కళ్ల ముందు కనిపించే ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులు. వారి సంతోషాలను సైతం పక్కన పెట్టి అహర్నిశలు కన్నబిడ్డల కోసమే శ్రమిస్తారు. పిల్లల ఆనందంలోనే తమ సంతోషాన్ని చూసుకొని మురిసిపోతారు. అందుకే చాలామంది పిల్లలకు వారి తల్లిదండ్రులే రోల్‌మోడల్స్‌గా ఉంటారు! ముంబయికి చెందిన ఓ అమ్మాయికి కూడా అంతే! తన తల్లే తనకు సర్వస్వంగా భావించిన ఆమె తల్లి కోరికను తీర్చడమే లక్ష్యంగా మార్చుకుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె లక్ష్యం ఏంటి? తెలియాలంటే ఇది చదవాల్సిందే..
హాయ్..
నా పేరు రేఖ. మాది ముంబయి. మా అమ్మానాన్న ముంబయికి శరణార్థులుగా వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. చేతికి చిక్కిన పని చేసుకుంటూ పేదరికం మధ్య జీవించడం చిన్నప్పట్నుంచీ అలవాటు అయిపోయింది. అయినా సరే.. నన్ను చదివించడం కోసం మా అమ్మానాన్న ఎంతగానో కష్టపడ్డారు. నాకంటూ ఒక ఉద్యోగం సంపాదించుకొని సొంత గుర్తింపు తెచ్చుకోవాలన్నది వారి ఆశ. ఇందుకోసం వారి చిన్న చిన్న సంతోషాలను సైతం వదులుకున్నారు. అందుకే వారి ఆశ తీరుస్తూ జీవితంలో చక్కగా స్థిరపడడమే నా లక్ష్యంగా మార్చుకున్నా.
*****
ఐదో తరగతి వరకు వీధిలోనే ఉన్న పాఠశాలలో చదువుకున్న నేను ఆ తర్వాత చదువు కొనసాగించేందుకు మాత్రం ఒక స్వచ్ఛంద సంస్థ సహాయం తీసుకోక తప్పలేదు. అలా ముంబయిలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత విద్యను సైతం పూర్తి చేశా. పదో తరగతిలో 60% మార్కులతో పాసయ్యా. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో చేరా. మొదటి సంవత్సరం కళ్లు మూసి తెరిచే లోపే ముగింపు దశకు వచ్చేశా. అన్నీ మనం అనుకున్నట్లు జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి?? ఎంతో కష్టపడి పరీక్షలకు సన్నద్ధమైన నాకు మలేరియా జ్వరం రూపంలో విధి సవాలు విసిరింది. దాంతో పోరాడుతూనే ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యా. కానీ వైద్యులు మాత్రం ఆ పరిస్థితుల్లో నేను పరీక్షా కేంద్రానికి వెళ్లి ఎగ్జామ్స్ రాయడం అంత మంచిది కాదని అన్నారు. అయినా సరే.. మనసు వూరుకోదు కదా! మొండిగా వెళ్లి పరీక్షలు రాశా. కానీ ఈ పోరాటంలో విధి గెలిచి నన్ను వెక్కిరించింది. ఒక సబ్జెక్ట్‌లో నేను ఫెయిల్ అయ్యా. మిగతా వాటిలో మాత్రం మార్కులు బాగానే వచ్చాయి. అనారోగ్యంతో పోరాడి ఇంత శ్రమకోర్చి చదివితే ఇలా జరిగిందేమిటా.. అని చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయా.

సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి నా భుజంపై చేయి వేసింది అమ్మ. విషయం ఎలా చెప్పాలో తెలియక సిగ్గుతో ముఖం దాచుకుంటూనే పరీక్ష తప్పిన సంగతి చెప్పేశా. కోప్పడుతుందేమోనని భయపడ్డా. కానీ అందుకు భిన్నంగా చిరునవ్వు నవ్వింది. నాకు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత నా కన్నీళ్లు తుడుస్తూ.. 'పరీక్షలు రాయడానికి నువ్వు ప్రయత్నించావు. ఆ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు కదా??' అని అడిగింది. 'లేదు' అని చెప్పా. అయితే ఎందుకు బాధపడుతున్నావు?? నీ పని నువ్వు సరిగ్గానే చేశావు. అలాంటప్పుడు ఫలితం చూసి బాధపడడం దేనికి?? మరోసారి ప్రయత్నించు.. తప్పేమిటి?? అంటూ నాలో ఉత్సాహాన్ని నింపింది. అలా అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి 75% మార్కులు సంపాదించుకున్నా. ఆ తర్వాత ఇంజినీరింగ్‌లో చేరా.
*****
చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం ప్రారంభించా. అలా అహర్నిశలు కష్టపడి ఇంజినీరింగ్ చదువుతుండగానే నాన్న అనారోగ్యం బారిన పడడం, అకస్మాత్తుగా కన్నుమూయడం.. ఒకదాని వెంట మరొకటి చకచకా జరిగిపోయాయి. దాంతో నా ఉత్సాహం కూడా నీరుగారిపోయింది. ఒకానొక దశలో చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ అమ్మకు చేదోడు వాదోడుగా ఉండాలని కూడా అనుకునేదాన్ని. కానీ లక్ష్యాన్ని వదులుకోవాలంటే మనసు ఒప్పుకోవాలిగా..! ఎటూ తేల్చుకోలేక నాలో నేనే సతమతమైపోయేదాన్ని. ఇది గమనించిన మా అమ్మ మళ్లీ నాలో ఆత్మవిశ్వాసం నూరిపోసింది. తనని తాను చూసుకుంటానని, చదువుపై దృష్టి పెట్టమని చెప్పడంతో తిరిగి కళాశాల మెట్లు ఎక్కాను. ఈసారి నా లక్ష్యానికి 'అమ్మను చక్కగా చూసుకోవాలి' అనే ఆశ కూడా తోడైంది. అలా రెట్టించిన పట్టుదలతో ఇంజినీరింగ్ పూర్తి చేయడమే కాదు.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ఉద్యోగం కూడా సంపాదించా.

ప్రస్తుతం నేనొక ప్రముఖ సంస్థలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నాను. ఈ మధ్యే నా పీహెచ్డీ కూడా పూర్తి చేశా. మా అమ్మ ముందు ఆ పట్టా అందుకోవాలనే ఆశతో ఆమెని కూడా వెంట తీసుకెళ్లా. నిజానికి నాన్న స్వర్గస్తులయ్యాక అమ్మ బయటకు వెళ్లడం బాగా తగ్గించేసింది. తన పని ఏదో తనది అన్నట్లుగానే ఉండేది. కానీ నేను పట్టా అందుకునే రోజు మాత్రం మంచి పట్టుచీర కట్టుకొని రావడం నాకే ఆశ్చర్యం అనిపించింది. కాలేజీకి వెళ్లిన తర్వాత స్నాతకోత్సవ కార్యక్రమంలో పెద్దల ప్రసంగాల అనంతరం మాకు పట్టాలు అందించారు. వేదికపై నేను పీహెచ్డీ పట్టా అందుకుంటున్న ఆ క్షణం మా అమ్మ కళ్లలో నాకు ఆనందం కనిపించింది. 'నా కల నిజమైంది..' అనే మా అమ్మ భావన స్పష్టంగా తెలిసింది. అది ఇన్నేళ్లుగా నేను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేసింది. తల్లిదండ్రుల ఆనందం కంటే పిల్లలకు ఇంకేం ముఖ్యం చెప్పండి..!
ఇదంతా మీతో ఎందుకు పంచుకుంటున్నానో తెలుసా?? ఈరోజుల్లో చిన్న చిన్న కారణాలకే అసహనానికి గురి కావడం.. ఆత్మహత్యకు పాల్పడడం చాలా కామనైపోయింది. చనిపోవడానికి ముందు ఒక్క క్షణం తల్లిదండ్రుల గురించి ఆలోచించి చూడండి.. వాళ్లు మీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో..! మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో..! వాళ్లని చూసుకునేది ఎవరు?? ఆ బాధ్యత మీదే కదా..! కాబట్టి క్షణికావేశంతో బంగారం లాంటి జీవితానికి మధ్యలోనే చరమగీతం పాడే ఆలోచనలు చేయకండి.. వారి కోసమైనా జీవించడానికి ప్రయత్నించండి..!
ఇట్లు,
రేఖ