Image for Representation
‘యుక్తవయసులో ఉన్న వారికి కరోనా సోకదు.. ఒకవేళ సోకినా దాని ప్రభావం అంతగా ఉండదు.. కొవిడ్‌కు సాధారణ ఫ్లూ లక్షణాలే ఉంటాయి..’ ఇవీ ప్రస్తుతం ఈ మహమ్మారి గురించి చాలామందిలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు. అయితే కంటికి కనిపించకపోయినా ప్రపంచాన్నే పట్టి పీడిస్తోన్న ఈ భూతం గురించి అంత అలక్ష్యం పనికిరాదంటోందో యువతి. మనిషి-మనిషికీ తన ఉనికిని మార్చుకుంటూ విరుచుకుపడుతోన్న ఈ వైరస్.. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఎంతోమందిని బలి తీసుకుంటోంది. అలాంటి మహమ్మారితో కొన్ని వారాలు నరకం అనుభవించానని, ప్రతి ఒక్కరూ ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని చెబుతోందీ యువతి. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న బాధ గురించి పంచుకుంటే కొందరైనా ఈ మహమ్మారిని సీరియస్‌గా తీసుకొని జాగ్రత్తపడతారన్న చిన్ని ఆశతోనే తన కరోనా కథను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నానంటోందీ పాతికేళ్ల అమ్మాయి.
హాయ్.. నా పేరు బెథానీ థామస్ వెసెల్స్. నేను డర్బన్‌లో నివసిస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ముందుగా కరోనా ప్రస్తావనే వస్తోంది. కంటికి కనిపించకపోయినా అది మన మనసుల్లో అంతగా నాటుకుపోయింది మరి! అయితే ‘యుక్తవయసులో ఉన్న వారికి కరోనా సోకదు.. ఏవైనా అనారోగ్యాలున్న వారే ఈ మహమ్మారితో ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది.. చనిపోయే వారిలో కూడా ఇతర అనారోగ్యాలున్న వారే ఎక్కువ’ అనేది చాలామందిలో నెలకొన్న అభిప్రాయం. దీంతో ఎక్కువ శాతం మంది కరోనాను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. బయటికి వెళ్లినా కనీసం మాస్క్ ధరించడం - సామాజిక దూరం పాటించడం.. వంటివి విస్మరిస్తున్నారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించాలనే నా కొవిడ్ స్టోరీని మీ అందరితో పంచుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చా!
*****
కరోనా సోకకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, రోగనిరోధక శక్తి కోసం చక్కటి పోషకాహారం-సప్లిమెంట్స్ తీసుకున్నా.. అవన్నీ తాత్కాలిక ఉపశమనమే..! అందుకు నా స్వీయానుభవమే సాక్ష్యం. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు నేను రోజూ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకునేదాన్ని, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేదాన్ని, బయటికి వెళ్లినా కరోనా జాగ్రత్తలు పాటించేదాన్ని.. రోజూ ఎండలో కాసేపు గడిపేదాన్ని. ఇక నా ఫుడ్ మెనూను కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా. తాజా పండ్లు, కాయగూరలు, నిమ్మరసం, పసుపు, అల్లం టీ.. ఇలా రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలకే నా డైట్లో భాగమిచ్చా. కానీ నా విషయంలో ఇవేవీ వర్కవుట్ కాలేదు. ఎలా సోకిందో తెలియదు కానీ దురదృష్టవశాత్తూ ఈ మహమ్మారి బారిన పడ్డా.
ఓ రోజు నా కుటుంబంతో కలిసి డిన్నర్ చేశాక.. చలితో శరీరమంతా వణికిపోయింది. అది ఫ్లూ వల్లేనేమో అనుకున్నా! ఆ మరుసటి రోజు సైనస్, నీరసం.. వంటి లక్షణాలు కనిపించినప్పటికీ నాకెందుకు ఇలా జరుగు తోందని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయా. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ లక్షణాలకు తీవ్రమైన తలనొప్పి కూడా జత కలిసింది. అలాగని సాధారణ కొవిడ్ లక్షణాలుగా చెబుతోన్న జ్వరం, గొంతునొప్పి.. వంటివేవీ నాలో కనిపించలేదు. వీటికి తోడు క్రమంగా ముక్కుదిబ్బడ, చేతుల్లో వణుకు, విపరీతమైన అలసట, ఆకలి లేకపోవడం, వాసన-రుచి కోల్పోవడం, వికారం, ఒంటినొప్పులు.. ఇలా అన్ని లక్షణాలూ ఒకటి తర్వాత మరొకటి విరుచుకుపడడంతో ఇంత తీవ్రమైన అనారోగ్యం నా జీవితంలో మునుపెప్పుడూ ఎదుర్కోలేదనిపించింది. అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎదురైన భావోద్వేగాలు నన్ను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. అదెంతలా అంటే.. నేను చనిపోతానేమోనని ఒక్కోసారి ఏడ్చేదాన్ని కూడా!
******
ఈ అనారోగ్యాల నుంచి విముక్తి పొందడానికి మందులు కూడా వేసుకున్నా.. అయినా అవి పావుగంటకు మించి ప్రభావం చూపించలేదు. వెంటనే డాక్టర్ని సంప్రదించా. ‘ఈ లక్షణాలన్నీ నీకు కరోనా సోకిందేమోనన్న అనుమానాన్ని బలపరుస్తున్నాయి.. అందుకే ఓసారి పరీక్ష చేయించుకో..’ అని సూచించారు. అనుమానించినట్లే మూడు రోజుల తర్వాత వచ్చిన ఫలితాల్లో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరా. రెండో వారంలో నా ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లనిపించింది. హమ్మయ్య! ఇక కోలుకుంటాను.. తిరిగి నా పనుల్ని నేను చేసుకోవచ్చు.. అనుకుంటున్న తరుణంలోనే ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. అప్పుడు వైద్యులు నా ఛాతీ భాగాన్ని ఎక్స్‌రే తీశారు. సైలెంట్ హైపోక్సియా (మనం పైకి ఆరోగ్యంగా కనిపించినా మనకు తెలియకుండానే శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం. దీంతో రాన్రానూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి) అని చెప్పారు. అలాగే ఛాతీ, పక్కటెముకల్లో వాపు, కొవిడ్-న్యుమోనియా, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టినట్లుగా ఈ ఎక్స్‌రేలో గుర్తించారు.
******
ఇవన్నీ విన్నాక ఒక్కసారిగా ఢీలా పడిపోయా. ఇక నా పనైపోయిందనుకున్నా. ఆ క్షణం నా జీవితంలోని అనుభూతులన్నీ ఓసారి నెమరువేసుకున్నా. ఒక్కోసారి ఏడుస్తూనే నా పాత జ్ఞాపకాలన్నీ లేఖల రూపంలో రాసేదాన్ని. ఈ క్రమంలో వైద్యులు ఎంత ధైర్యం చెప్పినా ఏదో ఓ మూల నాలో తెలియని భయం నన్ను వెంటాడేది. కానీ ఆ దేవుడి దయవల్ల నాకు ప్రాణాపాయం తప్పింది. సమస్యను త్వరగా గుర్తించడం వల్లే ఈ గండం నుంచి గట్టెక్కానని వైద్యులు చెప్పారు. మొత్తానికి దాదాపు నెల రోజుల పోరాటం, నా ఆరోగ్యం విషయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాక గానీ ఈ మహమ్మారి నుంచి నాకు విముక్తి లభించలేదు. ఈ గడ్డు పరిస్థితుల నుంచి నేను బయటపడడానికి ప్రత్యక్షంగా వైద్యులు.. పరోక్షంగా నా భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు కొండంత అండగా నిలిచారు. నేను ఒత్తిడికి లోనైనప్పుడు నాకు ధైర్యం చెప్పారు.. నేను త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేశారు.. వారందరికీ థ్యాంక్స్ మాత్రమే చెప్పి సరిపెట్టుకోలేను!
ఇక అందరితో చెప్పాల్సిన ముఖ్యమైన విషయం మరొకటుంది. కరోనాను జయించాలంటే మనం ముఖ్యంగా రెండు అపోహల్ని దూరం చేసుకోవాలి. ఒకటి - యుక్తవయసులో ఉన్న వారు కొవిడ్‌కు ప్రభావితులు కారు, రెండోది - కరోనా వస్తే సాధారణ ఫ్లూ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. చాలామంది వీటిని దృష్టిలో ఉంచుకొని కొవిడ్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఈ మహమ్మారికి లేని లక్షణమంటూ లేదు. కొంతమందిలో సైలెంట్ హెపోక్సియాతో ఇది దాడి చేస్తుంది. దాంతో అప్పటిదాకా ఆరోగ్యంగా తిరిగిన వారు సైతం ఈ వైరస్‌కు బలవుతున్నారు. మరికొంతమందిలో కాళ్లలో రక్తం గడ్డ కడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.. నేను సంప్రదించిన డాక్టర్ కూడా నాకు ఈ పరీక్ష చేసి చూశారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణంతో కరోనా అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాబట్టి ఈ వైరస్ విషయంలో ఎవ్వరూ అశ్రద్ధ చేయద్దు.
******
వైరస్‌కు వయసు, ఆడ-మగ అన్న తేడా లేదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే.. మన శరీరంలోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ‘నేను యవ్వనంలోనే ఉన్నాను కదా.. నాకేమీ కాదు..’ అనే అతి విశ్వాసంతో స్నేహితులను కలవడానికి వెళ్లడం, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరగడం వల్ల చిక్కుల్లో పడేది మనం మాత్రమే కాదు.. మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, ఇతరులు కూడా! మరోసారి చెబుతున్నా.. యుక్తవయసులో ఉన్న ఆరోగ్యవంతులు, రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వారు వైరస్ బారిన పడరు అన్న ధీమా, అలక్ష్యం వద్దు.. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా తగిన జాగ్రత్తలు పాటించండి.. అత్యవసరం కాకపోతే బయటికి వెళ్లకండి.. ఒకవేళ కరోనా బారిన పడినా ధైర్యంగా ఉండండి.. బాధితుల పట్ల వివక్ష చూపకుండా నలుగురికీ మీకు చేతనైనంత సహాయం చేయండి..!