Photo: Instagram
ప్రేమకు సమయం, సందర్భమనేది ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు, ఎవరిమీద, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ ప్రేమను తెలియజేయాలంటే కచ్చితంగా మంచి మూహూర్తం చూసుకోవాలి. అందుకే చాలామంది తమ మనసుకు నచ్చిన వారు చాలా సంతోషంలో ఉన్నప్పుడు తమ ప్రేమ విషయాన్ని చెబుతుంటారు. అలా ఎదుటివారి ప్రేమను గెలుచుకున్న ఆ ఆనంద క్షణాలు ఎవరికైనా మధుర జ్ఞాపకమే. అయితే ఇటీవల భారత్-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా... స్టాండ్స్‌లో ఓ భారతీయ వ్యక్తి ఆస్ట్రేలియా అమ్మాయికి ప్రపోజ్ చేయడం...ఆ యువతి సంతోషంతో సిగ్గుపడుతూ అతడి ప్రపోజల్‌ను స్వీకరించడం...అదంతా కెమెరాల్లో రికార్డవ్వడంతో వీరి లవ్ ప్రపోజల్ బాగా వైరలైంది. దీంతో ఎవరీ జంట? అని నెటిజన్లు సెర్చ్ చేయగా ఈ ప్రేమపక్షుల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
సిగ్గు పడుతూనే ‘ఎస్’ చెప్పేసింది!
ఎవరికైనా ఆట అంటే ఆనందం. అందులోనూ క్రికెట్ అంటే మహదానందం. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఇటీవల క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుండడంతో ప్రేక్షకులతో పాటు కెమెరా కళ్లన్నీ అటు వైపే ఉన్నాయి. అయితే ఉన్నట్లుండి కెమెరాలన్నీ గ్రౌండ్ నుంచి ప్రేక్షకుల స్టాండ్స్‌కు మారిపోయాయి. అక్కడ ఓ లవ్ ప్రపోజల్ జరుగుతుండడమే అందుకు కారణం. ఇందులో భాగంగా ప్రియుడు మోకాలిపై కూర్చొని రింగ్ అందించి ప్రపోజ్ చేశాడు. ఊహించని ఈ సంఘటనతో ప్రియురాలు కొద్ది సేపు ఆశ్చర్యానికి గురైనా... తనకూ అతడంటే ఇష్టం ఉండడంతో సిగ్గుపడుతూ ‘ఎస్’ చెప్పేసింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమతో హత్తుకోవడం, ముద్దులు పెట్టుకోవడంతో చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా ఆ ప్రేమ పక్షులకు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పారు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తోన్న ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా చప్పట్లు కొడుతూ వారికి కంగ్రాట్స్ చెప్పడం విశేషం.
ఆ మెయిల్‌తో ప్రేమ మొదలైంది!
వీరి లవ్ ప్రపోజల్ వీడియో బాగా వైరల్ కావడంతో నెటిజన్లు ఈ జంట గురించి ఇంటర్నెట్లో శోధించడం మొదలెట్టారు. అయితే తాజాగా స్వయంగా ఆ జంటే మళ్లీ బయటికొచ్చింది. తమ లవ్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుంది. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు దీపేన్ మండాలియా కాగా, అతడి ప్రేయసి పేరు రోసిలీ వింబుష్ అని తెలిసింది. బెంగళూరుకు చెందిన దీపేన్ గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో డేటా అనలిస్టుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తామిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నాడు దీపేన్.
‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటే ఇదేనేమో!
‘నేను 2018 అక్టోబర్‌లో సిడ్నీ నుంచి మెల్బోర్న్లోని ఓ చిన్న అపార్ట్మెంట్లోకి వచ్చాను. ఆ క్షణం నాకు తెలియలేదు...అదే నా జీవితాన్ని మారుస్తుందని. అంతకుముందు ఆ అపార్ట్మెంట్లో రోసిలీతో పాటు చాలామంది ఉండేవారు. దీంతో వారి పేరుతో చాలా మెయిల్స్ మా ఇంటికి వచ్చాయి. అందులో ఏవైనా అత్యవసరమనిపిస్తే వెంటనే వారిని డైరెక్టుగా కలిసి ఆ మెయిల్స్ అందజేసేవాడిని. అలా నాకు ఒకరోజు రోసిలీ పేరు మీద ఓ మెయిల్ వచ్చింది. దీంతో ఫేస్బుక్ ద్వారా ఆమెను కాంటాక్ట్ అయ్యాను. ఆ తర్వాత మెయిల్ అందజేయడానికి తనను కలిసేందుకు వెళ్లాను. అక్కడ తనను ప్రత్యక్షంగా చూసేసరికి నా నోట మాట రాలేదు. తన కళ్లలోకి కళ్లు పెట్టి చూసేందుకు చాలా భయమేసింది. బహుశా దీన్నే ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటారేమో! అయితే రోసిలీ మాత్రం నా చేతుల్లోని మెయిల్ తీసుకుని ‘బై’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా మా మొదటి మీటింగ్ కేవలం 10 సెకన్లలోనే ముగిసింది.’
కాఫీ ఆఫర్ చేస్తే కాదనలేకపోయాను!
‘నెల తర్వాత మరోసారి ఆ అమ్మాయిని కలుసుకునే అవకాశాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. రోసిలీ పేరుమీద మరో మెయిల్ రావడంతో వెంటనే తనకు మెసేజ్ చేశాను. అప్పుడు తను థ్యాంక్స్ చెబుతూ ఓ కాఫీ ఆఫర్ చేసింది. నేను సంతోషం పట్టలేక వెంటనే ఓకే చెప్పేశాను. రెండోసారి తనను కలవడానికి వెళ్లేటప్పుడు ఏ మాత్రం భయం వేయలేదు. అనుకున్నట్లే ఓ కాఫీ షాపులో తనను కలిశాను. కాఫీ తాగుతూనే తనతో సరదాగా మాటలు కలిపాను. మా మొదటి మీటింగ్ 10 సెకన్లలో ముగిస్తే రెండోసారి మాత్రం 2 గంటలు మాట్లాడుకున్నాం. అందులో మాకెంతో ఇష్టమైన క్రికెట్ గురించి కూడా చర్చకు వచ్చింది. అలా మొదటిసారి కలిసి కాఫీ తాగిన మేం ఆ తర్వాత కలిసి డిన్నర్‌కు ప్లాన్ చేశాం. అలా అతి తక్కువ సమయంలోనే ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు మరొకరు తెలుసుకున్నాం. మేం వేర్వేరు దేశాల్లో పెరిగాం. అయినా మా ఇద్దరికీ క్రికెట్‌తో పాటు చాలా విషయాల్లో సారూప్యతలున్నాయి. అవే మా ఇద్దరి మధ్య ప్రేమకు కారణమయ్యాయి.
అదే మంచి ముహూర్తమనిపించింది!
ఇక లవ్ ప్రపోజల్ విషయానికొస్తే ... క్రికెట్‌తో మా ఇద్దరికీ ఎంతో అనుబంధం ఉంది. అందుకే తనకు ప్రపోజ్ చేయడానికి క్రికెట్ మ్యాచ్ కన్నా మంచి ముహూర్తం, సందర్భం లేదనిపించింది. అనుకున్నట్లుగానే మ్యాచ్ మధ్యలో తనకు ప్రపోజ్ చేశాను. తను నా ప్రేమను అంగీకరించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రోసిలీ పక్కనుంటే ఈ భూమ్మీద నాకన్నా అదృష్టవంతుడెవరూ లేరనిపిస్తుంది. తను ఇలాగే నాతో కలిసి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా ప్రేమను ఆశీర్వదిస్తూ మద్దతు తెలుపుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం’ అని సుదీర్ఘ పోస్టులో రాసుకొచ్చాడు దీపేన్.