Image for Representation
అమ్మతనమే అతివల జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది. అలాంటి అద్భుతమైన భావనకు ఆదిలోనే అడ్డుకట్ట వేస్తున్నాయి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే పలు సమస్యలు. అందులో పీసీఓఎస్ కూడా ఒకటి. ‘నాకు పీసీఓఎస్ ఉంది.. నేను ఈ జన్మలో అమ్మను కాలేనేమో! ఆ మధురానుభూతిని అనుభవించలేనేమో!’ అంటూ లోలోపలే కుమిలిపోతుంటారు కొందరు మహిళలు. దీనికి తోడు ‘ఈ సమస్య ఉంటే పిల్లలు పుట్టడం కల్లే.. ఇక నువ్వు జీవితాంతం గొడ్రాలుగా మిగిలిపోవాల్సిందే’ అంటూ చుట్టూ ఉన్న వాళ్లు అనే సూటిపోటి మాటలతో ఆ ఉన్న కాస్త ఆశ కూడా ఆవిరైపోతుంది.

ఇలాంటి అనుభవం తనకూ ఎదురైందంటోంది ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ. కానీ ఈ సమస్య ఉన్నా అదృష్టవశాత్తూ తనకు పిల్లలు పుట్టారని.. పీసీఓఎస్ ఉంటే పిల్లలు పుట్టరన్నది అవాస్తవమని తన అనుభవంతో చెబుతోందా మహిళ. అంతేకాదు.. సెప్టెంబర్‌ని ‘పీసీఓఎస్ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు చంటి బిడ్డను చంకనేసుకొని వంద మైళ్ల నడక సాగిస్తోంది. మరి, ఇంతకీ ఎవరామె? తన పీసీఓఎస్ కథేంటి? మహిళలందరికీ ఈ సమస్యపై ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి...
హాయ్.. నా పేరు లారా ఫాల్క్‌నర్. ఇంగ్లండ్‌లోని ప్రీస్టన్ పట్టణంలో నివసిస్తున్నా. ప్రస్తుతం నా భర్త, ఇద్దరు పాపలతో ఆనందంగా గడుపుతున్నా. అయితే 15 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడు నాకు 17 ఏళ్లుంటాయి. ఆ సమయంలో పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్).. అన్న మాట విని అందరమ్మాయిల్లాగే నేనూ కాస్త ఆందోళన చెందా! ఎందుకంటే అప్పుడే నాలో ఈ సమస్య ఉందని తెలిసింది. ‘ఈ సమస్య వల్ల నీకు సంతాన సమస్యలు రావచ్చు..’, ‘అసలు నీకు పిల్లలే పుట్టరు.. నువ్వు జీవితాంతం గొడ్రాలుగా మిగిలిపోవాల్సిందే!’ అని అందరూ అన్న మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. వాటిని నా మనసులో నుంచి ఎంతగా తొలగిద్దామన్నా నా వల్ల కాలేదు.

అయితే మా ఫ్యామిలీ డాక్టర్ ఈ సమస్య గురించి నాకు కొంత మేరకు అవగాహన కల్పించారు.. లోతుగా తెలుసుకోవడానికి నువ్వే మరింత అధ్యయనం చెయ్యి అన్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో ఇదే సమస్యతో బాధపడుతోన్న చాలామంది మహిళల కథలు చదివాను. ఇది దీర్ఘకాలిక సమస్య అని, చికిత్స-జీవనశైలితో దీన్ని అదుపులో ఉంచుకోవచ్చని, ఇది పూర్తిగా నయమయ్యేది కాదని.. ఇలా దీని గురించి బోలెడన్ని విషయాలు నాకు తెలిశాయి.
******
నాకు పిల్లలు పుడతారో, లేదో అన్న భయం, అనుమానంతోనే ఫ్రాజర్ (లారా భర్త)తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టా. మరోవైపు చికిత్స కూడా కొనసాగిస్తున్నా. అయితే కొన్నాళ్లకు నా భయం పటాపంచలైంది.. నా కలలు నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న నమ్మకంతో నా మనసంతా నిండిపోయింది. అందుకు కారణం నేను నెల తప్పడం! నా అదృష్టమో, దేవుడి వరమో తెలియదు కానీ.. మూడుసార్లు నాకు నేనే స్వయంగా హోమ్ ప్రెగ్నెన్సీ కిట్‌తో చేసుకున్న పరీక్షల్లో నేను గర్భం ధరించానన్న విషయం తేలింది. ఆ క్షణం నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సుదీర్ఘ కాలంగా నేను పోరాడుతోన్న పీసీఓఎస్‌ను జయించినంతగా ఉప్పొంగిపోయా. అయితే గర్భం ధరించాక మొదటి మూడు నెలల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. బాగా నీరసంగా అనిపించేది.. విపరీతమైన కడుపునొప్పి వచ్చేది.. నీరొచ్చి పాదాలు వాచేవి. కానీ మొదటి దశలో చాలామందికి ఎదురయ్యే వేవిళ్లు, వికారం.. వంటి లక్షణాలు నాలో చాలా అరుదుగా కనిపించే సరికి నాకు కాస్త ఉపశమనంగా అనిపించింది. మరో విషయం ఏంటంటే.. ఈ సమయంలో నేను బాగా యాంగ్జైటీకి గురయ్యేదాన్ని. అది ఎక్కడ అబార్షన్‌కి దారితీస్తుందోనని బాగా భయపడ్డా. కానీ ఆ తర్వాత స్కాన్‌లో అంతా పర్ఫెక్ట్ అని డాక్టర్ చెప్పాక గానీ నా మనసు కుదుటపడలేదు.
అలా తొమ్మిది నెలలు గడిచిపోయాయి.. నాకు పండంటి పాప పుట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో పాపకు జన్మనిచ్చా. ప్రస్తుతం నా ఇద్దరు పిల్లలతో, భర్తతో నేను ఫుల్ హ్యాపీస్! అయితే నేనొక్కదాన్ని, నా కుటుంబం మాత్రమే ఆనందంగా ఉంటే సరిపోతుందని నేను అనుకోను. నాలాగే పీసీఓఎస్‌తో బాధపడుతోన్న మహిళలు, అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వారిలో ఈ సమస్య గురించి అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే ‘వెరిటీ’ అనే స్వచ్ఛంద సంస్థలో (స్వయం సహాయక బృందం) వాలంటీర్ గా చేరా. పీసీఓఎస్ లక్షణాలకు చికిత్స చేయచ్చని, తద్వారా అమ్మ కావాలన్న కలను నెరవేర్చుకోవచ్చని ఈ ఎన్జీవో ద్వారా మహిళల్లో అవగాహన కల్పిస్తున్నాను. అంతేకాదు.. ఇర్రెగ్యులర్ పిరియడ్స్, డిప్రెషన్, అధిక బరువు, మొటిమలు, ఇతర సౌందర్య సమస్యలతో బాధపడుతోన్న మహిళలకు సైతం మా ఎన్జీవో అండగా ఉంటోంది. అలాగే అలాంటి మహిళలకు సహాయం చేయడానికి నిధులు కూడా సమీకరిస్తున్నాం. ప్రస్తుతం కొంతమంది వాలంటీర్లతో దేశ, విదేశాల్లోని మహిళలకు మా సేవల్ని అందిస్తున్నాం. ఆయా సమస్యలపై నిపుణుల సహకారంతో వెబినార్లు కూడా నిర్వహిస్తున్నాం.
******
ఇక సెప్టెంబర్‌ని ‘ప్రపంచ పీసీఓఎస్ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో ఈ నెలంతా వంద మైళ్ల నడక సాగించాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం అదే పనిలో ఉన్నా. ఓ వైపు ఈ సమస్యపై మహిళల్లో అవగాహన పెంచడం, మరోవైపు నిధుల్ని సమీకరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ క్రమంలో నాకు తారసపడే మహిళలకు పీసీఓఎస్ అవగాహన కరపత్రాన్ని అందిస్తున్నా.. ఈ సమస్య గురించి వారికి వివరిస్తున్నా. ఈ జర్నీలో నా పిల్లలిద్దరినీ కూడా నా వెంటే తీసుకెళ్తున్నా. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నప్పటికీ నాకు, నా పిల్లలిద్దరికీ ఎలాంటి ఆపద రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నా. కాబట్టి.. మహిళలూ! పీసీఓఎస్ ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టరనుకోవడం అపోహ. నా అనుభవమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే నిశ్చితంగా ఉండండి.. ఎదుటివారి మాటల్ని పట్టించుకోకండి! సానుకూల దృక్పథంతో మెలగండి.. సరైన చికిత్స తీసుకోండి, చక్కటి జీవన శైలి అలవర్చుకోండి.. ఉంటాను మరి!