అసలే ఆర్థికంగా కష్టాల్లో ఉందామె.. దానికి తోడు కరోనా ప్రతికూల పరిస్థితులు ఆమెకున్న ఉద్యోగాన్ని లాగేసుకొని ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. అయినా ఉద్యోగ ప్రయత్నాలు మానుకోలేదామె. తన పనితనం, ప్రతిభకు మెచ్చి ఓ కంపెనీ ఆమెకు ఉద్యోగమిచ్చింది.. అందులోనూ కరోనా కారణంగా ఇంటి నుంచే పని చేయమనే ఆఫర్ కూడా ఇచ్చింది. ‘నా అదృష్టమో, దేవుడి దయో గానీ.. ఉద్యోగమైతే వచ్చింది’ అని సంబరపడిపోయిందామె. ఇక తన కష్టాలు తీరిపోయినట్లే అనుకుంది.. కానీ అప్పట్నుంచి ఆ కష్టాలకు మించిన నరకం అనుభవిస్తానని ఊహించలేదామె. మరి, ఉద్యోగం చేద్దామంటే రోజూ వేధింపులే, మానేద్దామంటే మానేయలేని పరిస్థితి.. అంటూ తనకెదురైన చేదు అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.
జీవితంలో కష్టాలైనా, మనసులోని బాధైనా చెప్పుకుంటేనే గుండె భారం దిగుతుందంటారు. అదీ మన అనుకున్న వారితో పంచుకుంటే మనసు మరింత స్థిమిత పడుతుందంటారు. ఒక్కోసారి మనలాంటి సమస్యే ఇతరులకూ ఎదురుకావచ్చు. అలాంటప్పుడు మనం వేసే అడుగు వారిలో ధైర్యం నింపచ్చు. ఆ ఉద్దేశంతోనే నా జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నా పేరు ప్రమోద. మాది వైజాగ్ దగ్గర చిన్న పల్లెటూరు. అమ్మ, నాన్న, నేను, నాకో చెల్లి.. ఇదీ మా కుటుంబం. నాకు చిన్నతనం నుంచి చదువంటే ప్రాణం. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటర్మీడియట్తోనే నేను చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నాకు పెళ్లి చేసేశారు అమ్మానాన్న. చదువుకోవాలన్న ఆశ ఉన్నా అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టలేక అయిష్టంగానే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాను.

నా బాధను ఆ దేవుడైనా అర్థం చేసుకున్నట్లున్నాడు.. అందుకే నాకు బంగారం లాంటి భర్తనిచ్చాడు. పెళ్లయ్యాక రోజులు గడుస్తున్న కొద్దీ నా భర్త కల్యాణ్ నాపై చూపే ప్రేమ అంతకంతకూ పెరగసాగింది. తనూ డిగ్రీ వరకు చదువుకున్నాడు.. అయినా కుటుంబ పరిస్థితుల కారణంగా అక్కడితో చదువు ఆపేసి ఊర్లోనే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే తనకు ఎలా తెలిసిందో గానీ నాకు చదువంటే చాలా ఇష్టమని, ఆర్థిక కారణాల వల్ల అది కుదరలేదని, ఇంతలోనే మా అమ్మానాన్న నాకు పెళ్లి చేసేశారని.. ఇలా అన్ని విషయాలు కల్యాణ్‌కి తెలిశాయి. ‘నీకు చదువంటే చాలా ఇష్టమట కదా.. నిన్ను నేను చదివిస్తా’ అన్నాడు. ఆ మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇలా ఆయన ప్రోత్సాహంతో నేను ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నా. కష్టపడి చదివా. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రావడంతో వైజాగ్‌లోనే ఓ టాప్ కాలేజీలో నాకు ఇంజినీరింగ్ సీటొచ్చింది. నాలుగేళ్లు చకచకా గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఓ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. ఆ తర్వాతే నేను, మా ఆయన హైదరాబాద్ వచ్చేశాం.. ఇక్కడికొచ్చాక నా భర్త బిజినెస్‌లో, నేను ఉద్యోగంలో బిజీబిజీగా మారిపోయాం.. ఇక్కడా నాలుగేళ్లు ఆనందంగా గడిచిపోయాయి.. అంతలోనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

ఇలా హాయిగా, ఆనందంగా సాగిపోతోన్న మా జీవితాల్లోకి కరోనా ప్రవేశించాక అంతా తారుమారైపోయింది. మా ఆయన వ్యాపారం దెబ్బతింది. నేను ఉద్యోగం చేసే కంపెనీ మూసేయడంతో నా ఉద్యోగం కూడా పోయింది. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు ఇద్దరు పిల్లల బాధ్యత.. ఎలా? అని ఇద్దరం పదే పదే మథన పడేవాళ్లం. అయినా నేను వెనకడుగు వేయలేదు. నాకున్న ట్యాలెంట్, అనుభవంతో చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేశా.. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా. ఈ క్రమంలోనే ఓ కంపెనీ నాకు ఉద్యోగం ఇచ్చింది. ‘నా అదృష్టమో, దేవుడి దయో కానీ నాకు ఉద్యోగమైతే వచ్చింది.. ఇక ఏ ఢోకా లేదు’ అనుకున్నా.. పైగా ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇవ్వడంతో మరింత సంబరపడిపోయా. నిజానికి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పటిదాకా అలవాటు లేకపోవడంతో మొదట్లో కాస్త ఇబ్బంది పడినా ఆ తర్వాత కుదురుకున్నా. ఇలా రెండు నెలలు గడిచిపోయాయి. సమయానికి లాగిన్ అవడం, నిర్ణీత సమయంలో పని పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత లాగౌట్ అవడం.. ఇలా నా పనేదో నేను శ్రద్ధగా పూర్తి చేసుకునేదాన్ని. మధ్యమధ్యలో టీమ్‌తో మీటింగ్స్ కూడా జరిగేవి.
******
ఇలా వర్చువల్ మీటింగ్స్ సమయంలో అందరం ఎవరి ఆలోచనల్ని వారు బాస్‌తో పంచుకునే వాళ్లం. అందరి ఐడియాస్ కంటే నా ఐడియాసే చాలా క్రియేటివ్‌గా ఉన్నాయని మా బాస్ నన్ను తెగ మెచ్చుకునేవారు. అంతేకాదు.. ముందు నుంచీ ఆయన నన్ను ప్రత్యేకంగా ట్రీట్ చేయడం చూసి.. నిజంగానే నాలో అంత ట్యాలెంట్ ఉందా అని నన్ను నేనే ప్రశంసించుకునేదాన్ని. కానీ నా మీద కన్నేసే ఇదంతా చేస్తున్నాడని ఆ తర్వాత గానీ నాకు అర్థం కాలేదు. మొదట్లో అయితే రోజూ ఆఫీస్ పని పూర్తయ్యాక ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి నా వ్యక్తిగత విషయాల గురించి అడిగేవాడు. ఇంట్లో నా భర్త, పిల్లలున్నారని తెలిసినా ఇంకాసేపు మాట్లాడమంటూ వేధించేవాడు.. ఈ మధ్య అతని ప్రవర్తన మరీ మితిమీరిపోయింది. వర్చువల్ మీటింగ్ అని చెప్పి ఓ రోజు నా ఒక్కదానికే జూమ్ కాల్ చేశాడు. అది నిజమేనేమోనని నమ్మి వర్చువల్ కాల్ అటెండ్ చేస్తే అసభ్యంగా ప్రవర్తించాడు.. అర్ధనగ్నంగా నా ముందు నిల్చొని.. అభ్యంతరకరంగా ఏదేదో మాట్లాడాడు. ‘నాతో ఒక్క రోజు గడుపు.. నిన్నొదిలేస్తా’ అంటూ చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఇలా అతని మాటలు, చేతలు ఆ రోజు నాకు నరకం చూపించాయి.

ఇలాంటి వారిని అలాగే వదిలేస్తే నాలాంటి పరిస్థితి మరొకరికి ఎదురవదని నమ్మకమేంటి? అందుకే అతని గురించి మా ఆఫీస్‌లోని పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు POSH (పని ప్రదేశంలో లైంగిక వేధింపుల్ని నిరోధించే చట్టం) సెల్లోనూ అతనిపై కంప్లైంట్ ఇచ్చాను. దీంతో అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇది నా ఒక్కదాని సమస్యే కాదు.. కరోనా వచ్చిన దగ్గర్నుంచి ఆఫీస్ పనైనా, పాఠాలు నేర్చుకోవడమైనా.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది ఇలాంటి సైబర్ వేధింపులకు పాల్పడుతున్నారు.. దీని కారణంగా ఎందరో మహిళలు నరకం అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో ఆన్లైన్ వేధింపులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయంపై స్పష్టత లేదు. కాబట్టి దీనికి అనుగుణంగా పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టంలో తక్షణమే మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే దీన్నే అదనుగా భావించి ఇలాంటి మృగాలు మరింత పెట్రేగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అతడిపై ఫిర్యాదు చేశాక నా మనసు కాస్త కుదుటపడింది. నన్ను మానసిక క్షోభకు గురిచేసిన అతడికి సరైన శిక్ష పడేదాకా నా పోరాటం ఆగదు!
ఆఫీస్ పనితో పాటు లైంగిక వేధింపులు కూడా 'ఆన్ లైన్' వేదికనెక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో - మహిళలను ఇలా వేధింపులకు గురి చేసేవారికి ఎలా బుద్ధి చెప్పాలో మీరు కూడా మీ సూచనలు, సలహాలు పంచుకుంటే నాలాంటి ఎంతోమందికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది..
ఇట్లు,
ప్రమోద