హాయ్ మేడం. నా వయసు 22. చదువు పూర్త్తెంది. ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. నేను ఐదేళ్ల నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. మొన్నామధ్యే మా ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది. మా అమ్మానాన్నలకు కులం పట్టింపులు ఎక్కువ. మా ఇద్దరి కులాలు వేరు. మాది ఎక్కువ కులం, అబ్బాయిది తక్కువ కులం కావడంతో మా విషయం ఇంట్లో తెలియగానే వాళ్లు నన్ను ఏమీ అనకుండా.. నువ్వు చదువుకోవాలంటే ఆ అబ్బాయిని మర్చిపో అన్నారు. దాంతో నేను నా చదువు ఆగిపోతుందని సరే అని కాలేజీకి వెళ్లాను. మేమిద్దరం దూరంగా ఉండడానికి చాలా ప్రయత్నించాం.. కానీ అది మా వల్ల కావట్లేదు. అతను నాకు బాగా దగ్గరైపోయాడు. జీవితంలో స్థిరపడితేనైనా అమ్మానాన్నలు మా పెళ్లికి ఒప్పుకుంటారని మేం ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు ప్రేమను కొనసాగించాం.
నాకు మా అమ్మానాన్నంటే ప్రాణం.. అలాగని తననూ వదులుకోలేను. తనూ ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో స్థిరపడ్డాడు. మా ప్రేమ మా లక్ష్యాలకు అడ్డుకాకూడదని కష్టపడి చదువుకొని ఇప్పుడు స్థిరపడ్డాం. నన్ను తను చాలా బాగా చూసుకుంటాడు. మా ప్రేమను అబ్బాయి వాళ్లింట్లో ఒప్పుకున్నారు.. కానీ మా ఇంట్లో మాత్రం నాకు సంబంధాలు చూడడం మొదలు పెట్టారని ఈ మధ్యే తెలిసింది. ఏం చేయాలో నాకు తోచడం లేదు. నాకు జీవితంలో చాలా ఆశలు, ఆశయాలు ఉన్నాయి. నా జీవితంలో పెళ్లంటూ జరిగితే అది నేను ప్రేమించిన అబ్బాయితోనే జరగాలని కోరుకుంటున్నా.. తను కూడా అంతే..! ఇద్దరం పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు ఏం చేయాలో, మా పెద్దల్ని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. సలహా ఇవ్వండి. - ఓ సోదరి
జ: మీరు మీ పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రేమను కొనసాగించారని మీ ఉత్తరం స్పష్టం చేస్తోంది. అయితే ఈ ఐదేళ్ల నుంచి వాళ్లు కాదన్నా.. మీరు మీ ప్రేమను కొనసాగించామని చెప్పారు. వాళ్లకు ఇష్టం లేకపోయినా.. మీరు మీ ఇష్ట ప్రకారం, మీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారన్న గట్టి నమ్మకంతోనే మీ ప్రేమను కొనసాగించారు. అలాంటప్పుడు తీరా ఇప్పుడు పెళ్లి దగ్గరికొచ్చే సరికి మాత్రం పెద్దలకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటామని అనడంలో ఎంత వరకు వాస్తవికత ఉందో మీరే ఆలోచించుకోండి. మీ ప్రేమ విషయంలో మీకు అంత స్పష్టత ఉన్నప్పుడు, పెద్దల అంగీకారం లభించలేదు అన్న విషయం కూడా మీకు తెలిసినప్పుడు, ఇప్పుడు పెద్దల అంగీకారం కావాలని అనుకోవడం ఎంత వరకు సహేతుకం? అలా కాదు.. పెద్దల అంగీకారంతోనే మేం పెళ్లి చేసుకుంటాం అని కచ్చితంగా మీరు గట్టి పట్టుదలతో ఉన్నట్లయితే ఇద్దరూ కలిసి మీ పెద్దవాళ్లతో మాట్లాడి, వారిని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేయండి. కులాల మధ్య అంతరాలు, తారతమ్యాలు, సంస్కృతులు భిన్నంగా ఉంటాయన్న భయాలు.. ఇలాంటి రకరకాల కారణాలు వాళ్లకు ఉండి ఉండచ్చు. కానీ మీ ప్రేమ విషయంలో మీ ఇద్దరికీ కచ్చితమైనటువంటి నమ్మకముంటే మీరిద్దరూ కలిసి పెద్దలనొప్పించే ప్రయత్నం చేయండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్