నమస్తే మేడమ్.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది.
మా ఆయన పిసినారి. నేను ఏది కావాలని అడిగినా కొనరు. ఒక సినిమాకు తీసుకెళ్లడు, ఇంట్లో సామన్లు కొనడు, సరుకులు కూడా కొద్ది కొద్దిగా తెస్తారు, పనిమనిషిని పెట్టరు... ఇలా నా అవసరాలను ఏదీ పట్టించుకోరు. ఇప్పటివరకు నాకు కావాల్సినవన్నీ మా నాన్న, తమ్ముడు కొంటున్నారు. ఇంట్లో డబ్బులు కూడా పెట్టరు. అలాగని ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. మా మామగారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు ఒంటరిగా పంపరు. ఎవరో ఒకరు తోడుంటేనే వెళ్లమంటారు. సిటీ బస్ ఎక్కద్దంటారు. ఆటో ఎక్కద్దంటారు. ఇల్లు కూడా బయట ఎవరూ కనిపించకుండా ఉండేలా ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. పెళ్లికి ముందు మా నాన్న ‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’ అని అడిగితే ‘ఉంటాను’ అన్నారు. కానీ నెలకు 15 రోజులు ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఊరు తీసుకొని పోతున్నారు. నేను రాననకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆయనకు వర్క్ ఫ్రం హోమ్ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ల నాన్న, అన్నయ్యతో తిరుగుతారు.

పెళ్లై కాపురానికి తీసుకెళ్లినప్పుడు నన్ను వాళ్ల అమ్మగారింట్లో వదిలేసి ఆడిట్ పేరు చెప్పి 20 రోజులు వెళ్లిపోయారు. నన్ను హైదరాబాద్ పంపమంటే ఒంటరిగా పంపమని ఎవరో ఒకరు తోడు రావాలని చాలా చిరాకు పెట్టారు. చివరకు మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లే దాకా పంపలేదు. ఆయన నా అవసరాలు ఏదీ పట్టించుకోవడం లేదు. దాంతో నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. మెహందీ డిజైన్ బాగా వేస్తాను. మెహందీ ఆర్టిస్ట్‌గా చేయాలని ఉంది. కానీ ఆయన ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. వాళ్లకు ఎదురెళ్లి నెగ్గలేను. ఏం చేయాలి? ఆయనతో గొడవపడి సంబంధం తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి
జ. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేసేట్టుగా చూసుకుంటున్నారు. మీ భర్తకి, వారి తరపు వాళ్లకు మీరు బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటున్నారు. కాబట్టి మీరు కూడా అలాంటి అవకాశాలు ఏవైనా దొరుకుతాయేమో ప్రయత్నించి చూడండి. ఇకపోతే అతను కొద్దికొద్దిగానే వస్తువులు తీసుకొస్తున్నాడని అంటున్నారు. అయితే అది అతని వ్యవహార శైలి కావచ్చు. లేదా అతని సంపాదనకు, అతనున్న పరిస్థితులకు అనువుగా అలా చేస్తుండచ్చు. అలాగని ఎప్పటికీ ఒకేవిధంగా ఉండాలన్న నియమం కూడా ఉండకపోవచ్చు కదా. కాబట్టి, మీవైపు నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. అలాగే మిమ్మల్ని కొద్దిరోజుల పాటు అక్కడ, కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండేట్టుగా ఎందుకు చేస్తున్నాడనేది కూడా ఆలోచించి చూడండి. అతనికి ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రం హోమ్) చేసే అవకాశం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు నెలకు పదిహేను రోజుల పాటు ఉద్యోగానికి దూరంగా ఉండడం వల్ల కలిగే సమస్యలేంటో అతను ఆలోచించే ఉండచ్చు కదా.. అయినా సరే అతను అక్కడకు తీసుకెళ్తున్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటి? అనేది ఆలోచించి చూడండి.

మీ భర్త విషయంలో సంయమనం పాటిస్తూనే మీ ఉనికిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. దీనికి మీ చదువుని ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించండి. మీ భర్త చదువు, మీ చదువుకి అనుసంధానంగా ఏదైనా సొంతంగా చేయచ్చేమో కూడా ఆలోచించి చూడండి. అలాగే మీ పెళ్లై మూడు నెలలే అయింది కాబట్టి మీ వారితో మానసికంగా దృఢమైన అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అతని ఆలోచనలపై ఒక స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ మామగారు, బావగార్ల వ్యవహార శైలిని గమనించి మీకు ఏ రకమైన ఆర్థిక స్వావలంబనకు వెసులుబాటు ఉంటుందో ఆలోచించి చూడండి.
ఏది ఏమైనా మొదట స్వయంశక్తితో మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రయత్నించండి. అటు తర్వాత మీ భర్తతో మాట్లాడి చూడండి. ఈ క్రమంలో ఇంకా అసంతృప్తి ఉంటే మీ పుట్టింటి వారితో చెప్పి.. వారు మీ అత్తమామలు, భర్తతోటి చర్చించే అవకాశం ఉంటుందేమో ప్రయత్నించండి. ఈ క్రమంలో- గతంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయకుండా సానుకూల ధోరణితో ప్రయత్నించండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్