'అనుమానాన్ని మొగ్గ దశలోనే తుంచేయాలని పెద్దలు వూరికే అనలేదు! అది జీవితాన్ని ఎంత నరకప్రాయంగా మార్చి, నాశనం చేస్తుందో ఇప్పుడే అర్థమవుతోందంటోంది' - ఓ అమ్మాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎందుకిలా చెబుతోంది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆమె హృదయరాగం వినాల్సిందే..!
నా పేరు రమ్య. మాది కృష్ణా జిల్లాలోని ఓ కుగ్రామం. మా నాన్నగారి వృత్తిరీత్యా మేం విజయవాడలో ఉండేవాళ్లం. అదృష్టం కొద్దీ నాకు అదే నగరంలో ఓ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఒక రోజు ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళ్లేటప్పటికి అమ్మ నాకు ఎదురొచ్చి త్వరగా చీర కట్టుకో నీకు పెళ్లిచూపులు అని చెప్పింది. ఇలాంటి కార్యక్రమాలకు కొన్ని రోజుల నుంచి అలవాటు పడిపోయాను కాబట్టి నాకు మామూలుగానే ఉంది. ఎన్ని సంబంధాలు వచ్చినా పిల్ల బాగాలేదు అనేవారు.. లేదంటే ఇంటికి వెళ్లి ఉత్తరం రాస్తాం అనేవారు.. తర్వాత పత్తా లేకుండా పోయేవారు. ఇదీ అంతేలే అని మామూలుగానే తయారయ్యాను. కానీ ఆ రోజు విచిత్రంగా వచ్చినవారికి నేను నచ్చాను. ఈ మాట విన్న తర్వాతే నేను యశ్వంత్ని చూశాను. బాగానే ఉన్నాడు. నాకు కూడా నచ్చాడు. నెల రోజుల్లోనే ముహూర్తం ఉంటే దాన్ని ఖాయం చేశారు.

పెళ్లిరోజు వచ్చేసరికి నా మనసు ఆనందంతో గంతులు వేయడం ప్రారంభించింది. మరో పక్క అనుమానం వేస్తోంది. ఇంతకు ముందు వచ్చిన వాళ్లంతా నేను నచ్చలేదని తిరిగి వెళ్లిపోతే ఇతను మాత్రం ఎలాంటి అభ్యంతరం లేకుండా నా అందంతో పని లేకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకొంటున్నాడు? అని నా మనసు నన్ను పదే పదే అడుగుతోంది. దీనికి తోడు ''పెళ్లికొడుకు ఎవర్నో ప్రేమించి భంగపడ్డాడట. అందుకే ఎవరైతే ఇంకేముందిలే అని ఈ అమ్మాయిని చేసుకుంటున్నాడట..'' అనుకుంటున్న కొందరి మాటలు నా చెవినపడ్డాయి. దీంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. ఈ అనుమానాల మధ్యే నా పెళ్లయిపోయింది. పెళ్లయిన తర్వాత నేను రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఎందుకంటే యశ్వంత్ కూడా అక్కడే వ్యాపారం చేస్తున్నాడు.
యశ్వంత్ నాతో సఖ్యంగానే ఉండేవాడు. కానీ నా మనసులో ఉన్న అనుమాన బీజం ఎప్పుడూ అతను చేసే పనులను సందేహించేది. తనతో సరదాగా ఉండనిచ్చేది కాదు. షాపింగ్, సినిమా ఇలా బయటకు ఎక్కడికి వెళ్లినా.. అమ్మాయిలను చూస్తున్నాడు.. వారి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడనే భావన నా మనసులోకి వచ్చేది. ఒక్కొక్కటిగా నా సందేహాలను బయటపెట్టడం మొదలు పెట్టేదాన్ని. దీనికి యశ్వంత్ ఎంతగానో నొచ్చుకొనేవాడు. జరిగిన సంఘటన గురించి వివరణ ఇచ్చేవాడు. పెళ్లికి ముందు ప్రేమ గురించి అడిగితే.. అలాంటిదేమీ జరగలేదని చెప్పాడు. అయినా నా మనసు అంగీకరించలేదు. రోజురోజుకీ నాకు వచ్చే అనుమానాలన్నీ మరింత పెరగసాగాయి.
ఇక అప్పటి నుంచీ యశ్వంత్ బయటకు వెళ్లినా.. ఫోన్లో మాట్లాడుతున్నా.. ఏ పని చేస్తున్నా సరే గుచ్చిగుచ్చి ప్రశ్నించేదాన్ని. దానికి అతడు నొచ్చుకొనేవాడు. నేను ఎంతగా అనుమానించినా నన్ను మాత్రం ఏమీ అనేవాడు కాదు. ఈ మంచితనమే నాకు మరింత అలుసయింది. తప్పు చేశాడు కాబట్టే మౌనంగా ఉంటున్నాడని నేను అనుకొనేదాన్ని. ఆఫీసు నుంచి రాగానే యశ్వంత్ మొబైల్ ఇన్బాక్స్, కాల్రిజిష్టర్ చెక్ చేసేదాన్ని. దీన్ని అతడు తట్టుకోలేకపోయేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఇంటికి కూడా సరిగా వచ్చేవాడు కాదు. దీంతో నేను ఇంకా రెచ్చిపోయాను. ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి యశ్వంత్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పా. మా ఇద్దరి అమ్మానాన్నలు రాజమండ్రి వచ్చారు. కానీ వాళ్లెవ్వరూ యశ్వంత్ గురించి నేను చెప్పినవేమీ నమ్మలేదు. నావి అనుమానాలేనని కొట్టి పడేశారు. నా అహం దెబ్బతింది. నా మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఉక్రోషంతో ఇంకా యశ్వంత్ని వేధించేదాన్ని. దీంతో అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేవాడు కూడా పూర్తిగా రావడం మానేశాడు. ఒకసారి అయితే రోడ్డు మీద పెద్ద గొడవ కూడా పెట్టేశాను.

ఇలా చేస్తే ఎవరి మనసైనా గాయపడకుండా ఉంటుందా? యశ్వంత్ విషయంలోనూ అదే జరిగింది. ఇక నన్ను భరించడం తన వల్ల కాదనుకున్నాడో ఏమో నాకు విడాకులు ఇచ్చేస్తానని తెగేసి చెప్పాడు. అప్పటికి కూడా నేను ఏమీ ఆలోచించలేదు. ఇంకా యశ్వంత్ని రచ్చకీడ్చాలనే చూసేదాన్ని. నా ప్రవర్తనతో విసిగివేసారిపోయిన అమ్మానాన్న, అత్తామామలు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు. చివరికి నాకు యశ్వంత్ విడాకులిచ్చేశాడు. అప్పటికి గాని నేను చేసిన తప్పేంటో నాకు తెలీలేదు. కనీసం సరిదిద్దుకొనే అవకాశం కూడా లేకుండా చేసుకున్నాను.
ఇప్పుడు నా పేరు వింటేనే నా స్నేహితులు చిరాకు పడుతున్నారు. అయినవాళ్లు ఇలా చేశావేంటి? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే నేను చేసింది చాలా పెద్ద తప్పు. కట్టుకున్న వాడినే అనవసరంగా అనుమానించి, తీరని వేదనను మిగిల్చాను. ఇప్పుడు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. ఇదంతా మీతో ఎందుకు పంచుకుంటున్నానని అనుకుంటున్నారా? అనుమానం అనే నీడలో నా భర్త చూపిన ప్రేమ నా కళ్లకు కనబడలేదు. తీరా తను దూరమైన తర్వాత నన్ను ఎంత ప్రాణప్రదంగా చూసుకున్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. కానీ ఏం ఉపయోగం?? ఈలోగానే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అందుకేనాలాగే ఆలోచిస్తున్నవారు ఎవరైనా ఉంటే మీ దృక్పథాన్ని మార్చుకుంటారనే ఉద్దేశంతోనే నేను నా జీవితాన్ని ఇలా మీ ముందుంచాను.
- ఇట్లు
రమ్య