టాలీవుడ్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ ఎవరంటే... చాలామంది వెంటనే ‘మహేశ్‌బాబు-నమ్రతా శిరోద్కర్’ అని చెప్పేస్తుంటారు. వారు చెప్పినట్లే వృత్తిగతంగా, వ్యక్తిగతంగానూ ఒకరికొకరు తోడుంటూ... జయాపజయాల్ని సమానంగా పంచుకుంటూ..అసలు సిసలైన దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలుస్తుందీ అందాల జంట. సరిగ్గా పదహారేళ్ల క్రితం ఇదే రోజు పెళ్లిపీటలెక్కిన ఈ బ్యూటిఫుల్ కపుల్ నేటికీ తమ ప్రేమ బంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారు. తమ ప్రేమానురాగాలతో దంపతులందరికీ ప్రేమ పాఠాలు నేర్పుతున్నారు. అందుకే ఈ జంటకు ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో మహేశ్-నమ్రతలు 16వ వివాహ వార్షికోత్సవాన్ని (ఫిబ్రవరి 10) జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల జంట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...
అలా మొదలైంది!
‘మహేశ్... ఆ పేరులోనే ఓ మత్తు ఉంది.. వైబ్రేషన్స్ ఉన్నాయి’ అని ఓ సినిమాలో చెప్పినట్లు నిజంగా మహేశ్ అమ్మాయిల కలల రాకుమారుడే. బాల నటుడిగా కెరీర్ ఆరంభించిన అతడు 1999లో ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అమ్మాయిల ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ‘యువరాజు’ చిత్రంతో ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఇక సరిగ్గా అదే సమయానికి బాలీవుడ్లో తన కెరీర్‌ను ప్రారంభించింది నమ్రత. ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ముందే మోడలింగ్‌లో మెరిసిన ఆమె మిస్ ఇండియా కిరీటం కూడా గెలుచుకుంది. 2000లో విడుదలైన ‘వంశీ’ చిత్రంలో కలిసి నటించారు మహేశ్, నమ్రత. ఆ సినిమా షూటింగ్‌లోనే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. అలా సుమారు ఐదేళ్ల పాటు ప్రేమబంధంలో ఉన్నప్పటికీ తమ ప్రేమ విషయాన్ని మాత్రం రహస్యంగానే ఉంచారు. ఇక తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ 2005 ఫిబ్రవరి 10న ఇరు కుటుంబ పెద్దల అనుమతితో పెళ్లి పీటలెక్కారు. ముంబయి వేదికగా వీరి వివాహం జరిగింది. ఇక్కడ విశేషమేంటంటే... మహేశ్ కంటే నమ్రత వయసులో నాలుగేళ్లు పెద్ద కావడం.
అందుకే నా కెరీర్‌ను వదిలేశాను!
మహేశ్‌తో పెళ్లికి ముందే సినిమాలు తగ్గించుకున్న నమ్రత వివాహమయ్యాక తన సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించింది. ‘సినిమాల ద్వారా డబ్బులు సంపాదించాలని నేనెప్పుడూ అనుకోలేదు. అగ్రకథానాయికగా నంబర్ వన్ స్థానంలో ఉండాలనే కోరిక నాకెప్పుడూ కలగలేదు. ఇక మహేశ్ పరిచయమయ్యాక నా ప్రాధమ్యాలు మరింత మారిపోయాయి. ఆయనతో జీవితం పంచుకోవాలనే నా కెరీర్‌ను సంతోషంగా వదిలేశాను. అదృష్టవశాత్తూ నా నిర్ణయానికి సంబంధించి విచారానికి, బాధకు గురైన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఇక మా సుదీర్ఘ ప్రేమ బంధానికి ప్రతీకలు గౌతమ్, సితార. వారు కూడా నటనను కెరీర్‌గా ఎంచుకోవాలని మేం చెప్పం. ఎందుకంటే ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న వృత్తి. ఒకవేళ నిజంగా నటనపై ఆసక్తి ఉంటే...దాన్ని స్వాగతిస్తాం. నాకు మాత్రం తల్లిగా నా బాధ్యతలే ముందు...ఆ తర్వాతే ఏదైనా.! ’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
ఆ సమయంలో ఇంట్లోనే ఉండిపోతాను!
సాధారణంగా మహేశ్ సినిమా వస్తోందంటే అభిమానులతో పాటు అందరూ ఎగిరి గంతేస్తారు. కానీ నమ్రత మాత్రం ఎంతో ఒత్తిడికి గురవుతుందట. ‘అందరి లాగే మా కుటుంబ సభ్యులు మహేశ్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ప్రివ్యూలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నేను మాత్రం ఇంట్లో కూర్చొని దేవుడిని ప్రార్థిస్తుంటాను. ఇది గత సినిమా కంటే బాగుంటుందా..లేదా అన్న ఆలోచనలు మెదులుతుంటాయి. నిజంగా ఇది చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. సంతోషంగా ఉండు, ఎక్కువ ఆలోచించవద్దని మహేశ్ చెబుతుంటాడు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు.. కదా!’ అంటుంది నమ్రత.
ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ!
తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నప్పటికీ హీరోగా తనని తాను నిరూపించుకుని టాలీవుడ్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు మహేశ్. మరోవైపు అతని సతీమణి నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.... తనదైన కార్యదక్షతతో, అందమైన మనసుతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మహేశ్ దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధితో పాటు అనాథ పిల్లల కోసం పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇద్దరూ తమ రంగాల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడమూ ఓ కారణమే. అంతేకాదు..ఇద్దరూ కలిసి గడిపిన క్షణాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ ప్రేమానురాగాల్ని చాటుకోవడంతో పాటు ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లోనే ఉంటారీ లవ్లీ కపుల్. అలా తమ అన్యోన్యమైన దాంపత్య బంధంతో భార్యాభర్తలందరికీ కపుల్ గోల్స్ నేర్పిస్తోందీ ముద్దుల జంట.
ఎప్పుడూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ పెళ్లి రోజు, పుట్టిన రోజు..వంటి ప్రత్యేక సందర్భాల్లో కలిసి సమయం గడుపుతుంటారు నమ్రత, మహేశ్. అంతేకాదు వీలు కుదిరినప్పుడల్లా తమ ఇద్దరు పిల్లలతో కలిసి విహారయాత్రలు, వెకేషన్లకు వెళుతుంటారు. ఇక గత నెలలో దుబాయిలో తన సతీమణి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన మహేశ్ ప్రస్తుతం అక్కడే సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. నమ్రత, గౌతమ్, సితార కూడా అక్కడే దుబాయ్ అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఈ 16 ఏళ్లు త్వరగా గడిచిపోయాయి!
తాజాగా తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు నమ్రత, మహేశ్. ఈ సందర్భంగా మహేశ్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన నమ్రత- ‘ఈ 16 ఏళ్లు త్వరగా గడిచిపోయాయి. అమితమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. పెళ్లి రోజు శుభాకాంక్షలు మహేశ్. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను’ అంటూ తన భర్తపై ఉన్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది.
16 ఏళ్ల ప్రేమకు శుభాకాంక్షలు!
ఇక మహేశ్ కూడా నమ్రతకు ప్రేమతో నుదుటిపై ముద్దు పెడుతున్న ఫొటోను పంచుకుంటూ ‘16 ఏళ్ల ప్రేమకు శుభాకాంక్షలు. మై లవ్... జీవితాంతం నీతో కలిసి ఉంటాను’ అంటూ భార్యపై ప్రేమ కురిపించాడు.
ఈ క్రమంలో శిల్పా శిరోద్కర్, మంజుల ఘట్టమనేని, సమంత అక్కినేని, అవికా గోర్, రవీనా టాండన్, భావనా పాండే, పింకీ రెడ్డి తదితర సెలబ్రిటీలు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు అభిమానులు, నెటిజన్లు కూడా వీరికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి మనం కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నమ్రత ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలపై ఓ లుక్కేద్దాం రండి.