ఎడారిలా మారిన ఆమె జీవితంలో తొలకరి జల్లు తీసుకొచ్చింది అతడి ప్రేమ. అప్పటి వరకు అమ్మతో కలిసి కష్టాలనే అనుభవించింది. ఇకపై ముందున్న జీవితాన్ని అందంగా మలచుకోవాలని భావించింది. అయితే పచ్చని పైరుపై వడగండ్ల తుఫానులా ఒక నిజం ఆమె కలలని అంధకారంలో బంధించింది. అతని ముందు ఆ నిజాన్ని దాయడానికి ఆమె ఆత్మసాక్షి ఒప్పుకోవడం లేదు. నిజం చెబితే ఆమెకి ప్రేమ దక్కదు. ఏం చేయాలి ? ఇంతకీ ఆమె హృదయరాగం ఏంటో ఆలకించి తనకో మంచి సలహా ఇస్తారా ?
[[[[[
వసుంధర కుటుంబానికి నమస్కారం. నా పేరు జ్యోతి. 'హృదయరాగం' శీర్షిక ద్వారా పలువురి సమస్యలకి మీరు చూపిస్తున్న పరిష్కారాలు నాకు నచ్చాయి. అందుకే ఒక సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తున్నాను.
నాకు అయిదేళ్లున్నప్పుడు నాన్న చనిపోయాడు. ఎవరూ లేని అమ్మ నన్ను తీసుకొని హైదరాబాద్ వచ్చింది. బట్టల కొట్టు నడుపుకుంటూ నన్ను పెంచి పెద్ద చేసి చదువు కూడా చెప్పించింది. ఇప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడే స్థాయికి తీసుకొచ్చింది. ఇన్నేళ్లలో అమ్మా, నేను ఎన్నో కష్టాలు పడ్డాం. చీకటి నిండిన మా జీవితంలో ఇప్పుడిప్పుడే తొలి సూర్యోదయం కనిపిస్తోంది. మా జీవితాలకి కొత్త రెక్కలొస్తున్నాయి. అందుకు మరో కారణం అజయ్ !

చాలామంది భవిష్యత్తు అంటే ఆశగా బతుకుతారు కానీ అమ్మా, నేను భయాలతోనే బతికేవాళ్లం. చిన్నప్పటి నుండి మగదిక్కు లేకుండా పెరిగిన నాకు ఎలాంటి వాడు వస్తాడో అని అమ్మ చింతించేది. నాకు పెళ్త్లెతే అమ్మ ఎక్కడ ఒంటరిదైపోతుందో అని నేను బాధపడేదాన్ని. ఇటువంటి తరుణంలో ఎక్కడి నుండి వచ్చాడో, ఎప్పుడు నా జీవితంలోకి వచ్చాడో తెలీదు.. దేవుడున్నాడనే నమ్మకాన్ని కలిగించాడు అజయ్. ప్రతి విషయంలో తను నన్ను అర్థం చేసుకునే తీరు నాకు అమ్మని గుర్తు చేస్తుంది. అందుకే నేను అడిగేలోపే పెళ్లి తర్వాత అమ్మని మనతోనే ఉంచుకుందాం అన్నాడు. నా జీవితంలో నేను అనుభవించిన అద్భుత క్షణం అది ! అయితే అది ఎంతో కాలం నిలవలేదు !
[[[[[
కొత్తగా రెక్కలొచ్చిన మా జీవితాలు ఆకాశం అంచులని తాకే లోపే ఒక విషాదం మమ్మల్ని పాతాళానికి తొక్కేసింది. దేవుడు నిద్రపోయాడో ఏమో ! మృగంలా జన్మించాల్సిన ఒక వ్యక్తి మా ఇంటి సమీపంలో ఉండే అయిదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రోజూ పేపర్లో చూసేదానికి ఎదురుగా జరిగినదానికి తేడా ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. అమ్మైతే అప్పటి నుండి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టలేదు. బతుకు విలువ తెలిసినవారు బాధపడితే ఇలానే ఉంటుందిలే అనుకున్నాను కానీ, తర్వాత తెలిసింది అమ్మ డిప్రెషన్లోకి వెళ్లిందని.

అమ్మ మళ్లీ పూర్తి అంధకారంలోకి వెళ్లిపోతున్నట్లు నాకనిపించింది. ఈ సమయంలో కొంతమంది అమ్మకి దెయ్యం పట్టిందని భయపెట్టారు. కానీ సుమక్క మటుకు సైకాలజిస్ట్‌ని కలిస్తే అంతా సర్దుకుంటుందని ధైర్యం చెప్పింది. వెంటనే అజయ్‌ని పిలిపించి అమ్మని తీసుకొని సైకాలజిస్ట్‌ని కలిశాను. అప్పుడే అగ్నిగోళం బద్దలైనట్లు ఆ భయంకర నిజం తెలిసింది.

అమ్మకి 17 ఏళ్లు ఉన్నప్పుడు జరిగిందా ఘటన. రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఎవరివో రెండు చేతులు హఠాత్తుగా ఆమె కళ్లని కప్పేశాయి, నోరుని నొక్కేశాయి. తిరిగి కళ్లు తెరచి చూస్తే నాలుగు గోడల మధ్య అంతా చీకటి ! ఎవరెవరో వస్తున్నారు, తనకి తెలియకుండా తనని ఏదేదో చేస్తున్నారు. నెల రోజుల పాటు నరకం అంటే ఏంటో చూసింది. బాధని చెప్పుకుందామంటే తనలా కన్నీరు కార్చేవారే తప్ప అక్కున చేర్చుకునేవారు ఆ వేశ్యా గృహంలో లేరు.

చివరికి పోలీసులు రైడ్ చేసి మృగాల మధ్య మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించారు. అందరిలానే అమ్మకి కూడా కౌన్సెలింగ్ ఇప్పించి, అడ్రస్ కనుక్కుని ఇంటికి పంపించారు. అయితే కూతురి కంటే పరువుకే విలువిచ్చిన అమ్మమ్మ, తాతయ్య అమ్మని ఇంట్లోకి రానివ్వలేదు. అప్పటికే తన కడుపులో ఒక పిండం ప్రాణం పోసుకుంటోందని తెలియని అమ్మ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
[[[[[
అప్పుడే ఒక మంచి మనిషి అమ్మని కాపాడి ఆమెకి కొత్త జీవితాన్నిచ్చాడు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తన అర్థాంగిని చేసుకున్నాడు. అప్పటి వరకు కష్టాలనే చూసిన అమ్మకి ఆనందాన్ని పంచాడు. అయితే తలరాత రాసేవాడికి తల్లి లేదు కదా ! అందుకే ఆమె కష్టాలు తెలియవు. నేను పుట్టి అయిదేళ్లు గడిచాయో లేదో అమ్మ నవ్వుని తీసుకుని నాన్న ఈ లోకం నుండి వెళ్లిపోయాడు.

తల్లిదండ్రుల కష్టం గురించి తెలియనంత వరకు మనం పడేదే కష్టం అనుకుంటాం. నేను కూడా ఇప్పటి వరకు కష్టమంటే నాదే అనుకున్నా. కానీ అమ్మ కష్టం ఎవరికీ రాకూడదు. అయితే ఈ విషయం అజయ్‌కి ఎలా చెప్పడమనేదే ఇప్పుడు నా సమస్య ? ఇప్పటి వరకు అజయ్ వద్ద నేను ఏ విషయాన్నీ దాచిపెట్టలేదు. ఒకసారి మాటల సందర్భంలో వేశ్యల ప్రస్తావన వచ్చినప్పుడు 'కూలి పని చేసుకుని బతకొచ్చు కదా ! ఎందుకిలాంటి పాడు పనిలో దిగుతారో' అన్నట్లు నాకు గుర్తు. కానీ కావాలని ఏ స్త్రీ ఈ పని చేయదని అతనికెలా వివరించడం ? చెప్పినా ఇప్పుడు అమ్మని సమర్ధించడానికి అంటున్నానని అనుకోడా ?
[[[[[
ఒడ్డున ఉన్నవాడికి నిశ్చలమైన నీటిని చూస్తే మనస్సు ఉప్పొంగుతుంది. అదే నది మధ్యలో మునిగిపోతున్నవాడికి నీరు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. ప్రస్తుతం నేను నడి సంద్రంలో ఉన్నాను. అతను, తీరం వద్ద నిల్చుని అద్భుతమైన జీవితం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి ? సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చే అతడి కుటుంబం నన్ను కోడలిగా అంగీకరిస్తుందా ? అంగీకరించినా మాతో పాటు అమ్మని ఉండనిస్తుందా ? ఈ డోలాయమాన పరిస్థితుల్లో నేనేం చేయాలి ? అమ్మ కోసం అజయ్‌ని మర్చిపోవాలా ? అజయ్ కోసం అమ్మను వదులుకోవాలా ?? మీరు నా పరిస్థితిని అర్థం చేసుకుని తగిన సలహా ఇస్తారని ఆశిస్తున్నాను...
ఇట్లు,
జ్యోతి