Photos: Instagram
‘మన లైఫ్‌లో ముఖ్యమైన వాళ్లు మనల్ని వదిలి వెళ్లిపోతే మనమూ పోనక్కర్లేదు. ఏదో ఒకరోజు తప్పకుండా మన లైఫ్ మనకు నచ్చినట్టు మారుతుంది..’
‘రాజారాణి’ సినిమాలో హీరోయిన్ నజ్రియా చెప్పిన ఈ మాటలు యువతను ముఖ్యంగా ప్రేమికులను బాగా ఆలోచింపజేశాయి. మనసుకు దగ్గరైన వారు దూరమైతే తట్టుకోవడం కష్టమే... కానీ భవిష్యత్‌లో అంతకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించి, సంతోషం పంచే మనిషి తప్పకుండా మనకు తారసపడతారన్నదే ఈ మాటల వెనకనున్న అసలు సారాంశం.
ఈ క్రమంలో ప్రస్తుతం తాను కూడా అలాంటి ప్రేమనే పొందుతున్నానంటున్నారు ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్ బర్గ్ . ఈ ప్రేమ తన వైవాహిక జీవితం మిగిల్చిన విషాదాన్ని మర్చిపోయేలా చేస్తోందంటున్నారు. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్త టామ్ బెర్నథాల్కు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు షెరిల్.
ప్రతిభకు పర్యాయ పదంలా నిలిచే షెరిల్ శాండ్బర్గ్ది టెక్నాలజీ రంగంలో అందెవేసిన చేయి. వృత్తిగతంగా ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఆమె ప్రస్తుతం ఫేస్బుక్ సీవోవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తర్వాత ఆమెదే అక్కడ నెంబర్ టూ పొజిషన్. అంతకుముందు గూగుల్‌తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో వివిధ హోదాల్లో ఆమె పనిచేశారు. ఫేస్‌బుక్‌తో పాటు పలు కంపెనీల్లో స్టాక్ హోల్డర్‌గా ఉన్న షెరిల్ 2012లో టైమ్స్ ప్రకటించిన ‘ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వంద మంది మహిళల’ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు.
ఇలా టెక్నాలజీ రంగంలో తిరుగులేని మహిళగా, బిలియనీర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు వైవాహిక జీవితంలో మాత్రం చేదు అనుభవాలే ఎదురయ్యాయి. 1993లో మొదటిసారిగా బ్రెయిన్ క్రాఫ్‌తో పెళ్లిపీటలెక్కిన ఆమె మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నారు. అనంతరం 2004లో ‘యాహూ’ సంస్థ ప్రతినిధి డేవ్ గోల్డ్బర్గ్తో కలిసి మరోసారి ఏడడుగులు నడిచారు. వారిద్దరి దాంపత్యానికి ప్రతీకగా ఒక కుమారుడు, కూతురు పుట్టారు. ఇక అంతా బాగుంటుందనుకున్న సమయంలో కాలం షెరిన్‌ను మరోసారి చిన్నచూపు చూసింది. 2015 లో వెకేషన్ కోసం మెక్సికో వెళ్లినప్పుడు కరోనరీ అరిథ్మియా (గుండె కొట్టుకునే వేగం క్రమం తప్పడం) కారణంగా ట్రెడ్మిల్ మీద పడి డేవ్ మృత్యువాత పడ్డాడు.
ఆ చేదు అనుభవాలను మర్చిపోతూ!
ప్రస్తుతం ఓ కన్సల్టింగ్ కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్న టామ్‌కు కూడా ఇంతకు ముందే వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మొదటిసారిగా పరిచయమయ్యారు టామ్-షెరిల్. దాంపత్య జీవితానికి సంబంధించి ఇద్దరికీ చేదు అనుభవాలు ఎదురుకావడంతో ఆ పరిచయం వారికో కొత్త అనుభూతినిచ్చింది. ఒకరి మనసులోకి మరొకరు చొచ్చుకుపోయేలా చేసింది. ఇక పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారీ లవ్ బర్డ్స్.
టామ్ పరిచయంతో నా ప్రపంచమే మారిపోయింది!
టామ్‌తో ఎంగేజ్మెంట్ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా అతనితో తనకున్న అనుబంధానికి అక్షర రూపమిచ్చింది షెరిల్. కాబోయే భర్తతో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘2015లో నా భర్త డేవ్ చనిపోయాడు. దీంతో నా జీవితం తలకిందులైనట్లు అనిపించింది. డేవ్ నన్ను ఎంతో ప్రేమించాడు. నాకు అంతలా ప్రేమను పంచిన వ్యక్తిని మళ్లీ కలుస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ డేవ్ సోదరుడు రాబ్ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. అందులో భాగంగానే తన స్నేహితుడు టామ్ బెర్నథాల్ను నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది.’
కొత్త మార్గంలో ముందుకు సాగుతున్నాం!
‘మనసుకు నచ్చిన వారు దూరమైతే తట్టుకోవడం కష్టమే.. కానీ వారి కన్నా అధికంగా ప్రేమించే వారు తారసపడితే మాత్రం వారితో కొత్త జీవితం ప్రారంభించడం ఉత్తమం. వారి ప్రేమ మనం కోల్పోయిన సంతోషాలను తిరిగి మనకు అందిస్తుంది. నా విషయంలో ఇదే జరిగింది. డేవ్‌ని కోల్పోయినప్పుడు టామ్ నన్ను ఓదార్చాడు. ధైర్యం చెప్పాడు. అతని ప్రేమ నాలో ఉన్న ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. రెండు కుటుంబాలు కూడా మా ప్రేమను ఆశీర్వదించాయి. దీంతో పూర్తి ఆశావహ దృక్పథంతో, కృతజ్ఞతలతో నిండిన కొత్త మార్గంలో ముందుకు సాగుతున్నాం. జీవితంలో ప్రేమించిన వారిని కోల్పోయి నిరాశలో మునిగిపోయిన వారిలో ఈ లేఖ సానుకూల దృక్పథం నింపుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు షెరిల్.
అందుకే నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను!
ఈ క్రమంలో తనను, తన పిల్లలను టామ్ ఎలా చూసుకుంటున్నాడో ఓ బహిరంగ లేఖ ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు శాండ్ బర్గ్.
‘మన నిశ్చితార్థం జరిగి ఏడాది పూర్తియింది. నా జీవితంలో అత్యంత వేగంగా, ఆనందంగా గడిచిపోయిన సంవత్సరాల్లో ఇది ఒకటి. ఈ సమయంలో నీతో, మన పిల్లలతో గడిపిన ఆనంద క్షణాలను నేనెప్పటికీ మర్చిపోలేను. నీతో నా జీవితం ఇంత సంతోషాన్నిస్తుందని అసలు ఊహించలేదు. జీవిత భాగస్వామిగానే కాదు.. మంచి తండ్రిగా నా పిల్లల జీవితంలో పాలుపంచుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలు.. నిజం చెప్పాలంటే నువ్వు రాక ముందు నేను చాలా అలసిపోయాను. కానీ నిన్ను కలిశాక మనం ఓ కొత్త మార్గాన్ని కనుగొన్నాం. ఇక డేవ్‌ను కోల్పోయిన బాధ నా హృదయంలో ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ నువ్వు నా ఆవేదనను అర్థం చేసుకుంటున్నావు. నన్ను ఎంతగానో గౌరవిస్తున్నావు. ఈ విషయాలే నిన్ను మరింతగా ప్రేమించేలా చేస్తున్నాయి’ అంటూ కాబోయే భర్తపై ప్రేమను కురిపించారు షెరిల్.