Image for Representation
ప్రేమ...రెండు మనసుల్ని కలిపి ముడివేసే తియ్యనైన వారధి. ఇది ఎప్పుడు, ఎవరి మీద, ఎలా, ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలియదు. అయితే ప్రేమించడం ఎంత గొప్ప విషయమో... తమ మనసులోని ప్రేమను ఎదుటివారికి తెలియజేయడం అంతకన్నా గొప్ప విషయం. అందుకే ఎదుటివారిపై తమ గుండె లోతుల్లోని ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్నో వినూత్న మార్గాలు ఎంచుకుంటుంటారు ప్రేమికులు. ఇందులో భాగంగా ఒకరు విలువైన బహుమతులతో మనసులో దాగున్న ప్రేమను తెలియజేస్తే... మరొకరు తాము ప్రేమించిన వ్యక్తిని నచ్చిన చోటికి తీసుకెళ్లి రొమాంటిక్‌గా ప్రపోజ్ చేస్తుంటారు. ఈక్రమంలో తన సహచర లోకో పైలట్‌కు రైల్వే ప్లాట్‌ఫాంపైనే ప్రపోజ్ చేశాడు ఓ అబ్బాయి. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. మరి అతడి ప్రేమను ఆ అమ్మాయి అంగీకరించిందా?లేదా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
ప్లాట్‌ఫాం మీదే లవ్ ప్రపోజల్!
బార్సిలోనాకు చెందిన పౌలా కార్బోజియా మూడేళ్ల క్రితం ఐర్లాండ్‌కు వచ్చి లోకో పైలట్‌గా స్థిరపడింది. అదే సమయంలో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కు చెందిన కొనోర్ ఓసులివన్తో ఆమెకు పరిచయమైంది. అతను కూడా లోకో పైలట్ కావడంతో గత కొంతకాలంగా కలిసే పనిచేస్తున్నారీ ఇద్దరు. ఈక్రమంలోనే పౌలాపై ప్రేమను పెంచుకున్నాడు కొనోర్. ఎలాగైనా తన మనసులోని మాటను ఆమెకు చెప్పి మనువాడాలనుకున్నాడు. ఇందుకోసం తాను పనిచేస్తోన్న డబ్లిన్ రైల్వే స్టేషన్ అయితే బాగుంటుందనుకున్నాడు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడి ప్రపోజల్‌కు అన్నీ ముందే సిద్ధం చేసుకున్నాడు.
విల్ యూ మ్యారీ మీ!
ఇందులో భాగంగా రాత్రి 9 గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లిన కొనోర్...ప్లాట్‌ఫాంపై ‘విల్ యూ మ్యారీ మీ’ అనే అక్షరాలను ఒక్కో బోర్డుపై విడివిడిగా ఏర్పాటుచేశాడు. తన ప్రపోజల్‌ను మరింత రొమాంటిక్ మార్చాలని భావించి జేమ్స్ బ్లంట్ పాడిన ‘యూ మేక్ మీ బెటర్’ అనే పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేశాడు. ఇక పూల బొకే, షాంపేన్ బాటిల్ పట్టుకుని ‘మీ’ అనే అక్షరం ఉన్న చివరి బోర్డు వద్ద తన ప్రియురాలి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడసాగాడు కొనోర్. ఇంతలోనే పౌలా నడుపుతున్న ట్రైన్ ప్లాట్‌ఫాం మీదకు ప్రవేశించింది. ఇదే సమయంలో లోకో పైలట్‌గా తన విధుల్లో ఉన్న పౌలా అక్కడి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బోర్డులను ఒక్కొక్కటి చదువుకుంటూ రైలు నడుపుతూ ముందుకు వచ్చింది. ‘మీ’ అనే చివరి బోర్డు దగ్గరికి వచ్చే సరికి అక్కడ ఉన్న కొనోర్‌ను చూసి ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే రైలు ఆపి అతని దగ్గరకు వెళ్లింది. ఇక ప్రేయసి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కొనోర్, పౌలా రాగానే మోకాళ్లపై కూర్చొని ‘డియర్...నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ఆమెకు ప్రపోజ్ చేశాడు. మరి, ఇంత సర్ప్రైజింగ్గా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయైనా వద్దంటుందా? కొనోర్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి ముందు ఆశ్చర్యపోయినా...ఆ తర్వాత తేరుకుని ‘యస్’ అనేసింది పౌలా. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బి్బ్బైన కొనోర్ తన ప్రియురాలిని గట్టిగా హత్తుకున్నాడు. ముద్దుపెట్టుకున్నాడు. ఈక్రమంలో అక్కడున్న రైల్వే సిబ్బంది, ప్రయాణికులు.. చప్పట్లు, కేరింతలతో ఈ లవ్‌బర్డ్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు.
కంగ్రాట్స్... లవ్ బర్డ్స్!
ఈ అరుదైన సందర్భాన్ని ఓ నెటిజన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ వీడియోకు సుమారు 14 వేల మంది లైక్ కొట్టడం విశేషం. ఈ సందర్భంగా నెటిజన్లు ‘అద్భుతం’, ‘రొమాంటిక్ అండ్ స్వీటెస్ట్ ప్రపోజల్’, ‘ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రపోజల్ ఇది!’ అంటూ ఈ జంటపై ఓ వైపు ప్రశంసలు, మరోవైపు ఆశీస్సుల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్ ప్రియులను బాగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియోను ఐరిష్ రైల్వే అధికారులు కూడా తమ అధికారిక ట్వి్ట్టర్ పేజీలో షేర్ చేశారు. పౌలా-కొనోర్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ప్రేమపక్షులను కలిపేందుకు సహకరించిన రైల్వే అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపోజ్ చేస్తాడనుకోలేదు!
తమ లవ్ ప్రపోజల్‌కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించింది పౌలా. ‘ప్లాట్‌ఫాంపై నిల్చొని ఉన్న కొనోర్‌ను చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను. త్వరలోనే క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కదా..! ఏదైనా సమ్‌థింగ్ స్పెషల్ బహుమతి ఇస్తాడేమో అనుకున్నాను. అంతేకానీ ప్రపోజ్ చేస్తాడని అసలు వూహించలేదు. అందుకే మొదట షాక్ అయ్యాను. అదే సమయంలో నాకోసం ఇంత చేసిన అతడి రొమాంటిక్ ప్రపోజల్‌ను కాదనలేకపోయాను. అయితే మేం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. మాకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అవి పూర్తయ్యాకే దాంపత్య బంధంలోకి అడుగుపెడతాం’ అని చెప్పుకొచ్చింది పౌలా.