ప్రపంచ టెన్నిస్ చరిత్రలో తానో సంచలనం.. తాను కోర్టులో అడుగుపెట్టిందంటే ఆటతో పాటు తన అందాన్ని చూసి ముగ్ధులయ్యే వారైతే లెక్కే లేదు! అలా తన ఆటతో, అపురూప లావణ్యంతో టెన్నిస్ ప్రియుల్నే కాదు.. ప్రపంచ కుర్రకారును ఫిదా చేసేసుకుంది రష్యన్ టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా. ఈ ఏడాది ఆరంభంలో అనూహ్యంగా తన రిటైర్మెంట్ను ప్రకటించి ఎంతోమందిని నిరాశపరిచిన ఈ క్యూట్ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి కుర్రకారు హృదయాలు ముక్కలయ్యే వార్త చెప్పింది. తన ప్రియుడు, బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో తాజాగా నిశ్చితార్థం చేసుకుంది షరపోవా. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయిందీ టెన్నిస్ సంచలనం.
టెన్నిస్ ఆడేందుకే పుట్టిందేమో అనేలా నాలుగేళ్లకే టెన్నిస్ రాకెట్ పట్టుకుందీ రష్యన్ తార. ఆ తర్వాత ఓ రష్యన్ కోచ్ దగ్గర ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చిన్న వయసులోనే టెన్నిస్‌పై ఆమెకున్న మక్కువను గమనించిన ఆమె తల్లిదండ్రులు ఈ దిశగా షరపోవాను ప్రోత్సహించారు. అలా తొమ్మిదేళ్ల వయసులో ప్రారంభమైన ఆమె విజయ ప్రస్థానం ఈ ఏడాది దాకా అప్రతిహతంగా సాగుతూ వచ్చింది. 17 ఏళ్లకే వింబుల్డన్ టైటిల్ అందుకున్న ఈ టెన్నిస్ స్టార్.. కెరీర్లో ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకుంది. మధ్యమధ్యలో వరుస గాయాలు వెక్కిరించినా, ఒక దశలో డ్రగ్స్ వాడి సస్పెన్షన్‌కి గురైనా తిరిగి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించిందీ రష్యన్ బ్యూటీ. ఇక ఈ ఏడాది ఆరంభంలో టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది షరపోవా.
ఆ రోజే నీ ప్రేమను అంగీకరించా!
ఇలా తన ఆటతో ప్రపంచ టెన్నిస్ ప్రేమికుల్ని తన వైపు తిప్పుకున్న ఈ టెన్నిస్ సంచలనం.. తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. తన ప్రియుడు, బ్రిటిష్ వ్యాపారవేత్త-ఆర్ట్ డీలర్ అయిన అలెగ్జాండర్ గిల్కెస్‌తో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించిందీ చిన్నది. ఈ క్రమంలో అతనితో దిగిన లవ్లీ ఫొటోలను పంచుకుంటూ.. ‘నిన్ను కలిసిన రోజే నీ ప్రేమను అంగీకరించా.. ఇది మన మధ్య ఉన్న ఓ తియ్యటి రహస్యం.. కాదంటావా డియర్!’ అంటూ ఎంగేజ్మెంట్ రింగ్ ఎమోజీని జత చేసింది షరపోవా.
ఇక తన ఇష్టసఖితో దిగిన లవ్లీ ఫొటోలను పంచుకున్న గిల్కెస్.. ‘నా ప్రేమను అంగీకరించి నన్ను అంతులేని సంతోషంలో ముంచెత్తినందుకు థ్యాంక్యూ డార్లింగ్! నిన్ను జీవితాంతం ఇలా ప్రేమిస్తూ.. నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతా..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకున్నాడీ హ్యాండ్సమ్ హంక్.
2018లో పరిచయమైన వీరిద్దరూ అప్పట్నుంచి డేటింగ్లో ఉన్నారు. కాగా, స్క్వేర్డ్ సర్కిల్స్ కంపెనీకి సహ యజమాని అయిన గిల్కెస్కు గతంలో బ్రిటిష్ డిజైనర్ మిషా నూనోతో వివాహమైంది. 2016లో వీరిద్దరూ విడిపోయారు. నూనో మేగన్ మార్కల్‌కు మంచి స్నేహితురాలట!
ఇలా వీరిద్దరి ప్రేమ, నిశ్చితార్థం విషయం తెలుసుకున్న సెలబ్రిటీలు, అభిమానులు వీరికి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ లవ్లీ కపుల్‌కి సంబంధించిన క్యూట్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. వాటిపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..!