సాధారణంగా ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రోగికి కచ్చితంగా తోడుగా ఉంటారు. చికిత్స సమయంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాస్పిటల్‌కు వచ్చి మనో ధైర్యం చెబుతుంటారు. కానీ కరోనా సోకి చికిత్స తీసుకునే రోగులకు ఇలాంటి సదుపాయాలేవీ ఉండవు. సామాజిక దూరం పాటిస్తూ ఆస్పత్రిలో ఉన్నంతసేపూ ఏకాకిగానే గడపాలి. ఫలితంగా వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వైద్యులు, నర్సులే కరోనా బాధితుల కుటుంబ సభ్యులుగా మారిపోతున్నారు. వైరస్ తమకు సోకే ప్రమాదముందని తెలిసినా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోన్న స్నేహ ఏడు నెలలుగా కరోనా బాధితులకు సేవలు చేస్తోంది. కరోనా రోగులను తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ వారిని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో కరోనాను జయించి తిరిగి విధుల్లో నిమగ్నమైన ఆ నర్సు హృదయరాగమేంటో మనమూ విందాం రండి..!

ఆ సమయంలో ఒంటరినయ్యా!
హాయ్ నా పేరు స్నేహ. మాది బెంగళూరు. నర్సింగ్ వృత్తిని దైవంలా భావించే నేను గత మూడేళ్లుగా దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడే హాస్టల్లో ఉండి రోజూ డ్యూటీకి వెళుతుంటాను. వృత్తి పరంగా ఈ మూడేళ్ల కాలంలో నేను ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ కరోనా వైరస్ మన దేశంలోకి అడుగుపెట్టినప్పుడు నేను కొంచెం భయపడ్డాను. ఎందుకంటే ఆ మహమ్మారి మనందరికీ కొత్త! దీనికి తోడు ఇంటిపై బెంగతో ఒక్కసారిగా ఒంటరితనం నా చుట్టుముట్టింది. దీంతో మొదట్లో ఆస్పత్రికి వెళ్లాలనిపించకపోయినా వెళ్లేదాన్ని. అలాగని వైరస్‌కు భయపడో లేదంటే రోగుల తాకిడి పెరుగుతుందనో నేనెప్పుడూ నా వృత్తి విషయంలో వెనుకంజ వేయలేదు. ఇక రోజులు గడుస్తోన్న కొద్దీ అనవసర ఆందోళనలు, ఆలోచనలను పక్కన పెట్టి కరోనా బాధితులను కాపాడడమే లక్ష్యంగా ముందుకు సాగడం ప్రారంభించా.
అప్పుడు నాకు గర్వంగా అనిపించింది!
మిగతా వైరస్‌లతో పోల్చుకుంటే కరోనా వైరస్ చాలా భిన్నం. ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుంది. అందుకే ఈ వైరస్ సోకి ఎవరైనా ఆస్పత్రిలో చేరితే వారి వెంట ఎవరినీ అనుమతించరు. దీంతో వారు ఒంటరితనంగా ఫీలయ్యే ప్రమాదముంది. అలాంటి సమయంలో చికిత్స అందించే వైద్య సిబ్బంది బాధితులకు అండగా నిలవడంతో పాటు వారికి మనోధైర్యం అందించాల్సిన అవసరముందన్న విషయం నేను అర్థం చేసుకున్నా. అందుకే వైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన రోగులందరినీ నా కుటుంబ సభ్యుల్లాగానే భావించాను. వారు కూడా ఆస్పత్రిని తమ ఇల్లులా భావించేలా చేశాను. వారిలో మనో ధైర్యం నింపాను. అలా కరోనా నుంచి కోలుకున్న రోగులు ఒక్కొక్కరూ ఇంటికి వెళుతుంటే నాకెంతో సంతోషంగా అనిపించేది. ఆ సమయంలో వారి పెదాలపై చిరునవ్వు నేను పడిన కష్టాన్నంతా మరిచిపోయేలా చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే రోగులకు సేవ చేసే వృత్తిని ఎంచుకున్నానన్న సంతృప్తి ముందు అన్నీ దిగదుడుపే అనిపిస్తోంది.

పీపీఈ చర్మమైంది!
నెలలో వరుసగా 14 రోజులు వేర్వేరు షిఫ్టుల్లో నేను పనిచేయాల్సి వచ్చేది. ఆ తర్వాత వారం రోజులు క్వారంటైన్, మూడు రోజుల పాటు సెలవులు ఉంటాయి. విధి నిర్వహణలో భాగంగా రోజూ ఆరు గంటల పాటు ఊపిరాడనివ్వని పీపీఈ కిట్లలోనే కరోనా రోగులను చూసుకోవాలి. దీనితో పాటు సేఫ్టీ గాగుల్స్ వల్ల మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా ఆ తర్వాత క్రమంగా అలవాటు చేసుకున్నాను. రోజంతా పీపీఈ కిట్లలోనే ఉండడం వల్ల చర్మంపై మరో చర్మం కప్పుకున్నానేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది. అయితే కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే ఇలాంటి రక్షణ కవచాలు చాలా అవసరం.
నేనూ కరోనా బాధితురాలినే!
విధి నిర్వహణలో భాగంగా గత ఏడు నెలల నుంచి రోగులకు సేవలందిస్తోన్న నాకు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ ముప్పు తప్పలేదు. గత నెలలో కరోనా బారిన పడ్డ నేను.. ఇదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని వారం రోజుల్లో కోలుకున్నాను. వైరస్‌పై విజయం సాధించిన వెంటనే తిరిగి డ్యూటీలో చేరాను. ఈ వైరస్ ప్రభావం అందరిలో ఒకేలా ఉండదు. ఈ మహమ్మారి బారిన పడ్డ కొంత మంది ఆరోగ్యం క్షణాల్లోనే క్షీణించిపోవడం నేను దగ్గర్నుంచి చూశాను. ఈ క్రమంలో వారు పడుతోన్న బాధ చూసి నా గుండెలవిసిపోయేవి. అలాగని ప్రతి ఒక్కరికీ అలాగే జరుగుతుందని భయపడిపోవడం అస్సలు మంచిది కాదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఇతరులకు దూరంగా ఉండి, మాస్కులు ధరిస్తే చాలు.. ఇలా కనీస జాగ్రత్తలతోనే ఈ వైరస్‌కు మనం చిక్కకుండా జాగ్రత్తపడచ్చు.

వివక్ష వద్దు.. వీలైతే సహాయం చేయండి!
వైరస్ వ్యతిరేక పోరులో భాగంగా వైద్య సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది వైద్య సిబ్బంది ఈ వైరస్‌కే బలయ్యారు. మరికొందరు మానసిక ఆందోళన, డిప్రెషన్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమయంలో మాలాంటి వారికి మద్దతు ఇవ్వాల్సింది పోయి చాలాచోట్ల సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు మమ్మల్ని కరోనా యోధులని ప్రశంసిస్తూనే.. మరోవైపు వైరస్ అంటిస్తున్నారంటూ మాపై వివక్ష చూపుతున్నారు. మంచి మనసున్న మరికొంత మంది యువతులు ఈ వృత్తిలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. ఇలాంటి అర్థం పర్థం లేని మాటలతో దయచేసి అలాంటి వారిని నిరుత్సాహ పరచొద్దు.. అలాగే వైరస్ నుంచి కోలుకున్న వారినీ చిన్న చూపు చూడడం కూడా మనచుట్టూ జరుగుతోన్న పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. వైరస్‌ను ఎవరూ కావాలని అంటించుకోరు.. ఇతరులకు అంటించరు. ఒక్కోసారి మనకు తెలియకుండానే అది మనలోకి ప్రవేశించచ్చు.. కాబట్టి ఇప్పటికే వైరస్‌తో సతమతమైన వారిని మీ చూపులు, మాటలతో బాధపెట్టకండి..! మీకు చేతనైతే మీ చుట్టూ ఉన్న వారికి కరోనా జాగ్రత్తలు సూచించండి.. అలాగే ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తోన్న నలుగురికి సహాయం చేయండి..!