముందు కూడా పనిమనిషే అన్ని పనులూ చేసేది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత కూతురు మాత్రం అన్ని పనులూ పురమాయిస్తూ.. అకౌంట్లో పడే డబ్బులన్నీ తీసుకొని.. ఆవిడతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రారంభించిందట. కొన్నాళ్లకు ఆవిడ బీపీ మందులు అయిపోయినా తిరిగి తేకపోవడంతో బీపీ ఎక్కువై ఆసుపత్రిలో చేర్చారు. బీపీ మరీ ఎక్కువైపోవడంతో కొద్దిగా పక్షవాతం కూడా వచ్చింది. దానివల్ల ఆవిడ కుడికాలు కదపలేరు. అమ్మ ఆరోగ్యం పాడైంది.. ఆసుపత్రిలో చేర్చామని మా ఆడపడుచు నుంచి కబురందితే వెళ్లి మా అత్తగారిని తిరిగి తీసుకొచ్చాం. ఇప్పుడు మా అత్తగారు పూర్తిగా మారిపోయారు. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ఆవిడ కోడలిని కూతురులా చూసుకోలేకపోయినా.. నేను మాత్రం ఆవిడను నా తల్లిలాగే చూస్తున్నా.
ఇదంతా మీకెందుకు చెబుతున్నా అంటే.. అమ్మంటే కూతుళ్లకు ప్రేమెక్కువే.. కానీ వారు ఎప్పుడూ ప్రేమగా వ్యవహరిస్తారనే రూలేం లేదు.. కోడళ్లకు అత్తలకు క్షణం పడదని చెప్పేవారు చాలామందే.. అయితే అత్తగారిని కూడా అమ్మలా చూసుకునే కోడళ్లు కూడా ఉంటారు. అందుకే ప్రతి అత్తా.. కోడలిని కూడా కూతురులా చూసుకుంటే ఆమె నుంచీ తిరిగి తల్లిలాంటి ప్రేమనే పొందే అవకాశం ఉంటుంది.