చక్కగా చదువుకొంటూ.. ఆడుతూ పాడుతూ హుషారుగా ఉండే అమ్మాయి.. 12 ఏళ్ల వయసులో కిడ్నాప్‌కు గురైంది. తానెక్కడున్నానో తెలియని పరిస్థితుల్లో కొన్నేళ్ల పాటు కాలం గడిపింది. గాలి చొరబడని గదుల్లో, ముక్కుపుటాలదిరిపోయే వాసనల మధ్య కాలం వెళ్లదీసింది. వ్యభిచార గృహంలో ఎందరి చేతుల్లోనో అత్యాచారానికి గురైంది. కన్నవారికి దూరమై పుట్టెడు కష్టాలనుభవించిన ఆ చిన్నారి ఈ రొంపి నుంచి బయటపడి అమ్మానాన్న దగ్గరికి వెళ్లాలని, వారి ప్రేమలో తడిసిముద్దవ్వాలని కోరుకొంది. కొంతకాలానికి ఆ నరక కూపం నుంచి బయటపడింది. కానీ విధి చిత్రమైంది. తల్లిదండ్రులను ఆమెకు దూరం చేసింది. ఆ బాధ నుంచి తేరుకొన్న ఆమె చదువుకొని ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తన గతం తెలిసిన ఓ అబ్బాయితో జీవితం పంచుకోవాలో వద్దో సతమతమవుతూ, బాధాకరమైన తన జీవిత గాధను ఇలా పంచుకుంటోంది..
నా పన్నెండో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్కులో ఆడుకొంటున్నాను. అప్పుడే నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి నాకు మెలకువ వచ్చింది. నేను ఏదో కదులుతున్న వాహనంలో ఉన్నానని నాకు తెలుస్తోంది. నన్ను ఎక్కడికో తీసుకెళుతున్నారని కూడా అర్థమైంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే.. నా కళ్లకు గంతలు, కాళ్లూచేతులూ కదలకుండా కట్టేశారు. అరవకుండా నా నోటికి ప్లాస్టర్ వేశారు. అవి మాత్రం గుర్తించాను. ఈ లోగా మళ్లీ నాకు స్పృహ తప్పింది.
మరోసారి నాకు మెలకువ వచ్చేసరికి నేను ఓ గదిలో ఉన్నాను. కొంతమంది మహిళలు వచ్చి నన్ను శుభ్రం చేసి నాకు ఆహారం పెట్టారు. నేను సాయం కోసం అరిచినప్పుడల్లా నా ముఖంపై దిండు ఉంచి అదిమిపెట్టేవారు. అప్పుడు వారిపై కోపం వచ్చినా ఆ తర్వాత వారలా ఎందుకు చేసేవారో తెలిసిన తర్వాత నాక్కొంచెం ధైర్యం కలిగింది. నా అరుపులు విని వారి యజమాని వచ్చి నన్ను కొట్టకుండా ఉండేందుకే అలా చేసేవారు. అప్పటికి నేను ఇంకా చాలా చిన్నదాన్ని కాబట్టి నన్ను కాస్త ఖరీదైన గదిలో ఉంచారు. కానీ అలా ఎందుకో నాకప్పటికి ఇంకా తెలీలేదు.
*****
కొన్ని రోజులు పోయిన తర్వాత నన్ను ఓ పెద్ద బంగ్లా ఉన్న వ్యక్తి దగ్గరికి పంపించారు. అతను కొన్ని రోజులు నాపై అత్యాచారం జరిపాడు. అతని స్నేహితులు కూడా నాపై లైంగిక దాడి చేశారు. ఎవరెవరో వస్తూ, వెళుతూ ఉండేవారు. ఆ సమయంలో నాకేం జరుగుతోందో తెలిసేది కాదు. చాలాసార్లు నాకు స్పృహ ఉండేది కాదు. గదిలో అలా పడి ఉండేదాన్ని. ఇంకొన్ని సార్లు నొప్పితో విలవిల్లాడేదాన్ని. మరికొన్నిసార్లు మనోవేదనతో కుమిలిపోయేదాన్ని.

ఈ మొత్తం మురికి కూపంలో నాకు కాస్తయినా ఓదార్పునిచ్చిన వారెవరంటే.. నాకు రోజూ అన్నం పెట్టిన మహిళలే. వారు నాకు స్నానం చేయించేవారు. అన్నం తినిపించేవారు. కొన్నిసార్లు నా పరిస్థితిని చూసి కంటతడి పెట్టేవారు. నా బాధను వారు అర్థం చేసుకొన్నారు. ఎప్పటికైనా ఈ నరకం నుంచి బయటపడతావని ధైర్యం చెప్పేవారు.
ఓరోజు ఉదయం కళ్లు తెరిచి చూసేసరికి నేను వేరే గదిలో ఉన్నాను. అక్కడ కొన్ని గంటల పాటు ఏడ్చాను. కొన్ని రోజుల పాటు అదే గదిలో ఉన్నాను. నా చుట్టూ నాకు కాస్త ఓదార్పునిచ్చేవారు ఒక్కరు కూడా లేరు. ఆ తర్వాత తెలిసింది నన్ను మరో వ్యక్తికి అమ్మేశారని. అక్కడ నా కొత్త యజమాని నాకు మేకప్ వేసుకోవడం, డ్యాన్స్ చేయడం, బయటికి చెప్పలేనివి ఇంకా ఎన్నెన్నో నేర్పించాడు. అయితే అక్కడికి షేక్‌లు వచ్చేవారు కాదు. ప్యాంటు, చొక్కాలు వేసుకొన్న మగవారు వచ్చేవారు. వారి చేతిలో నేనో బొమ్మగా మారిపోయాను. అప్పుడు నాకు ఏమీ బాధ కలిగేది కాదు. వారు చేసే అకృత్యాన్ని ఆపమనీ చెప్పేదాన్ని కాదు. వారేం చెబితే అలా చేసుకుపోయేదాన్ని.
*****
ఓ రోజు ఖాకీ రంగు చీరలో ఉన్న ఒకామె స్పృహ కోల్పోయిన నాకు తిరిగి మెలకువ వచ్చేలా చేసింది. ఆమె నన్ను నా పేరు అడుగుతోంది. అక్కడ ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. కానీ నాకు బాగా ఏడుపొచ్చింది. ఎందుకంటే నన్ను వీళ్లు తీసుకొచ్చిన తర్వాత నా పేరుతో ఎవరూ పిలవలేదు. చెప్పాలంటే నా పేరు నాకు గుర్తు లేదు. కాటన్ సూట్ వేసుకొన్న ఓ మహిళ నా దగ్గరికి వచ్చి నన్ను చాలా ప్రేమగా హత్తుకొంది. 'నిన్ను కాపాడటానికే వచ్చామ'ని ధైర్యం చెప్పింది. ఆ తర్వాత నన్ను ఓ వ్యాన్‌లో ఎక్కించారు. నేనున్నది ముంబయిలో అని అప్పుడే నాకు తెలిసింది. నేను వారికి అన్ని విషయాలు చెప్పాను. అప్పటికి నేను కిడ్నాపై ఐదేళ్లు గడిచాయి. ఆరంభంలో కొన్ని రోజులు హైదరాబాద్‌లో ఉన్న విషయం కూడా వారికి చెప్పాను.
ఆ తర్వాత వారు నన్ను ఓ సంరక్షణ గృహానికి తీసుకెళ్లారు. అక్కడ నేను సైకియాట్రిస్ట్‌తో మాట్లాడేదాన్ని. ఇంకా కొన్ని తరగతులకు కూడా హాజరయ్యేదాన్ని. పరీక్షలు కూడా రాసేదాన్ని. అంతకు ముందు నేను గడిపిన భయానక అనుభవాలు నా కళ్ల ముందు మెదలకుండా ప్రశాంతంగా నిద్రపోవడం నేర్చుకున్నాను. కొత్త జీవితాన్ని సాధారణంగా, హుందాగా గడపడం ప్రారంభించాను. అంతకు ముందు నేనున్న మురికి కూపాల్లో నాకు కొన్నిసార్లు అసురక్షిత గర్భస్రావం చేయించారని తెలిసింది. ఇకపై నా గర్భం చిన్నారిని మోయడానికి పనికి రాదని వైద్యులు చెప్పారు. ఓసారి నా దగ్గరికి వచ్చిన ఓ క్లయింట్ నా మణికట్టుని విరగ్గొట్టాడు. కొన్నేళ్ల పాటు దానికి చికిత్స జరగకపోవడంతో ఆ నొప్పి అలాగే ఉండిపోయింది. ఇలా చెప్పాలంటే అయిదేళ్ల పాటు ఆ నరకంలో నేను పడ్డ బాధలు, చేదు అనుభవాలు ఎన్నో. వాటిని మరిచిపోయేందుకు కొన్నేళ్ల సమయం పట్టింది.

రెస్క్యూ హోంలో ఉన్న వైద్యుల సాయంతో నా చిన్నప్పటి విశేషాలన్నీ నేను తిరిగి గుర్తు చేసుకొన్నాను. నా ఇంటి అడ్రస్ కూడా నాకు గుర్తొచ్చింది. నాకు ఆశ్రయమిచ్చిన ఎన్జీవో సభ్యులు నా తల్లిదండ్రులను తిరిగి కలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ నేను కనబడకుండా పోయిన తర్వాత అమ్మ అన్నం తినలేదట. కనీసం మంచినీళ్లు కూడా తాగలేదట. చివరికి నా మీద బెంగతోనే చనిపోయిందట. ఆ తర్వాత నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది.
*****
నన్ను రక్షించిన ఎన్జీవో.. దిల్లీలో నా జీవితానికి దారి చూపించే స్పాన్సర్ని కనుగొంది. నన్ను అక్కడికి పంపించారు. స్పాన్సర్ సాయంతో నేను కంప్యూటర్, ఫారిన్ లాంగ్వేజ్ కోర్సు పూర్తి చేశాను. ఇప్పుడు నేను ఓ కంప్యూటర్ సెంటర్లో బోధకురాలిగా పనిచేస్తున్నాను. ఇద్దరమ్మాయిలతో కలసి ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాను. నాకు ఓ మంచి స్నేహితుడు కూడా ఉన్నాడు. అతనికి నా గతం గురించి అంతా తెలుసు. అప్పుడప్పుడూ తన ముందు ఆ సంఘటనలు తలచుకొంటే.. కొంచెం గాబరా పడుతుంటాడు. ఇప్పటికీ కొన్నిసార్లు నేను ప్రశాంతంగా నిద్రపోలేను. ఒక్కోసారి నన్ను మళ్లీ ఆ నరక కూపంలోకి ఎవరో లాక్కెళ్లిపోతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు తనకి ఫోన్ చేస్తే.. నన్ను మళ్లీ మామూలు స్థితికి తీసుకొస్తాడు. నేను సురక్షితంగా ఉన్నాననే భావన కల్పిస్తాడు. అతను పంజాబ్‌కి చెందినవాడు. నన్ను ఎప్పుడూ నవ్విస్తుంటాడు. డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ నన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడప్పుడూ లాంగ్ డ్రైవ్స్‌కి కూడా తీసుకెళుతుంటాడు. నా కోసం అప్పుడప్పుడూ స్వయంగా వంట చేసి మరీ తీసుకొస్తుంటాడు. కొన్నేళ్ల పాటు సరైన తిండి లేకపోవడం వల్ల నేను బక్కచిక్కినట్లుగా తయారయ్యాను. శారీరక దారుఢ్యం తెచ్చుకొనేందుకు నన్ను జిమ్‌కు వెళ్లమని చెబుతుంటాడు. కానీ అతను మధ్యతరగతి వర్గానికి చెందిన వాడు కావడంతో నా గతం గురించి అతని స్నేహితులకు, కుటుంబానికి ఒక్క మాట కూడా చెప్పలేదు. అది ఎందుకో నేను అర్థం చేసుకోగలను. కానీ నా గురించి వారికి చెప్పకుండా దాచి ఉంచడం మాత్రం నచ్చలేదు.

ఈ మధ్యే తను నాకు ప్రపోజ్ చేశాడు. కానీ నేను అతని ప్రతిపాదనను అంగీకరించలేదు. ఎందుకంటే నేను అతనికి సరిపోను. అతను చాలా అందంగా ఉంటాడు. మంచివాడు, చదువుకున్నవాడు, నిజాయతీపరుడు, చాలా హుందాగా ఉంటాడు. మరి నేను.. హృదయం పగిలిపోయి జీవిస్తున్నాను. ఒకరి భార్యగా జీవించే అర్హత నాకు లేదు. కానీ తను మాత్రం గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామన్నాడు. పిల్లల్ని కనలేకపోతేనేం.. దత్తత తీసుకుందామన్నాడు. నేను వివాహానికి సిద్ధపడేంత వరకు ఎదురుచూస్తానని చెప్పాడు. కానీ నా గత జ్ఞాపకాలతో అతని జీవితాన్ని, కలల్ని నేను నాశనం చేయలేను. కాబట్టి నేను కూడా ఎదురు చూస్తాను. అతనికి తగిన అమ్మాయి దొరికేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాను.. మరి నా నిర్ణయం కరక్టే అంటారా??