ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే అందమైన బంధం..
పెళ్లి.. ఆ మధురమైన బంధాన్ని అధికారికం చేసే అద్భుతమైన వేడుక.
అలా తమ జీవితకాలపు ప్రేమబంధం ఇప్పుడు పెళ్లితో అధికారికమైందంటున్నాడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను తాజాగా పరిణయమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడీ కండల వీరుడు. ముంబయి అలీబాగ్‌లోని ఓ హోటల్లో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నహితుల మధ్య ఏడడుగులు నడిచారీ లవ్లీ కపుల్. వేడుక ఆద్యంతం మిక్స్ అండ్ మ్యాచ్‌గా, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా మెరిసిపోయిన ఈ అందాల జంట పెళ్లి ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..
చిన్ననాటి స్నేహితులైన వరుణ్ - నటాషాల మధ్య స్నేహబంధం వారు పెరిగి పెద్దయ్యే క్రమంలో ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇరువురి పెద్దల ఆశీర్వాదంతో తమ అనుబంధాన్ని పెళ్లి దాకా తీసుకొచ్చిందీ ముద్దుల జంట. అయితే వీరు మాత్రం తమ రిలేషన్‌షిప్‌ని చాలా రోజుల పాటు గోప్యంగా ఉంచారు. కానీ తమ మధ్య ఉన్న ప్రేమ బంధం గురించి వరుణ్ ఓ సందర్భంలో అందరితో పంచుకోవడంతో.. ఇక అప్పట్నుంచి అభిమానులంతా వీరి పెళ్లి గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా అందరి ఎదురుచూపులకు తాజాగా పెళ్లితో తెరపడినట్లయింది.
‘మిక్స్ అండ్ మ్యాచింగ్’ కపుల్!
తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన పెళ్లి బంధంగా మార్చుకుంటూ వరుణ్-నటాషాలు జనవరి 24న పెళ్లి పీటలెక్కారు. ముంబయి సమీపంలోని అలీబాగ్‌లోని ‘ది మాన్షన్ హౌస్’ హోటల్ వీరిద్దరి వివాహానికి వేదికైంది. ముందు నుంచీ తమ అనుబంధాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చిన ఈ లవ్లీ కపుల్.. తమ పెళ్లి వేడుకను కూడా అంతే రహస్యంగా జరుపుకున్నారు. కేవలం అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నహితులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు నడిచిందీ అందాల జంట. ప్రతి సందర్భంలోనూ మిక్స్ అండ్ మ్యాచింగ్ ఫ్యాషన్లతో మాయ చేసే వరుణ్-నటాషా తమ పెళ్లికి కూడా అలాంటి కాంబినేషన్నే ఎంచుకుంది. ఈ క్రమంలో నటాషా భారీగా సీక్విన్ వర్క్ చేసిన లైట్ గోల్డెన్ కలర్ లెహెంగా ధరించింది. దీనికి జతగా వి-నెక్ త్రీ-ఫోర్త్ స్లీవ్స్ బ్లౌజ్, షీర్ దుపట్టాతో తళుక్కున మెరిసింది. మెడలో డైమండ్ నెక్లెస్, స్మోకీ ఐ మేకప్, అధరాలకు పింక్ లిప్‌స్టిక్‌తో వన్నెలద్ది సింప్లీ సూపర్బ్ అనిపించుకుంది. ఇక వరుణ్ సీక్విన్ వర్క్ చేసిన ఐవరీ వైట్ షేర్వాణీలో హ్యాండ్సమ్లా దర్శనమిచ్చాడు. ఇలా వీరిద్దరూ ధరించిన ఈ వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్‌ను మనీష్ మల్హోత్రా రూపొందించారు.
ఇవిగో మా పెళ్లి ఫొటోలు!
ఇలా తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను వరుణ్ తాజాగా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. వివాహ వేదికపై ముసిముసిగా నవ్వుతూ, ఏడడుగులు నడుస్తూ క్యూట్‌గా మెరిసిపోయిన ఈ ఫొటోలకు ‘జీవితకాలపు ప్రేమ ఇప్పుడు అధికారికమైంది..!’ అంటూ లవ్లీ క్యాప్షన్ రాసుకొచ్చాడు వరుణ్. అలాగే వీటితో పాటు పసుపు వేడుకకు సంబంధించిన ఫొటోలను సైతం పంచుకున్నాడీ హ్యాండ్సమ్. ఇక పెళ్లికి ముందు జరిగిన హల్దీ, సంగీత్, మెహెందీ.. వంటి ప్రి-వెడ్డింగ్ వేడుకల్లోనూ తెగ సందడి చేశారీ లవ్లీ కపుల్. అయితే తమ పెళ్లికి సంబంధించిన ప్రతి ఘట్టాన్నీ రహస్యంగానే ఉంచాలనుకున్న వరుణ్-నటాషా.. ఈ క్రమంలో పెళ్లిలో సిబ్బంది ఫొటోలు తీయకుండా వారి కెమెరాలకు స్టిక్కర్లు కూడా అంటించారట! దీంతో వీరి పెళ్లి ఫొటోలేవీ బయటికి పొక్కలేదు. అయితే వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో మనమూ చూసేద్దాం రండి..
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వరుణ్-నటాషా!