కుటుంబాన్ని పోషించడం, ఇంటిని చక్కబెట్టడం, పిల్లల్ని పెంచడం.. మొదలైన విషయాల్లో భార్యభర్తల బాధ్యత సమానంగా ఉంటుంది. ఒకవేళ భర్త సంపాదించడం చేతకాని అసమర్థుడైతే ఆ బాధ్యతలను పూర్తిగా భార్యే స్వీకరిస్తుంది. కానీ, తను సంపాదించకపోగా భార్య సంపాదనను కూడా తన స్వార్థం కోసం వాడుకొనే భర్త ఉంటే.. ఇక ఆ ఇల్లాలు, పిల్లలు అనుభవించే వేదన మాటల్లో చెప్పలేం..! అలాంటి నరకాన్ని తన తల్లి కూడా అనుభవించిందని చెబుతోంది ఓ యువతి. అయినా వాటికి వెరవకుండా ఎన్నో కష్టాలకోర్చి ప్రస్తుతం సొంత గుర్తింపు సంపాదించుకున్న అమ్మే తనకు అన్ని విధాలా స్ఫూర్తి ప్రదాత అంటూ.. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా తన హృదయరాగం మనందరితో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.
హాయ్.. నా పేరు సరళ. మాది వరంగల్ దగ్గర చిన్న పల్లెటూరు. ఇంటిని మించిన సురక్షితమైన చోటు మరొకటి ఉండదంటారు. కానీ, నా విషయంలో అది నిజం కాదు..! నా తండ్రి ఒక తాగుబోతు. ఆయనకు ఉద్యోగం చేయడం, సంపాదించడం చేతకాదు. అమ్మ కుటుంబాన్ని నడిపేందుకు మిఠాయి బాక్సులు డిజైన్ చేసేది. కానీ, నాన్న అమ్మను ఒక బానిసలా చూసేవాడు. మందు కోసం డబ్బు ఇవ్వమని అమ్మను ప్రతిరోజూ వేధించేవాడు. బెదిరించి, భయపెట్టి అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బును లాక్కొని తాగడానికి ఖర్చు చేసేవాడు. ఇలా అమ్మ జీవితం నరకంగా గడుస్తోన్న సమయంలోనే నేను అమ్మ కడుపులో పడ్డానట. డెలివరీ సమయంలో కూడా అమ్మకు తోడుగా ఎవరూ లేకపోవడంతో తను ట్యాక్సీలో ఒంటరిగానే ఆస్పత్రికి వెళ్లిందట. అయితే అన్ని కష్టాలనుభవిస్తోన్న అమ్మకు నేను పుట్టగానే.. మహాలక్ష్మి పుట్టిందంటూ సంబరపడిపోయిందట.

నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు.. ఒకసారి నాన్న అమ్మ ముఖంపై దిండు పెట్టి గట్టిగా నొక్కడం చూశాను. ఇక నేను ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తమ్ముడిని బాల్కనీలో తలకిందులుగా వేలాడదీసి తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాడిని చంపేస్తా అని బెదిరించాడు. అయితే ఇవన్నీ తాగి తందనాలాడడానికే! దాంతో అమ్మ భయపడిపోయి తన పర్స్ ఇచ్చేసేది. ఇలా ఎన్నో సార్లు నాన్న అమ్మను వేధించడం చూశా. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో అని క్షణక్షణం భయంభయంగా బతికేవాళ్లం. ‘నేను ఈ బతుకు బతకలేను. నాకు చనిపోవాలని ఉన్నా.. మీరేమైపోతారోనన్న భయంతోనే ఈ బతుకును ఇలా ఈడ్చుకొస్తున్నా..’ అంటూ అమ్మ ఎన్నోసార్లు నాతో చెప్పడం నాకు గుర్తుంది. అలా తన బాధను పంటిబిగువునే భరిస్తూ పని చేసేది అమ్మ.

అలా అమ్మ మాకోసం కష్టపడుతూ.. నాన్నను రీహ్యాబిలిటేషన్ సెంటర్లో చేర్చింది. అయినా ఆయన మారలేదు. ఒకరోజు నాన్న తాగిన మైకంలో అమ్మ ముఖంపై కప్పు విసిరాడు. అప్పటిదాకా ఓర్పుతో, సహనంతో అన్నీ భరించిన అమ్మ.. విసిగిపోయింది. ఇక జన్మలో ఆయన ముఖం చూడనంటూ మమ్మల్ని తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. అలా నేను, అమ్మ, తమ్ముడు హైదరాబాద్ చేరుకున్నాం. తాను గతంలో దాచిన డబ్బుతో ఇక్కడే ఓ గది అద్దెకు తీసుకుంది. అక్కడికి దగ్గర్లోని ఓ మిఠాయిల షాపులో పనికి చేరింది. ఈ క్రమంలోనే మా స్కూల్ ఫీజు కట్టడం కోసం అమ్మ గంటల తరబడి తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఓవర్ టైం పని చేసేది. మా ఆకలి తీర్చేందుకు తను పస్తులుండేది. చాలా సందర్భాల్లో అమ్మ ఏడుస్తూ కనిపించేది. మమ్మల్ని గమనించి కన్నీళ్లు తుడుచుకొని.. ‘ఈరోజు స్కూల్ కబుర్లేంటి..?’ అంటూ నవ్వుతూ పలకరించేది. అలా అమ్మ లోలోపలే కుమిలిపోవడం చూసి తట్టుకోలేకపోయేదాన్ని.

ఇలా రాత్రనక, పగలనక మాకోసం అమ్మ పడిన శ్రమకు కొన్నేళ్ల తర్వాత ఫలితం దక్కింది. అప్పటిదాకా మా అవసరాలు తీరిన తర్వాత జాగ్రత్తగా పొదుపు చేసిన డబ్బుతో మేమే స్వయంగా ఓ స్వీట్‌షాప్ పెట్టుకున్నాం.. గిరాకీ కూడా బాగానే ఉండేది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు స్వీట్స్ కావాలంటూ ఆర్డర్స్ కూడా వచ్చేవి. దాంతో మా బిజినెస్ క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. 15 మంది వర్కర్లతో మా బిజినెస్‌ను నడిపించే స్థాయికి ఎదిగింది అమ్మ. కష్టాలే మనిషికి ఎదిగే శక్తినిస్తాయి అంటుంటారు.. అమ్మను చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. ఎన్నెన్నో కష్టాలకోర్చిన ఆమె.. ప్రస్తుతం తనకంటూ ఓ సొంత గుర్తింపు సంపాదించుకుంది. అందుకే అమ్మే నాకు స్ఫూర్తి ప్రదాత. కేవలం చదువు విషయంలోనే కాదు.. జీవితంలో ఎదిగే క్రమంలో అన్నింట్లోనూ ఆమెనే ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నా.

ప్రస్తుతం మేము చాలా ఆనందంగా ఉన్నాం..! మాకంటూ ఓ చిన్న ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. ‘మా ఇల్లు’ అని చెప్పుకునేలా ఓ సురక్షితమైన చోటు ఇప్పుడు మాకుంది. ఇవన్నీ మా అమ్మ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలాలు. జీవితం మా అమ్మను ఎన్నో రకాలుగా పరీక్షించింది, కష్టపెట్టింది.. కానీ, అమ్మ మాత్రం భయపడకుండా వాటితో ధైర్యంగా పోరాడింది. మన శక్తిసామర్థ్యాలపై మనకు నమ్మకముంటే జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చు అని చెప్పడానికి అమ్మే ఓ ఉదాహరణ. అందుకే నేను కూడా అమ్మ లాగే శక్తిమంతమైన మహిళగా మారాలని ఆశిస్తున్నాను. అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!
ఇట్లు,
సరళ.
గమనిక: మాతృ దినోత్సవాన్ని మీరెలా జరుపుకొన్నారో ఫొటోలు తీసి contactus@vasundhara.net మెయిల్ ఐడీకి పంపండి. అందులో బాగున్న ఫొటోలని వసుంధర.నెట్లో ప్రచురిస్తాం.