హాయ్ మేడమ్.. నా వయసు 29. ఆఫీసర్ స్థాయి ఉద్యోగినిని. నా తల్లిదండ్రులు కూడా ఉద్యోగులే. నాకు ఇష్టం లేకుండా కుదిర్చిన పెళ్లిని రద్దు చేశాను. నాకు మా బావ అంటే చాలా ఇష్టం. కానీ, తను నన్నే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. నేనేమో మరో వ్యక్తిని నా భర్తగా ఊహించుకోలేకపోతున్నా. ఒక్కోసారి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునే కంటే అసలు పెళ్లే వద్దు అనిపిస్తుంది. అలా చేస్తే మా తల్లిదండ్రులు బాధపడతారు. నాకు ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. మీకు ఏది వద్దో తెలుసు కానీ.. ఏది కావాలో అనే విషయంలో స్పష్టత వచ్చినట్టు లేదు. మీకు నచ్చలేదు అన్న కారణంతో మీ తల్లిండ్రులకు నచ్చిన సంబంధాన్ని తిరస్కరించగలిగారు. కానీ, మీకు నచ్చాడు అన్న వ్యక్తికి మీరు నచ్చారా? లేదా? అన్న విషయం తెలియదు. అలాగే తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాడా? లేదా? అన్న దాంట్లో స్పష్టత లేదు. కాబట్టి మీకు నచ్చిన వ్యక్తిని కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ తల్లిదండ్రులు ద్వారా విచారించే ప్రయత్నం చేయచ్చేమో ఆలోచించండి. ఒకవేళ అతనికి ఇష్టం లేకపోతే మీ ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువిచ్చే వ్యక్తి తారసపడతారేమో చూడండి.
అటు ప్రయత్నాలు చేయకుండా, ఇటు మనసులో ఏవో ఆలోచనలు పెట్టుకొని వచ్చిన సంబంధాలను కాదనుకోవడం మీలోని సందిగ్ధతను సూచిస్తుంది. కాబట్టి పెళ్లి విషయంలో మీలో ఒక స్పష్టత రావాలంటే మీ ఆలోచనలకు తగ్గ వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలేంటో ఒక అవగాహనకు రండి.. అయితే కచ్చితంగా మీరు అనుకున్న వ్యక్తి మీకు దొరుకుతారని ఎవరూ చెప్పలేరు. కాబట్టి కనీసం మీ అంచనాలకు దరిదాపుల్లో ఉండే వ్యక్తిని మీరు పొందగలరేమో ప్రయత్నం చేసి చూడండి. అలాగే మీకు అవతలి వ్యక్తి గురించి ఆలోచనలు, అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో.. ఎదుటివారికి కూడా అలాగే ఉంటాయని అర్థం చేసుకోండి. కాబట్టి మీరు వాటికి ఎంత సమీపంగా ఉంటారనేది కూడా ఆలోచించుకోండి.
డా|| పద్మజ, సైకాలజిస్ట్