నమస్తే మేడమ్.. నాకు పెళ్లై సంవత్సరం దాటింది. మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆయన వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. దాంతో మా ఆయన వాళ్ల ఇంటికి వచ్చేశాం. కొన్ని రోజులకు మా ఆయన వాళ్ల కుటుంబ సభ్యుల వల్ల ఇద్దరికీ గొడవలు వచ్చాయి. దాంతో నేను మా అమ్మ వాళ్ల దగ్గర ఉంటున్నాను. మూడు నెలల నుంచి నేను, ఆయన మాట్లాడుకోవడం లేదు. ఆయన తరఫు వాళ్లు ఈ విషయాన్ని అలుసుగా తీసుకుని మా ఇద్దరి మధ్య మనస్పర్థలు సృష్టిస్తున్నారు. ఆయన జీతాన్ని కూడా వాళ్లే వాడుకుంటున్నారు. ఆయన కూడా వాళ్లు ఏం చెబితే అదే వినడం, చేయడం చేస్తున్నాడు. వాళ్లు నా మీద లేనిపోనివి చెప్తుంటే అది విని నా మీద సీరియస్ అవుతున్నాడు. ఈ మధ్యన మేముంటున్న ఇంటిని ఖాళీ చేసి వచ్చేశారు. కనీసం నా అభిప్రాయాన్ని కానీ, మా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కానీ తీసుకోలేదు. నా భర్త ఎప్పుడూ వాళ్ల ఇంట్లోనే ఉండాలంటారు. మా అమ్మ వాళ్ల దగ్గరకు రావడం ఆయనకు నచ్చదు. ఒకవేళ వచ్చినా ఒకటి రెండు రోజులే ఉండాలంటారు. నేను ఎంత పని చేసినా చేయడం లేదని మా అత్తమామలు నా మీద తనకి ఏదో ఒకటి చెప్తునే ఉంటారు. నా తోటి కోడలు ఏం చేయకపోయినా ఆమెను ఏమీ అనరు. నన్ను అస్సలు పట్టించుకోరు. మాటలతో, చేతలతో వేధిస్తుంటారు. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. - ఓ సోదరి
జ. మూడునెలల నుంచి మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని, పుట్టింటికి వెళ్లిపోయానని చెబుతున్నారు. ఇలా మాట్లాడుకోకుండా ఉండడం వల్ల అతని వైపు వాళ్లు అతన్ని, మీ వైపు వాళ్లు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారని, మీ ఇద్దరి మధ్య మానసిక దూరాన్ని పెంచుకుంటున్నారనే విషయాన్ని అర్థం చేసుకోండి.
మీ భర్తతో కలిసి వాళ్లింటికి వెళ్లిన తర్వాత అతని తరఫు వాళ్ల వల్ల మీకు మనస్పర్థలు వచ్చాయని, మీకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేశారని, మీ మధ్య సమస్యలు సృష్టిస్తున్నారని చెబుతున్నారు. మీరిద్దరూ కూర్చుని వివరంగా మాట్లాడుకోకపోవడం వల్ల కేవలం భౌతిక దూరం మాత్రమే కాకుండా మానసికంగా కూడా దూరం పెరుగుతోందని అర్థం చేసుకోండి.
ఇద్దరూ చెరొక చోట ఉండి, ఎవరివైపు వాళ్లకి వాళ్లు ప్రాధాన్యమిస్తూ.. అవతలి వారు పట్టించుకోవడం లేదనుకుంటే మీరు దగ్గరయ్యే అవకాశాలు ఏవిధంగా మెరుగవుతాయో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరిద్దరూ దూరంగా ఉండడం, ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం వల్ల ఇంకొక వ్యక్తి ద్వారా తెలిసే విషయాల పైన ఆధారపడుతున్నారు. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి (ఎంత ముఖ్యమైన వారు కానీ) ప్రవేశించి, వారి మాటలు మీరు కానీ, అతను కానీ వినడం మొదలు పెట్టారో అప్పుడే మీ ఇద్దరి మధ్య మానసిక దూరానికి మొదటి అడుగు పడుతుంది. అలా కాకుండా మీరిద్దరూ ప్రశాంతమైన వాతావరణంలో మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్యను పరిష్కరించగలుగుతారేమో ఆలోచించి చూడండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్