కరోనా మనుషుల జీవితాలనే కాదు.. ప్రత్యేక సందర్భాల రూపురేఖల్ని కూడా మార్చేసింది..! అంతకుముందు వరకూ ఏ వేడుకైనా అందరితో కలిసి ఎంతో సంబరంగా జరుపుకొనే మనం ఇప్పుడు ఇంటికే పరిమితమై సింపుల్‌గా చేసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌కి చెందిన నవ్య కూడా తన కొడుకు పుట్టినరోజు వేడుకల విషయంలో ఇలాగే ఆలోచించింది. వాడి మొదటి పుట్టినరోజులాగే ఐదో పుట్టినరోజునూ ఘనంగా జరపాలనుకుంది.. అయినా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు..! సరికదా.. సింపుల్‌గానైనా చేసుకుందామంటే అందుకూ కరోనా అడ్డుపడి.. మరోసారి తనను, తన కొడుకును నిరాశపరిచిందంటోంది. మరి, ఇంతకీ ఏమైంది? వాళ్ల బాబు పుట్టినరోజు వేడుకలు ఆగడానికి, కరోనాకు సంబంధమేంటి? రండి.. తన మాటల్లోనే తెలుసుకుందాం..!
పిల్లలకు సంబంధించిన ఏ వేడుకైనా తల్లిదండ్రులకు అపురూపమే కదా! ఇక వాళ్ల ప్రతి పుట్టినరోజు నాడు పిల్లల కంటే పేరెంట్సే ఎక్కువగా హడావిడి చేస్తుంటారు. నేను, మా వారు కూడా అంతే! అసలే లేక లేక కలిగిన ఒక్కగానొక్క సంతానం నా కొడుకు ప్రణయ్. పెళ్లయ్యాక పదేళ్లకు పుట్టాడు. ఎన్నో ఎదురుచూపులు భరించా.. ఎంతోమందితో సూటిపోటి మాటలు పడ్డా.. అయినా ఎప్పటికైనా తల్లినవుతానన్న ఆశతోనే ఉండేదాన్ని! అలా 2015లో తల్లినయ్యా. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. మామూలుగానే పిల్లలు పుట్టాక తల్లిదండ్రుల్లో కలిగే సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం.. వారిని ఎంతో అపురూపంగా చూసుకుంటాం. అలాంటిది లేక లేక ప్రణయ్ పుట్టేసరికి వాడే మాకు లోకంగా మారిపోయాడు.
******
ఓ అమ్మగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, వాడి ప్రతి దశనూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో నాకు సమయమే తెలిసేది కాదు. అలా చూస్తుండగానే మొదటి పుట్టినరోజు రానే వచ్చింది. ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాం. మళ్లీ ఐదో ఏట కూడా ఇలాగే వేడుకగా పుట్టినరోజు జరుపుదామని అప్పుడే నిర్ణయించుకున్నాం. కానీ ఇప్పుడిలా కరోనా వైరస్ పుట్టుకొస్తుందని, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని మనలో ఏ ఒక్కరూ కలలోనైనా ఊహించి ఉండరు. అయినా సరే.. కేవలం ఇంటి సభ్యుల్నైనా పిలిచి పార్టీ ఇద్దామనుకున్నాం.. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూనే! ఆ సన్నాహాల్లోనే మునిగిపోయాం. ఇక పుట్టినరోజుకు సరిగ్గా నాలుగు రోజులుందనగా నా బాబుకు జలుబు, దగ్గు మొదలయ్యాయి. మరుసటి రోజుకు జ్వరం కూడా మొదలైంది. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్ చేస్తే.. సీజనల్ మార్పుల వల్ల అయి ఉంటుందని.. కొన్ని మందులు వాడమని సలహా ఇచ్చారు.
******
అవి వాడినా.. కొద్ది సేపే ఫలితం కనిపించేది. ఇక వాటి ప్రభావం పోయాక.. ప్రణయ్ మళ్లీ డల్ అయిపోయేవాడు. ఇలా మూడు రోజులు గడిచిపోయాయి. తెల్లవారితే వాడి బర్త్‌డే! ఎవరినీ పిలవకపోయినా.. కనీసం ఇంట్లోనైనా వాడితో కేక్ కట్ చేయిద్దామనుకున్నాం. కానీ అదీ కుదరకుండా చేసిందీ దిక్కుమాలిన కరోనా మహమ్మారి. రాత్రి 12 గంటలకు వాడికి విషెస్ చెప్పి పడుకున్న నాకు తెల్లవారే సరికి జ్వరం మొదలైంది. వాడి కోసం కేక్ తయారుచేసే ఓపిక కూడా నాకు లేకపోయింది. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోన్ చేసి నా పరిస్థితిని వివరించా. ‘మొదట మీ బాబుకు, ఇప్పుడు మీకు.. జ్వరం అంటున్నారు. ఎందుకైనా మంచిది.. ఒకసారి కొవిడ్ టెస్ట్ చేయించుకోండి..’ అని సూచించారు డాక్టర్. అయినా మా వారు ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. మేం బయటికి గానీ, బంధువుల ఇళ్లకు కానీ వెళ్లనే లేదు. కాయగూరలు కావాలన్నా.. ఇంటి ముందుకే బండి వచ్చేది.. అలాంటప్పుడు వైరస్ బారిన పడే అవకాశమే లేదు.. అందుకే కరోనా పరీక్ష చేయించుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు.

సరే.. డాక్టర్ సలహా మేరకు ఓసారి టెస్ట్ చేయించుకుంటే సందేహం తీరిపోతుంది కదా అనిపించింది. వెంటనే నేను, ప్రణయ్ దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి శాంపిల్స్ ఇచ్చి వచ్చాం. మరుసటి రోజు ఉదయం వచ్చిన రిపోర్టుల్లో మా ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. అసలు ఎలా వచ్చిందో, ఎవరి ద్వారా మాకు కరోనా వచ్చిందో అర్థం కాలేదు.. ఎందుకైనా మంచిదని మా వారూ పరీక్ష చేయించుకుంటే ఆయనకూ లక్షణాలు లేకుండానే వైరస్ ఉందని నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు అందరం ఇంట్లోనే స్వీయ ఐసొలేషన్‌లో ఉంటూనే మందులు వాడాం.. సప్లిమెంట్స్ వేసుకున్నాం. మేమంటే పెద్ద వాళ్లం ఎలాగోలా తట్టుకుంటాం.. కానీ ప్రణయ్ విషయంలోనే నాకు చాలా భయమేసింది.. ఓవైపు వాడి బాగోగులు చూసుకుంటూనే.. మరోవైపు ఇంటి పనులన్నీ చేసుకునేదాన్ని. ఆ దేవుడి దయ వల్ల రెండుమూడు రోజుల్లో వాడు లేచి తిరగడం, ఆడుకోవడం మొదలుపెట్టాడు. దాంతో నా ప్రాణం లేచొచ్చినట్లనిపించింది.
******
ఇంట్లోనే ఏ పూటకాపూటే వేడివేడిగా వండుకున్న ఆహారం తీసుకోవడం, ఉదయం పూట నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగడం, రోజుకు రెండు పూటలా ఆవిరి పట్టడం, రోగనిరోధక శక్తి కోసం కూరల్లో టొమాటో ఎక్కువగా ఉపయోగించడం.. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ వైరస్ నుంచి త్వరగా గట్టెక్కగలిగాం. ఇక చాలామంది తల్లిదండ్రులు ఒకవేళ వారి పిల్లలు కొవిడ్ బారిన పడితే భయపడిపోతుంటారు.. మొదట్లో నేనూ అలాగే ఆందోళన చెందా. కానీ నా బాబు విషయంలో నేను పాటించిన కొన్ని చిట్కాలు మీక్కూడా పనికొస్తాయనుకుంటున్నా.

* పిల్లలు ఒక్క చోట ఉండలేరు. ఎప్పుడెప్పుడు తమ స్నేహితులతో ఆడుకుందామా అని ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మన కళ్లు గప్పి వెళ్తుంటారు కూడా! ప్రణయ్ కూడా మేముండే అపార్ట్మెంట్లో తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా చేయడం అస్సలు కరక్ట్ కాదు. ఇదే విషయాన్ని నేను ప్రణయ్‌తో అర్థం చేయించి వాడిని ఇంటి నుంచి బయటికి కదలనిచ్చేదాన్ని కాదు.
* తరచూ చేతులు శుభ్రం చేసుకోమని వారికి చెప్పండి. ఇలా మీ మాట వింటున్నారో లేదో ఓ కంట కనిపెడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతను వారికి అలవాటు చేయించండి.
* కరోనా బారిన పడిన పిల్లల్ని సామాజిక దూరం పాటించేలా, మాస్క్ పెట్టుకునేలా చేయడం తల్లిదండ్రులుగా మీదే బాధ్యత. దీనివల్ల అటు వారికి, ఇటు ఇంట్లో ఉన్న వారికీ మంచిది.
* ఇక ఆహారం, ఆవిరి పట్టే విషయాల్లో పెద్దవాళ్ల లాగే చిన్న పిల్లలకూ అలవాటు చేయించచ్చు. అలాగే మీతో పాటు వారినీ యోగా, చిన్న పాటి వ్యాయామాల్లో భాగం చేయండి. ఎందుకంటే వ్యాయామాల వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుందని మా డాక్టర్ సలహా ఇవ్వడంతో మేమూ ప్రణయ్‌కి యోగాను అలవాటు చేయించాం. కరోనా నుంచి కోలుకున్నా ఈ అలవాటును కొనసాగిస్తున్నాం.
* ఆన్లైన్ క్లాసులు వినడం, అవి ముగిసినా పిల్లల్ని ఏదో ఒక పనిలో బిజీగా ఉంచడం వల్ల ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అన్న ఆలోచన వారికి రాకుండా చేయచ్చు..!
******
ఇక మరో విషయం ఏంటంటే.. ఈ మధ్య కేసులు క్రమంగా తగ్గుతుండడంతో చాలామంది కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమందైతే కనీసం మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు. వారి కారణంగా ఇంట్లోనే ఎంతో జాగ్రత్తగా ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలా వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో తెలియకుండానే చాలామందిలో వైరస్ నిర్ధారణ అవుతుంది.. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మా కుటుంబమే..! కాబట్టి దయచేసి వైరస్ ప్రభావం తగ్గుతోందని అలక్ష్యం చేయకండి.. మీరు ఇబ్బందుల్లో పడకండి.. ఇతరుల్ని ఇబ్బంది పెట్టకండి..!