మనసుంటే మార్గం ఉంటుందంటారు. మరి సరిదిద్దుకోలేని తప్పు చేసినప్పుడు కూడా ఆ మనసు మరో మార్గాన్ని చూపిస్తుందా ?బంధాల పంజరంలో బందీ అయిపోయిన ఓ వనిత ఈ ప్రశ్నకు బదులు అడుగుతూ సమాధానం కోసం దీనంగా ఎదురుచూస్తోంది. భర్తతో జీవితాంతం కలిసుంటానని ఏడడుగులు వేసిన ఆమె ఆరు నెలలు తిరగకుండానే అతడికి విడాకులిచ్చింది. జీవితమనే సుడిగుండంలో అయోమయం అయిపోయిన ఆమెకు విధి మరో భర్తను ప్రసాదించింది. అయితే అందుకు ప్రతిగా ఆమెకు అవసరాన్నే మిగిల్చి ప్రేమను తీసేసుకుంది. ప్రేమ లేని జీవితం ఆత్మ లేని దేహం వంటిదని భావించిన ఆమె ఇప్పుడు ఆ ప్రేమను పొందేందుకు తిరిగి మొదటి భర్త వద్దకు వెళ్లాలనుకుంటోంది. మరి అతను ఒప్పుకుంటాడా ? అందుకు సమాజం ఏమంటుంది ? ఈ విషయాన్ని తన రెండో భర్తకు ఎలా తెలపాలి ? అని సతమతమవుతోంది శైలజ. ఆమె హృదయరాగం ఏంటో ఒకసారి విని మీ సలహా అందివ్వమని కోరుతోంది.

వసుంధర పాఠకులకు నమస్తే. నా పేరు శైలజ. మా అమ్మానాన్నకు నేనొక్కదాన్నే సంతానం కావడం వల్ల చిన్నతనం నుంచి కష్టమనేది తెలియకుండా పెరిగాను. శ్రమ లేని జీవితం స్వర్గంతో సమానమనుకుంటారు చాలామంది. అయితే అంతకుమించిన నరకం మరొకటి లేదని నాకు ఈ మధ్యే తెలిసింది. అడగకుండా అన్నం పెట్టే అమ్మ, అడగ్గానే అన్నీ కొనిచ్చే నాన్న ఉండడంతో నాకేం కావాలో నాకే తెలిసేది కాదు. నా పెళ్లయ్యే వరకు కూడా అమ్మ గోరుముద్దలు తినిపించడమే కానీ నా చేతులతో నేను అన్నం తిన్న సందర్భాలు చాలా తక్కువ. ఈ స్కూల్ అయితేనే బెస్ట్, ఆ కాలేజే టాప్ అని నాన్న చెబితే తప్ప నాకు నేనుగా ఫలానా స్కూల్, కాలేజ్ అయితే బావుంటుందని కూడా నిర్ణయించుకోలేదు. చదువు కూడా అమ్మానాన్నల కోసమే అన్నట్లు చదివా. చివరికి పెళ్లి కూడా వారు చెప్పిన అజయ్‌నే చేసుకున్నాను. ఏ స్త్రీకైనా పెళ్లంటే ఎన్నో ఆశలు, ఊహలు ఉంటాయి. బహుశా ఈ లోకంలో అటువంటి ఫీలింగ్స్ ఏవీ లేకుండా పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేనేనేమో ! అయితే అప్పటి వరకు పెళ్లంటే నాకు మాత్రమే సంబంధించిన విషయం అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది... అది ఇద్దరి జీవితాలకు సంబంధించినదని.. రెండు కుటుంబాల కలయిక అని !

నేను చిన్నతనం నుంచి ఎలా పెరిగానో పెళ్లైన తర్వాత అత్తమామలతో, భర్తతో అలానే మసలుకొన్నాను. నాలో ఏ తేడా లేదు కానీ నా ఎదురుగా ఉన్నవారిలోనే తేడా కనిపించింది. నా తల్లిదండ్రులు చూసుకున్నంత బాగా అత్తమామలు నన్ను అర్థం చేసుకోలేదనిపించింది. అత్తవారింటికి చేరిన తర్వాత గానీ నాకు ఆకలంటే ఏంటో తెలియలేదు. స్వయంగా భోజనం కలుపుకొని తిన్నప్పుడల్లా అమ్మ గోరుముద్దలే గుర్తుకొచ్చేవి. నా తల్లిదండ్రులు నన్ను గారాబంగా పెంచి తప్పు చేశారో లేక నేనే అలా స్తబ్దుగా పెరిగానో నాకైతే అర్థం కావడం లేదు... కానీ అత్తమామలకు నా పద్ధతి నచ్చలేదు. నాకూ వారు నచ్చలేదు. దీంతో అజయ్‌తో చెప్పి వేరు కాపురం పెట్టించాను. పెళ్లై నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే వేరు కాపురం పెట్టించిందని అత్తమామలు, బంధువుల నుంచి తరచూ సూటిపోటి మాటలు వినిపిస్తుండేవి. ఈ విషయంలో నా తల్లిదండ్రులు కూడా నన్నే సర్దుకుపోవాలన్నారు తప్ప నన్ను సమర్థించలేదు. వారలా ఎందుకన్నారో నాకిప్పుడు తెలుస్తోంది.

పుట్టింటిలో సుఖం మాత్రమే తెలుసుకున్న నేను మెట్టినింటిలో కష్టాన్ని పరిచయం చేసుకున్నాను. క్రమక్రమంగా సుఖం నా నుంచి దూరంగా వెళ్లిపోయి కష్టం మాత్రమే నాకు మిగిలింది. ఇంట్లో కూరగాయలు తరగడం నుంచి ప్రతిదీ కష్టంగా అనిపించేది. పైపెచ్చు ఆఫీసు నుంచి వచ్చీ రాగానే నా భర్త పడే చిరాకుని తట్టుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి ఒక్క మాట పడకుండా పెరిగిన నేను ఆయనతో చాలా మాటలు పడాల్సి వచ్చింది. నేను ఆయన్ని పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మానాన్నల మీద గౌరవం ఉందే తప్ప ఆయన మీద ఇష్టం కానీ, ప్రేమ గానీ లేదు. ఓ రోజు ఆయన ఆఫీసు కొలీగ్స్ ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత ఆయన చేసిన గొడవ అంతాఇంతా కాదు. అందుకే ఆయనతో జీవించడం ఇక నా వల్ల కాదు అని చెప్పేసి పుట్టింటికి వచ్చేశాను. అమ్మానాన్న ఎంత బతిమాలినా విడాకులు కావాలని పట్టుబట్టాను. నా భర్త కూడా నాకు నచ్చజెప్పాలని చూసినా నాలోని అహం ఆ మాటలను విననివ్వలేదు. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు అర్థమవుతోంది.

ఆరు నెలల పాటు విడాకులు ఇవ్వనంటే ఇవ్వనని భీష్మించుకు కూర్చున్న నా భర్త, ఇక జీవితంలో ఆయన మొహం చూడదల్చుకోలేదని నేను కచ్చితంగా చెప్పడంతో విడాకులు ఇచ్చేశారు. అయితే ఆడపిల్ల పెళ్లికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా పుట్టింటికి భారమే అని నాకు తర్వాత తెలిసింది. పుట్టినప్పుడు అదృష్ట లక్ష్మి అనిపించుకునే ఆమె పెళ్లైన తర్వాత కూడా పుట్టింట్లో ఉండాల్సి వస్తే దురదృష్ట లక్ష్మి అయిపోతుంది. అందుకే ఇలా ఇంటికి భారంగా ఉండలేక చేసిన తప్పే మళ్లీ చేయాల్సి వచ్చింది. తోడు కోసమని నేను, తన పిల్లల ఆలనాపాలనా చూసేందుకని నా రెండో భర్త కలిసి సుడిగుండమనే జీవితంలోకి అడుగుపెట్టాం. మళ్లీ అదే తప్పు... నాకేం కావాలో నాకే తెలియని అయోమయం.. ఒకసారి చేసిన తప్పు మరోసారి చేస్తే దాన్ని సరిదిద్దుకోవడం అసాధ్యం అని నాకు తర్వాత తెలిసింది.

నా రెండో భర్త ఇంట్లో నేను ఏదో ఉన్నానంటే ఉన్నాను అంతే ! అత్తమామల ప్రవర్తన అయితే నా మీద జాలి చూపించినట్లు ఉంటోంది. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల్ని ఏదంటే అది అడిగి సాధించుకున్న నాకు ఇక్కడ ఏదైనా అడగాలంటేనే మనసు రావడం లేదు. నా రెండో భర్త పిల్లల్ని అయితే బాగానే చూడగలుగుతున్నాను కానీ ఆయన పక్కన నిల్చోవడానికి కూడా మనసు రావడం లేదు. అలా రెండు నెలలు గడిచాయి. నరకం అంటే ఎక్కడో లేదనిపించింది. ఈ ఇంట్లో ఉండడం అంటే... నిప్పుల మీద నిల్చున్నట్లుగానే అనిపిస్తోంది. ఇలా ఓ ఏకాంత సమయంలో ‘అసలు నేనేంటి ?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడనిపించింది.... ఈ ప్రశ్న నేను చదువుకుంటున్న రోజుల్లో వేసుకుని ఉండాల్సిందని. ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను చేసిన తప్పులన్నీ ఒక్కొక్కొటిగా కళ్ల ముందు దొర్లాయి.

అసలు నన్ను వదులుకోవడానికి ఇష్టపడని అజయ్‌ని నేనెందుకు వద్దనుకున్నాను ? అతను చేసిన తప్పేంటి ? పెళ్లప్పుడు అతని అమ్మానాన్న కట్నం కావాలంటే నా ఇష్ట ప్రకారం అతను కట్నం వద్దనుకున్నాడు. ఓ సంవత్సరం పాటు పిల్లలు వద్దంటే తనూ వద్దనుకున్నాడు. ఇంటి నుంచి వేరుపడదామంటే ఒప్పుకున్నాడు. ఒక్క విడాకులు తీసుకునే విషయంలో తప్ప నా మాటను అజయ్ ఏనాడూ కాదనలేదు. ఆఖరికి విడాకులు తీసుకునే ముందు కూడా నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పటికీ మరొకరిని వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉన్నాడు. మరెందుకు నాకతని మీద ద్వేషం ? నాలోని అహం ఈ పరిస్థితికి దారితీసిందా ? ఒక అడుగు వెనక్కి వేసి చిన్న చిన్న గొడవలను సర్దుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ! అందుకే అమ్మానాన్న రాజీపడమన్నారా ? అహంతో ఒక అడుగు ముందుకేసి నా పంతాన్ని నెగ్గించుకున్నాను కానీ జీవితంలో ఓడిపోయాను. ఇప్పుడు మళ్లీ ఓ అవకాశం లభిస్తుందా ? మళ్లీ నేను అజయ్‌ని చేరుకోవాలనుకుంటున్నాను ! అది వీలుపడుతుందా ? ఈ సమాజం ఏమంటుంది ? నా రెండో భర్త, నా తల్లిదండ్రులు నా ఈ నిర్ణయాన్ని సానుకూలంగా స్వాగతిస్తారా ? ఇప్పుడు నేనేం చేయాలి ? మంచి సలహా ఇచ్చి నా జీవితాన్ని మళ్లీ నిలబెడతారని ఆశిస్తున్నాను.....
ఇట్లు,
శైలజ !