‘బయటికెళ్తే మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం, చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండడం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదు..’ అని మన మనసులో బలంగా ముద్ర పడిపోయింది. మనం తీసుకునే ఇలాంటి జాగ్రత్తల వల్ల మనకు, మన చుట్టూ ఉన్న వారికి మన వల్ల ముప్పు ఉండకపోవచ్చు.. కానీ మన చుట్టూ ఉండే వారి అలక్ష్యం కూడా మనల్ని చిక్కుల్లో పడేసే ప్రమాదం లేకపోలేదు. అందుకు తానే ఉదాహరణ అంటోంది కూకట్‌పల్లిలో నివాసం ఉండే నమిత. తాను ఏదైతే జరగకూడదనుకుందో అదే జరిగిందని చెబుతోంది. వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తోంది కూడా! మరి, ఇంతకీ ఆమె మనసులోని ఆవేదనేంటో తన మాటల్లోనే..!
కరోనా అంటే మొదట్లో ఎంతలా భయపడేవారో ఇప్పుడు దాన్ని అంత తేలిగ్గా తీసుకుంటున్నారు. కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఇక వైరస్ పీడ విరగడైనట్లే అని చాలామంది ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ నిపుణులు చెప్పేదాన్ని బట్టి చూస్తే వ్యాక్సిన్ వచ్చే దాకా మనం రిలాక్సవడానికి వీల్లేదన్న విషయం అర్థమవుతుంది. లాక్డౌన్ ప్రకటించాక ఆరు నెలల పాటు ఇంటి నుంచే పనిచేసిన మేము.. గత రెండు నెలలుగా ఆఫీస్‌కెళ్లి విధులు నిర్వర్తిస్తున్నాం. అయినా ఎవరి జాగ్రత్తల్లో వారుంటున్నాం..
******

పైగా చాలా కంపెనీల్లోలాగే మా ఆఫీస్‌లో కూడా షిఫ్టుల వారీగా పనిచేయాలన్న నియమం ఉండడం ఒకందుకు మంచిదే అయిందనిపిస్తోంది. దానివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం పాటిస్తూనే పని చేసుకోగలుగుతున్నాం. అత్యవసరమైతే తప్ప గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోవట్లేదు. అయితే మనం ఇలా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన చుట్టూ ఉండే వారి వల్ల మనకు ముప్పు వచ్చే అవకాశమూ లేకపోలేదు. నా విషయంలో అలాగే జరిగింది. నా భర్త ఇంటి నుంచే పని చేస్తున్నారు. నా ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లో ఉండే ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇంటి నుంచి నేనొక్కదాన్నే బయటికొస్తున్నాను కాబట్టి నేను మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఓవైపు ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఆఫీస్‌కి వెళ్లడం, తిరిగి ఇంటికొచ్చాక మళ్లీ పనులతో తీరిక దొరక్కపోయినా ఓపిక చేసుకొని మరీ నాతో పాటు తీసుకెళ్లిన వస్తువులన్నీ శానిటైజ్ చేసుకుంటున్నా. ఇలా నా జాగ్రత్తలో నేనున్నా కూడా వైరస్ నన్ను వదల్లేదు. కారణం.. నా కొలీగ్ కమల్ అలక్ష్యమే!
******
కరోనా అంటే ముందు నుంచీ అతను తేలిగ్గానే తీసుకుంటూ వచ్చాడు. మాతో మాట్లాడేటప్పుడు మాస్క్ పెట్టుకోకపోగా.. కరోనా జాగ్రత్తల గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారీ ‘వైరస్ నాకు రాదు.. ఒకవేళ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి నాలో ఉంది..’ అంటూ అతి విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడేవాడు. కనీసం చేతులు కూడా శానిటైజ్ చేసుకోకుండానే ఏవేవో ఫైల్స్ కావాలంటూ మా సిస్టమ్స్ కీబోర్డ్స్ తాకే వాడు.. ‘మీరు ఇంత అజాగ్రత్తగా ఉంటే మీకు, మీ ఇంట్లో వాళ్లకే కాదు.. మీ చుట్టూ ఉన్న మా అందరికీ ముప్పే.. కనీస జాగ్రత్తలు పాటించండి’ అని ఎంత మొత్తుకున్నా పెడచెవిన పెట్టేవాడు.. ఇలా అసలు మన మధ్య కరోనా వైరస్ లేదన్నట్లుగా ప్రవర్తించేవాడు. అనకూడదు కానీ.. అతని ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు అతనితో పాటు అతని చుట్టూ ఉన్న నా లాంటి వారిని చిక్కుల్లో పడేసింది. అసలేం జరిగిందంటే..!
******

రోజూలాగే ఆ రోజూ ఆఫీస్‌కి వెళ్లొచ్చా.. మరుసటి రోజు మా బాబు పుట్టినరోజు కావడంతో సెలవు తీసుకున్నా. ఆ రోజు సాయంత్రం బర్త్‌డే పార్టీలో ఉండగానే నా మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. ‘కమల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది!’ అని నా కొలీగ్ ఒకరు సందేశం పంపించింది. దాంతో నేను ఒక్కసారిగా షాక్! ఎందుకంటే కమల్‌ది, నాదీ ఒకే షిఫ్ట్.. పైగా సీటింగ్ కూడా పక్కపక్కనే! ‘నిన్నటి వరకు తనతోనే కలిసి పనిచేశా.. పని గురించి ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం.. ఆ వైరస్ నాకూ అంటిందేమో!’ అన్న భయం ఒకవైపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. ‘అయినా రోజంతా నేను మాస్క్ పెట్టుకునే ఉన్నా కదా.. ఏం కాదు!’ అని మరోవైపు నా మనసుకు ధైర్యం చెప్పుకుంటున్నా. అయినా ఏదో ఓ మూల తెలియని భయం. కేవలం నా గురించే కాదు.. నా వల్ల నా భర్త, పిల్లలు ఎక్కడ రిస్క్‌లో పడతారేమో అన్న ఆందోళనతో నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఓవైపు నా పిల్లలు అమ్మా అంటూ నా దగ్గరికి వస్తున్నా.. నేను మాత్రం వారిని దూరం పెట్టడం నన్ను మానసికంగా మరింత కుంగదీసింది. ‘భగవంతుడా.. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడద’ని అనుకుంటూనే.. స్వీయ ఐసోలేషన్లోకి వెళ్లిపోయా.
******
అయితే అప్పటిదాకా నాలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా రెండ్రోజుల తర్వాత నెమ్మదిగా దగ్గు మొదలైంది. ఆ వెంటనే జ్వరం కూడా వచ్చింది. ఇక ఆలస్యం చేయకూడదని వెంటనే మా ఇంటికి దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకున్నా. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది.. నా అనుమానమే నిజమైంది.. నాకు పాజిటివ్‌గా తేలింది. ఆ క్షణం ఒక్కసారి నా పిల్లలే గుర్తొచ్చారు. ఒకవేళ నా ద్వారా వారికీ వైరస్ సోకిందేమో.. అన్న అనుమానంతో ఎందుకైనా మంచిదని నా పిల్లల్ని, నా భర్తను కూడా టెస్ట్ చేయించుకోమన్నా. దేవుడి దయ వల్ల ఆ ముగ్గురికీ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నా. అయితే నాకు లక్షణాలు మరీ తీవ్రంగా లేకపోవడంతో ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోమన్నారు వైద్యులు. ఈ క్రమంలో మందులతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా వారు నాకు సూచించారు.
******

ఉదయం లేచి బ్రష్ చేసుకున్నాక ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం (గార్గ్లింగ్ చేయడం), ఆపై గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం కలుపుకొని తాగడం.. వంటివి చేశా. ఆ తర్వాత అరగంట పాటు యోగా, ధ్యానం సాధన చేశాను. రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడం అలవాటు చేసుకున్నా. నిజానికి మందుల కంటే ఈ చిట్కాల వల్లే నేను త్వరగా కోలుకోగలిగాను. సరిగ్గా రెండు వారాల తర్వాత టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. అయినా నీరసం, దగ్గు మాత్రం అంత త్వరగా నన్ను వీడలేదు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నా. నా పనులు చేసుకోవడం మొదలుపెట్టాను. కొన్ని రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే మా బాస్ అనుమతితో ఇంటి నుంచే పని చేస్తున్నా.
******
మరి, ఇదంతా నేను మీతో చెప్పడానికి ఓ కారణం ఉంది.. అదేంటంటే.. నేను చెప్పిన ఈ విషయాలు తెలుసుకొని వైరస్ పట్ల అలక్ష్యంగా వ్యవహరించే వారిలో కొద్దోగొప్పో మార్పు వస్తుందనుకుంటున్నా! ఎందుకంటే అలాంటి వారి వల్లే సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఎంతోమంది కరోనా బారిన పడుతున్నారు. ‘కనీస జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదు’ అన్న సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవడంలో తప్పులేదు.. కానీ ‘నాకు వైరస్ రాదు’ అన్న అతి విశ్వాసం అస్సలు పనికిరాదు. లక్షణాలు లేకపోయినా ఈ వైరస్ ఒకసారి మన శరీరంలోకి ఎంటరైందంటే.. ఎంతోకొంత మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.. కాబట్టి ఇకనైనా వైరస్ పట్ల నిర్లక్ష్యాన్ని వీడండి.. దీని బారిన పడకుండా ఇటు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే, అటు మీ చుట్టూ ఉన్న వారిని కాపాడండి!