కంటికి కనిపించకుండా, లక్షణాలు తెలియనివ్వకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. దీని బారిన పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించినా కొంతమందిలో ఇది బయటపడుతూ కలవరపెడుతోంది. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటోంది ముంబయికి చెందిన మేఘన. ముందు నుంచీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందని చెబుతోందామె. అంతేకాదు.. కరోనా నుంచి కోలుకునే క్రమంలో తన జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయని.. ఆరోగ్యకరమైన అలవాట్లు, సానుకూల దృక్పథం ఉంటే కరోనాను సులభంగా జయించచ్చంటూ తన కొవిడ్ స్టోరీని ఇలా పంచుకుంది.

కరోనా.. ఈ పేరు మొదట విన్నప్పుడు నేను లండన్‌లో ఉన్నా. ముంబయిలోనే పుట్టిపెరిగిన నేను.. పైచదువుల కోసం గతేడాది లండన్ వెళ్లా. నిజానికి ఈ ఏడాది న్యూ ఇయర్‌కి నేను ఇండియాకు రావాల్సింది.. కానీ ప్రాజెక్ట్ వర్క్ ఉండడంతో అక్కడే ఆగిపోయా. అంతలోనే చైనాలో కరోనా వైరస్ విజృంభణ గురించి తెలిసింది. చాలామందిలాగే నేను కూడా ఈ మహమ్మారి ఆ దేశంలోనే ఆగిపోతుందేమో అనుకున్నా.. కానీ కళ్లు మూసి తెరిచే లోపే అది చాలా దేశాలకు పాకింది. ఎక్కడికక్కడే లాక్డౌన్లు, రవాణా సౌకర్యాలు స్తంభించిపోవడంతో లండన్‌లోనే చిక్కుకుపోయా.
******
అక్కడ నేను సురక్షితంగానే ఉన్నా.. కానీ నా ఆందోళనంతా ముంబయిలో ఉన్న మా అమ్మానాన్నలు, నా తోబుట్టువుల గురించే! పైగా మా బామ్మ, తాతయ్యలు కూడా మా ఇంట్లోనే ఉంటారు. వారు ముసలివాళ్లు కావడంతో వారి ఆరోగ్యం విషయంలో నాలో మరింత ఆందోళన మొదలైంది. పైగా అప్పుడప్పుడే ఇండియాలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ముంబయిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. లండన్‌లో నేనెలా ఉన్నానో అని అమ్మకు బెంగ మొదలైంది. అయితే రోజూ ఫోన్లో మాట్లాడుతూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అంతేకాదు.. అటు మా వాళ్లు, ఇటు నేను ఆరోగ్యకరమైన కషాయాలు తాగుతూ, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటూ ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించడం మొదలుపెట్టాం. ఇలా రెండు నెలలు లండన్‌లో ఒంటరితనం అనుభవించాను.. ఈ సమయంలో ముళ్ల మీద కూర్చున్నట్లనిపించింది.. ఎప్పుడెప్పుడు విమానాలు తిరిగి ప్రారంభమవుతాయా? ఎప్పుడెప్పుడు ఇంటికి చేరదామా? అన్న ఆతృతలోనే ఉండిపోయా.

అంతలోనే వందే భారత్ మిషన్ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రాణం లేచొచ్చినట్లనిపించింది. ఇక ఇక్కడికొచ్చాక ఎయిర్‌పోర్ట్‌లోనే కొవిడ్ టెస్ట్ చేశారు.. అందులో నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నా. అయినా ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్లో 14 రోజులున్న తర్వాతే ఇంటికి చేరుకున్నా. ఇక అప్పట్నుంచి ఆన్లైన్లోనే నా కోర్సుకు సంబంధించిన క్లాసులు వినడం ప్రారంభించా. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. మా అమ్మానాన్నలిద్దరూ రిటైర్డ్ ఉద్యోగులు.. అక్కేమో ఇంటి నుంచే పనిచేస్తోంది.. అన్నయ్య ఒక్కడు మాత్రం బయటికి వెళ్లాల్సి వచ్చేది.. ఎందుకంటే తను ఓ అత్యవసర విభాగంలో పనిచేస్తున్నాడు. అయినా ఇంటికొచ్చాక తాను మా అందరికీ దూరంగా ఉండేవాడు.. అందరితో కలవకుండా ప్రత్యేక గదిలో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. అయితే ఉన్నట్లుండి ఓ రోజు తను ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. కారణమేంటని అడిగితే ఒంట్లో కాస్త నలతగా ఉందని చెప్పాడు.
******
నిరంతరాయంగా పనిచేయాల్సి రావడం.. ఒక్కోరోజు రెండు షిఫ్టుల్లో పనిచేయాల్సి రావడం వల్ల అలసిపోయి ఉంటాడనుకున్నాం.. కానీ ఆ మరుసటి రోజుకు తాను మరింత డల్ అయిపోయాడు.. జ్వరం కూడా తోడైంది. ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు.. పాజిటివ్ వచ్చింది. లక్షణాలు కాస్త తీవ్రంగానే ఉండడంతో అన్నయ్యను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. అన్నయ్యకు కరోనా రావడంతో మా కుటుంబ సభ్యులందరం కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకుందామనుకున్నాం.. అయితే- ‘లక్షణాలుంటేనే చేయించుకోండి.. లేదంటే అనవసరంగా బయటికొచ్చి ముప్పు కొని తెచ్చుకోవద్దు..’ అంటూ మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పడంతో ఆగిపోయాం. కానీ నాకేమో.. ఓసారి పరీక్ష చేయించుకుంటే అనుమానం తీరిపోతుంది కదా అని పదే పదే అనిపించింది. దాంతో ఆ మరుసటి వారమే.. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా కొవిడ్ పరీక్ష చేయించుకున్నా.. నా అనుమానమే నిజమైంది.. నాకూ కొవిడ్ నిర్ధారణ అయింది. అయితే లక్షణాలేమీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా. లక్షణాలు లేకుండానే నాకు కొవిడ్ పాజిటివ్ రావడంతో మా ఇంట్లో వాళ్లు కూడా అప్రమత్తమయ్యారు. పరీక్ష చేయించుకున్నారు.. కానీ దేవుడి దయ వల్ల వాళ్లందరికీ నెగెటివ్ అని వచ్చింది.
******
నాకు కొవిడ్ నిర్ధారణ అయినా.. లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉండమన్నారు డాక్టర్లు. దాంతో మా ఇంటి పెంట్ హౌస్ ఖాళీగా ఉండడంతో ఆ గదిలోనే ఉంటూ మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పిన సలహాలు పాటించడం మొదలుపెట్టా. సాధారణంగా లక్షణాలేవీ లేకపోయినా కరోనా వచ్చిందంటే చాలామంది భయపడిపోతున్నారు.. నాక్కూడా మొదట్లో చాలా భయమేసింది.. కానీ మా డాక్టర్ చెప్పిన సలహాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.. గతంలో కంటే మంచి లైఫ్‌స్టైల్ అలవడేలా చేశాయి. అందుకే కరోనా నుంచి బయటపడే క్రమంలో నేను పాటించిన చిట్కాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. అవి కొంతమందికి ఉపయోగపడినా నాకు సంతోషమే! అవేంటంటే..!

* కరోనాను జయించాలంటే ముందు మనలోని భయాన్ని జయించాలి.. ‘నాకేం కాదు.. త్వరలోనే ఈ వైరస్ బారి నుంచి బయటపడతా..’ అని మనసులో పదే పదే అనుకోవాలి.. తద్వారా మనలో సానుకూల దృక్పథం అలవడుతుంది. * కరోనా బారిన పడకుండా మాత్రమే కాదు.. కరోనా నుంచి కోలుకోవడానికీ వ్యక్తిగత శుభ్రత పాటించాల్సిందే! స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నా సరే చేతులు కడుక్కోవడం, మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. * నూనె సంబంధిత పదార్థాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నేనైతే మా డాక్టర్ సలహా మేరకు పుట్టగొడుగులు, టొమాటో, ఆకుపచ్చటి ఆకుకూరలు-కాయగూరలు, పప్పులు, గుడ్లు, పాలు, పాల పదార్థాలు, సీజనల్ పండ్లు.. ఇలా నా రోగనిరోధక శక్తిని పెంచుకునేలా ఆహారం తీసుకున్నా. * రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగేదాన్ని. ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. * ఎలాగూ ఇంట్లోనే ఉన్నాం కదా అని నిద్రను త్యాగం చేసి మరీ టీవీలు, మొబైల్స్‌కి అంకితమైపోవద్దు.. సరైన నిద్ర కూడా రోగనిరోధక శక్తిని పెంచి కరోనా నుంచి కోలుకోవడానికి సహకరిస్తుంది. అందుకే రోజూ ఏడెనిమిది గంటలు పడుకునేదాన్ని. * మంచి ఆహారం తీసుకోవడంతో పాటు యోగా, ధ్యానం కూడా చేసేదాన్ని. ఇవీ ఓ రకంగా మనలో ఇమ్యూనిటీని పెంచి, సానుకూల దృక్పథం అలవడేలా చేస్తాయి. * గోరువెచ్చటి నీటితో పుక్కిలించడం, ఆవిరి పట్టడం.. రోజుకు రెండుసార్లు చేసేదాన్ని. * మానసిక ప్రశాంతత కోసం పుస్తకాలు చదవడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం చేశాను. నిజానికి పుస్తకాలు చదివే అలవాటు ఇంతకుముందు నాకు లేదు.. కానీ కరోనా వల్ల నాకు ఈ మంచి అలవాటు అలవడింది. ఈ సమయంలో ఒంటరితనాన్ని జయించడానికీ ఈ చిట్కా నాకు ఉపయోగపడింది.
|
ఇలా ఓవైపు ఇంట్లో చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు నా ఆన్లైన్ క్లాసుల్ని కొనసాగించా. దాంతో నాకు ఖాళీ సమయమంటూ దొరికేది కాదు.. కాబట్టి నెగెటివ్ ఆలోచనలు నా మనసులోకి రాకుండా జాగ్రత్తపడ్డా. ఇలా మీరు కూడా కొవిడ్ సోకినా భయపడిపోకుండా, పదే పదే దాని గురించే ఆలోచించకుండా మీకు నచ్చిన పనుల్లో సంతోషాన్ని వెతుక్కోవచ్చు. తద్వారా అటు మానసికంగా దృఢంగా ఉంటూ వైరస్ బారి నుంచి త్వరగా బయటపడచ్చు. ఇలా ఈ అలవాట్లతో నేను కొవిడ్ నుంచి కోలుకొని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. ఇటీవలే మా అన్నయ్య కూడా ఈ వైరస్‌ను జయించి ఇంటికి చేరుకున్నాడు. కాబట్టి కరోనా వచ్చిందని, వస్తుందేమోనని భయపడకుండా.. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోండి.. పాజిటివ్‌గా ఆలోచించండి. చక్కటి లైఫ్‌స్టైల్‌తో కరోనాను జయించచ్చనడానికి మీ అందరికీ నేనే ఒక ఉదాహరణ! నా కొవిడ్ స్టోరీ మీలో స్ఫూర్తి నింపుతుందని, ఈ వైరస్‌ను జయించే క్రమంలో నేను పాటించిన చిట్కాలు మీ అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నా.. త్వరలోనే మనందరికీ మంచి రోజులొస్తాయి..!