నేను చదువుకుంటున్న రోజుల్లో మా దగ్గర బంధువు ఒకర్ని నాలుగేళ్లు ప్రేమించాను. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ మా ఇంట్లో ఈ విషయం చెపినప్పుడు ఒప్పుకోలేదు. అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులెవరూ మా అమ్మానాన్నకి ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధం వద్దని గొడవ పెట్టారు. అతడు కూడా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు. మా నాన్న అతనితో ఫోన్లో మాట్లాడిన మాటలకి కోపం వచ్చి వదిలి వెళ్లిపోయాడు. అప్పుడు నేను చాలా కుంగిపోయా. ఆ సమయంలో మా అమ్మానాన్నకి తెలిసిన సిద్ధాంతికి నా జాతకం చూపించి మా ఇద్దరి జాతకాలూ కలవలేదు కాబట్టి పెళ్లికి ఒప్పుకోలేదని అన్నారు. కొన్ని రోజుల తర్వాత అతడు తిరిగి వచ్చి మళ్లీ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మానాన్నకి తెలియకుండా అలా మాట్లాడడం వారిని మోసం చేసినట్లే అవుతుందని నేనే అతన్ని వెళ్లిపోమన్నా. నా తల్లిదండ్రులు అంత చెప్పిన తర్వాత కూడా మరోసారి ప్రయత్నిస్తే వాళ్లు నన్ను బయటకి పంపించేస్తారు. అదీకాక కన్నవారిని బాధపెట్టి నేను ఏం సుఖపడగలను అనే ఉద్దేశంతో అలా చేశా. కానీ ఇప్పుడు నాకు చాలా అయోమయంగా ఉంది. మా అమ్మానాన్నని నేను చాలా గుడ్డిగా నమ్మి, అతనికి అన్యాయం చేశానేమో అని బాధగా ఉంది. ఈ విషయమై నా మనసులో నేనే చాలా మధనపడుతున్నాను. నేను చేసింది తప్పా? ఒప్పా?? దయచేసి తెలుపగలరు.. - ఓ సోదరి
జ: మీరు చెప్పిన ఈ క్రమం మొత్తంలో మీ ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధంలో గాఢత, పరస్పర విశ్వాసం అనే పునాదుల మీద ఏర్పడాల్సిన అనురాగానికి సంబంధించిన ధృడమైన సూచనలేవీ కనిపించడం లేదు. మీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం వరకూ బాగానే ఉంది.. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కుటుంబాలు కూడా అందులో భాగం అవుతాయన్నది చదువుకున్నవారిగా మీ ఇద్దరికీ తెలిసిన విషయమే. అయితే మీ కుటుంబ సభ్యులు అతనితో ప్రవర్తించిన తీరు, వారి మాటలకు ఆత్మాభిమానం దెబ్బతిన్న అతను.. ఇరువైపులా వారి అభిమతాల ప్రకారమే ప్రవర్తించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో మీరు ఏ వ్యక్తి కోసమైతే ఇదంతా జరుగుతుందో ఆ వ్యక్తి మానసిక పరిస్థితిని అటు అతను.. ఇటు మీ వాళ్లు కానీ పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదు. అతని తరఫు వాళ్లు ఇష్టంలేదు కాబట్టి వారి ప్రవర్తన నచ్చలేదని మీ వాళ్లు, అలాగే మీ వాళ్ల మాటతీరు నచ్చలేదని అతను.. ఇలా ఎవరి గురించి వారు ఆలోచించుకున్నారే తప్ప వ్యక్తిగతంగా మీకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ అదే క్రమంలో మీ వాళ్లకు తెలియకుండా మీతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకోవాలని ప్రయత్నించడం అతనిలోని నిలకడ లేమిని సూచిస్తోంది.
కాబట్టి మీరు అతను జీవితాంతం మీకు తోడుగా నిలబడగలుగుతాడా? మీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వగలుగుతాడా?? మీ అమ్మానాన్నని గుడ్డిగా నమ్మి అతన్ని వదులుకుంటున్నా అని మీకు వచ్చిన సంశయం ఇతన్ని గుడ్డిగా నమ్మి అన్ని సంవత్సరాలు నన్ను కంటికి రెప్పలా కాచుకున్న నా తల్లిదండ్రులను వదులుకోవాల్సి వచ్చింది..' అన్న భావనకి దోహదం చేస్తుందేమో ఆలోచించుకోండి. కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని గౌరవించి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి అతడు అని మీకు అనిపిస్తే, అతడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే ఇలా చాటుమాటు వ్యవహారం కాకుండా సూటిగా తన ప్రేమని వ్యక్తపరుస్తూ మీ తల్లిదండ్రులతో మాట్లాడడం, మాట పట్టింపులకు తావీయకుండా తను మీ పెళ్లి కోసం ప్రయత్నించడం, అలాగే వాళ్లు పరస్పరం ఒకరినొకరు అంగీకరించి మాట్లాడుకోవడం.. ఇవన్నీ జరుగుతాయేమో ఆలోచించండి. నిజంగా మీరంటే అంత ప్రేమించే వాడే అయితే అతను ఈ పట్టింపులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ధైర్యంగా మిమ్మల్ని అడగగలగాలి. ఒకరి లోపాలను మరొకరు అంగీకరించేలా వారి మనసు, ఆలోచనా పరిధిని విస్తరించుకొని పరస్పరం స్వీకరించుకోగలగాలి. మీ ఇద్దరికీ పెళ్త్లెన తర్వాత అతని గురించి వారు కానీ లేదా వారి గురించి అతను కానీ మిమ్మల్ని దెప్పిపొడుస్తుంటే భరించడం తేలికేమీ కాదు. కాబట్టి మీ ఇద్దరూ పరస్పరం ముఖ్యమని భావించే పక్షంలో ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా అంగీకరించే ఆలోచనా విస్తృతి, వ్యక్తిత్వ పరిధిని పెంచుకోగల సామర్థ్యం అతనికి ఉందేమో ఆలోచించుకోండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్