మేడమ్.. నా వయసు 24. మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం.. మా తల్లిదండ్రులకు నేను రెండో సంతానం. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. మా తల్లిదండ్రులు నాతో తప్ప మిగతా ఇద్దరితో బాగానే ఉంటారు. ఇంటి పనులు నాతోనే ఎక్కువగా చేయిస్తుంటారు. నా పట్ల వాళ్లు అలా ప్రవర్తిస్తుంటే రెండో అమ్మాయిగా పుట్టడమే నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది. ‘అవసరానికి నేను.. ప్రేమను పంచడానికి మాత్రం వాళ్లు కావాలా?’ అనిపిస్తుంది. ఒక్కోసారైతే ఇవన్నీ భరించలేక చనిపోవాలనిపిస్తుంది. ఏమైనా అంటే ‘నీకు వాళ్లిద్దరి మీద అసూయ’ అని తిడతారు. అసలు నేనంటే అంత ఇష్టం లేనప్పుడు ఇంకా నేను ఎందుకు బతికున్నానా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి
జ: మీ ఆలోచనల్లో నైరాశ్యం కనిపిస్తోంది.. వాళ్లు మాట్లాడే మాటలకు కానీ, వాళ్ల చేతలకు కానీ మీరు అవసరానికి మించిన ప్రాధాన్యం ఇస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి. ముగ్గురు పిల్లల్లో రెండో అమ్మాయిగా పుట్టడం వల్ల మీకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం అనే బాధ మిమ్మల్ని ప్రతికూల ఆలోచనల వైపు మళ్లిస్తోందా? అన్నది కూడా ఒకసారి విశ్లేషించుకోండి. మీ తల్లిదండ్రులు మీకున్న అభద్రతా భావాలు, ఆత్మన్యూనతా భావాలు అర్థం చేసుకోకుండా మిగతా ఇద్దరిపై మీరు అసూయ చూపుతున్నారనడం మీలోని నిరాశను మరింత పెంచుతున్నట్లుగా మీ ఉత్తరం సూచిస్తోంది. కాబట్టి ముందుగా మీ భావాలను, వారి ప్రవర్తన మూలంగా మీరు పడుతోన్న బాధను మీ తల్లిదండ్రులకు విడమరిచి చెప్పండి. తద్వారా వాళ్లు కొంతవరకు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారేమో చూడండి. ఈ క్రమంలో మిగతా వాళ్ల గురించి ప్రస్తావించడం, వారితో మిమ్మల్ని పోల్చుకోవడం కాకుండా.. మీ పట్ల మీ పేరెంట్స్ ఎలా ఉంటే మీరు సంతోషంగా ఉండగలుగుతారో వారికి వివరించండి. అలా చేస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉందేమో ప్రయత్నించండి.

నైరాశ్యాన్ని తగ్గించుకోండి!
అంతేకాదు.. ఇదే సమయంలో మీలో ఉన్న నైరాశ్యాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో కూడా మీరు ఆలోచించాలి. ఈ క్రమంలో మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం పెంచుకోవడానికి ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.. అలాగే కొన్ని వెబ్‌సైట్స్‌ను మీరు విస్తృతంగా పరిశీలించడం ద్వారా మీ ఆలోచనాధోరణిలో ఉన్న నిరాశని మీరు ఎలా తగ్గించుకోవచ్చనేది తెలుసుకోవచ్చు. వీటితో పాటు విజయవంతమైన వ్యక్తుల జీవిత చరిత్రలు, ప్రముఖుల సూక్తులు.. వంటివి కూడా మీలో సానుకూల దృక్పథాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయి. ఇలా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని, మీకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని ఏర్పరచుకొని, జీవితంలో ముందుకెళ్లడం ద్వారా మీ మనసులో కలిగే నిరాశాపూరిత ధోరణి క్రమంగా తగ్గుతుందన్న విషయం గ్రహించండి.
ఒకవేళ ఇలా చేసినా మీ ఆలోచనల్లో మార్పు రాకపోయినా, మీ తల్లిదండ్రులు మీ పట్ల అదే ధోరణితో వ్యవహరించినా.. ఇద్దరూ కలిసి మానసిక నిపుణుల వద్ద కౌన్సెలింగ్‌కి వెళ్లడం మంచిది. తద్వారా ఇటు మీ ఆలోచనా విధానంలో, అటు వారిలో క్రమంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
డా|| పద్మజ, సైకాలజిస్ట్