‘ఏంటో ఈ మాయదారి కరోనా మహమ్మారి రోజురోజుకీ విరుచుకుపడుతోందే తప్ప ఏమాత్రం శాంతించట్లేదు.. దీనికి టీకా ఎప్పుడొస్తుందో? ఈ గండం నుంచి ఎప్పుడు గట్టెక్కుతామో?’.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోన్న మనమేమో వైరస్ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందోనని భయపడుతుంటే.. కొందరేమో అసలు వైరసే లేనట్లు ప్రవర్తిస్తున్నారు. బయటికి వచ్చే ముందు కనీసం మాస్కైనా పెట్టుకోని వారు కొందరైతే.. సామాజిక దూరాన్ని పూర్తిగా గాలికొదిలేశారు మరికొందరు. నెలలు గడుస్తోన్నా, వైరస్ గురించి అందరిలో అవగాహన వచ్చినా.. ఇలాంటి వారి వల్లే దేశంలో కరోనా విలయతాండవం చేస్తోందని అంటోంది ఓ మెడికో. తద్వారా వారి చుట్టూ ఉన్న వారే కాదు.. వైద్యులపై కూడా మోయలేనంత భారం పడుతోందని, అది వారిని అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తోందని చెబుతూ తమ వెతల్ని ఇలా మనందరితో పంచుకుంది.
హాయ్.. నా పేరు రియా.. గురుగ్రామ్‌లోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడిసిన్ చదువుతున్నా. నేను డాక్టరవ్వాలన్నది నాన్న కల. అలాగని నాకిష్టం లేదనుకోకండి.. చిన్నతనం నుంచి నాకూ వైద్య వృత్తి అంటే చెప్పలేనంత ఇష్టం. అందుకు కారణం మా ఫ్యామిలీ డాక్టర్. ఆమె స్ఫూర్తితోనే పెద్దయ్యాక ఎలాగైనా డాక్టర్ అవుదామనుకున్నా. ఇలా నా ఇష్టానికి నాన్న ప్రోత్సాహం కూడా తోడవడంతో ఈ రంగంలోకి వచ్చాను. డాక్టర్లంటే కనిపించే దేవుళ్లంటారు.. ఆ మాటలకు అసలైన అర్థమేంటో ఈ కరోనా వచ్చాకే నాకు పూర్తిగా అర్థమైంది.

కరోనా మన దేశంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి నేటి వరకు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో వైద్యులతో పాటు మేమూ అటు చదువుకుంటూనే ఇటు విధులకు హాజరవ్వాల్సి వస్తోంది. నిజానికి ముందుగానే ఇలా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది కొత్త వైరస్ కాబట్టి మన దేశంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో పరిస్థితులు ఒకలా ఉండేవి. ‘అమ్మో.. కరోనా వైరస్.. దాని బారిన పడితే ఇక అంతే సంగతులు!’ అన్న భయం అందరిలో ఉండేది. కానీ నానాటికీ వైరస్‌కు సంబంధించిన కొత్త కొత్త విషయాలు తెలియడం, ప్రభుత్వాలు దీనిపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుండడంతో ప్రజల్లో చాలావరకు అవగాహన పెరిగింది. అయితే అదే సమయంలో- ఇతరత్రా అనారోగ్యాలున్న వారే వైరస్‌కు బలవుతున్నారని, లక్షణాలు కనిపించకపోతే ప్రమాదమేమీ ఉండదన్న అభిప్రాయం చాలామంది యువతలో నిర్లక్ష్యం పెంచుతోంది.
******
ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలామంది కనీసం బయటికొచ్చే ముందు మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు. అసలు కరోనా లేనే లేదన్న అతి విశ్వాసం, నిర్లక్ష్యం వారిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక సామాజిక దూరం మాటను గాలికొదిలేసి ఫ్రెండ్స్‌తో పార్టీలు కూడా చేసుకుంటున్నారు కొంతమంది. ఈ అలక్ష్యమే వారిని, వారితో పాటు ఇంట్లో వాళ్లను కూడా ఆపదలోకి నెట్టేస్తోంది. దీని ప్రభావం ప్రత్యక్షంగా వైద్యులు, నర్సులు, మా లాంటి జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిపై పడుతోంది. ఇందుకు ఇటీవల మా ఆస్పత్రిలో జరిగిన ఓ సంఘటనే సాక్ష్యం.
సహాయం చేయబోతే ఆపద ఎదురైనట్లు.. ఈమధ్యే మా హాస్పిటల్లో ముగ్గురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. అది వారు చేసిన తప్పు కాదు.. అయినా సమస్యను, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మా హాస్పిటల్ చుట్టు పక్కల నివసించే ప్రజలంతా వచ్చి గొడవ చేశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోన్న వైద్యులే వైరస్ బారిన పడ్డారంటే అది తమ దాకా రాదన్న గ్యారంటీ ఏంటి? అంటూ ఎలాగైనా ఆస్పత్రి మూసేయాలని పట్టుబట్టారు. కానీ అదే సమస్య తమ దాకా వస్తే మాత్రం ఎంత రిస్క్ అయినా వైద్యం చేయాలంటారు. ఇదేం న్యాయం మీరే చెప్పండి?!

ఓ రోజు నేను విధులకు హాజరవడానికి వస్తుంటే ‘ఎందుకొస్తున్నావ్.. వెళ్లిపో! 14 రోజుల దాకా ఐసోలేషన్‌లో ఉండు..’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో మా ఆస్పత్రి వైద్యాధికారులు రంగంలోకి దిగి వారికి నచ్చచెప్పడంతో సమస్య సద్దుమణిగిందనుకోండి. అయితే ఇలాంటి సమస్య నాకే కాదు.. చాలా చోట్ల వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్నారు కూడా! కొన్ని చోట్ల అయితే బాధితులు అని చేరదీసి వైద్యం చేస్తోన్న డాక్టర్ల మీదే దాడులు జరుగుతున్నాయి. ఇంకొన్ని చోట్ల బాధితులకూ పలు సమస్యలు తప్పట్లేదు. అసలే కష్టంలో ఉన్నారని కూడా చూడకుండా ఇరుగుపొరుగు వాళ్లు వారిపై వివక్ష చూపడంతో వారూ మానసికంగా కుంగిపోవాల్సిన పరిస్థితి! కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడాలి కానీ.. ఇలా ఒకరికొకరు శత్రువుల్లా భావిస్తే సమస్య మరింత జఠిలమవుతుంది.
******
ఇక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న కొంతమంది బాధితుల పరిస్థితైతే దయనీయం. సాధారణ రోగుల్లా వారు వారి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం లేకపోవడంతో ‘కనీసం కన్న వారినైనా/ కడుపున పుట్టిన వారినైనా చూసే అవకాశం లేకుండా పోయింది.. ఇదేం బతుకో!’ అంటూ వెక్కివెక్కి ఏడుస్తుంటారు.
ఇటీవలే మా ఆస్పత్రి ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్ చివరి క్షణాల్లో తన చేతికున్న వాచీ నా చేతిలో పెట్టి ‘ఇది మా ఆవిడ నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది.. నేను పోయాక నా జ్ఞాపకార్థం ఆమెకు అందించండి..’ అని బాధపడుతుంటే నాకు కన్నీళ్లాగలేదు. అలాంటి దుస్థితి పగవారికి కూడా రాకూడదు. అందుకే నేను ఒక జూనియర్ డాక్టర్‌గా కాకుండా.. మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాననుకోండి.. దయచేసి బయటికొచ్చే ముందు అందరూ తప్పకుండా మాస్క్ ధరించండి.. ‘ఎందుకులే.. ఈ పక్క షాపుకే కదా..!’ అనుకునే ముందు మీ ఇంట్లో వాళ్లను ఒక్కసారి గుర్తు చేసుకోండి.. అలుపెరుగకుండా నిరంతరం వైరస్ మధ్యే గడుపుతోన్న మా లాంటి వారి శ్రమను గుర్తించండి.. పార్టీలు, ఫంక్షన్లు తర్వాతైనా చేసుకోవచ్చు.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణం కన్నా ఇంకేదీ ఎక్కువ కాదు.. మీకోసమే మేమిక్కడ ఉన్నామని గుర్తించి.. మా కోసం మీరు ఈ జాగ్రత్తలు పాటించండి.. తద్వారా అందరికీ మేలు జరుగుతుంది. త్వరలోనే మనకు మంచి రోజులొస్తాయని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిద్దాం..!