Photo: Instagram
ప్రేమలో ఉన్నా, రిలేషన్షిప్లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా.. చాలా జంటలు ఒకరి కోసం మరొకరు తమ అభిరుచుల్ని మార్చుకుంటాయి.. అలా చేస్తేనే ఒకరిపై ఒకరికి ప్రేముందని నమ్మే జంటలూ లేకపోలేదు. అయితే ప్రేమంటే అటవాట్లను, సంప్రదాయాలను మార్చుకోవడం కాదని, ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించడమే అసలైన అనురాగం అంటోంది బాలీవుడ్ డింపుల్ బ్యూటీ కల్కి కొచ్లిన్. ఇజ్రాయెల్‌కు చెందిన మ్యుజీషియన్ గై హెర్ష్‌బెర్గ్‌తో గత మూడేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాఫో అనే ముద్దుల పాపకు జన్మనిచ్చింది. అప్పట్నుంచి అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న ఈ చక్కనమ్మ.. సందర్భం వచ్చినప్పుడల్లా తన వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన బాయ్‌ఫ్రెండ్ గైతో ఏర్పడిన తొలి పరిచయం దగ్గర్నుంచి.. ఈ మూడేళ్ల అనుబంధంలోని కొన్ని తీపి గుర్తుల్ని నెమరువేసుకుంటూ ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ అందాల తార.
సినిమాల్లో తన బోల్డ్ రోల్స్‌తో ఎంతోమంది విమర్శకుల ప్రశంసలందుకున్న కల్కి.. వ్యక్తిగత జీవితంలోనూ ఏదైనా నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఫ్రెంచ్ సంతతికి చెందిన ఈ భామ.. ఇక్కడే పుట్టిపెరిగింది.. 2011లో ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ బసూను వివాహమాడిన కల్కి.. 2015లో అతని నుంచి విడిపోయింది. ఆపై 2018లో ఇజ్రాయెల్‌కు చెందిన మ్యుజీషియన్ గై హెర్ష్‌బెర్గ్‌తో ప్రేమలో పడింది. ఇప్పటిదాకా తమ రిలేషన్షిప్ గురించి పెదవి విప్పని ఈ చక్కనమ్మ.. తాజాగా ఓ సుదీర్ఘ ఇన్‌స్టా పోస్ట్ రూపంలో తమ మధ్య ఉన్న అనురాగాన్ని బయటపెట్టింది.
అక్కడ కలుసుకున్నాం..!
విభిన్న దేశాలు, ప్రాంతాలకు చెందిన ఇద్దరు ప్రేమికుల మధ్య అనురాగముండాలే కానీ.. ప్రాంతీయ పట్టింపులు ఉండకూడదంటోంది కల్కి. తన భర్త తన ఒడిలో ఒదిగిపోయినట్లుగా ఉన్న ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ క్యూట్ బ్యూటీ.. తమ అందమైన ప్రేమకథను ఇలా పంచుకుంది.
‘మృత సముద్రానికి (డెడ్ సీ) వెళ్లే దారి మధ్యలో ఉన్న ఓ పెట్రోల్ స్టేషన్లో నేను, హెర్ష్ కలుసుకున్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య మాటల ప్రవాహం మొదలైంది.. ఇన్నేళ్ల మా అన్యోన్యతకు గుర్తుగా మా బేబీ పుట్టాక కూడా ఇంకా ఆ ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. మొదట్లో ముంబయి నుంచి జెరూసలెంకు తరచూ మా ప్రయాణాలు సాగేవి. ఈ క్రమంలో నేను నా సూట్‌కేస్ నిండా కొబ్బరిబోండాలను నింపుకొని హెర్ష్ కోసం తీసుకెళ్లేదాన్ని.. అతను కూడా నాకోసం కమలాఫలాలు, అవకాడోలు కిలోలకు కిలోలు తీసుకొచ్చేవాడు.
అలా ప్రేమగా వండి వార్చుకుంటాం!
రోజూ బ్రేక్ ఫాస్ట్ కోసం తమ ఆహారపుటలవాట్లలో ఒకటైన స్పెషల్ సలాడ్ని హెర్ష్ నాకోసం తయారుచేయడం, నేను తనకోసం మూడు పూటలా రుచికరమైన వంటకాలు చేసి పెట్టడం అలవాటు చేసుకున్నాం. అతనేమో బిర్యానీ చేయడం నేర్చుకుంటే.. నేను షక్షౌకా (ఇజ్రాయెల్ వంటకం) నేర్చుకున్నా. హిందీ నేర్చుకోవడం-ఫ్రెంచ్ సినిమాలు చూడడం తన పనైతే.. ఆన్లైన్లో హెబ్రూ (ఇజ్రాయెల్ జాతీయ భాష) నేర్చుకోవడం, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం నా వంతైంది. తనకు యాలకులు కలిపి చేసిన కాఫీ అంటే ఇష్టం.. నాకేమో ఛాయ్ అంటే పిచ్చి.
గొడవలు జరుగుతాయ్.. కలిసిపోతాం..!
హెర్ష్ జ్యూయిష్ (ఇజ్రాయెల్ సంతతికి చెందిన వ్యక్తి). రష్యన్, పోలిష్ (పోలండ్ జాతీయ భాష), ఇరానియన్ భాషలు మాట్లాడతాడు.. అదే నేనైతే ఫ్రెంచ్ సంతతికి చెందిన అమ్మాయినే అయినా ఇండియాలోనే పుట్టిపెరిగాను. నా పేరులో కల్కి అంటే హిందువు, కొచ్లిన్ అంటే క్రిస్టియన్.. భాషలకు చెందిన పదాలు. ఇక మా పాప సాఫోది గ్రీక్ పేరు. ఇలా మేము మా ఇంట్లో ఎవరి సంప్రదాయాలను వారు పాటిస్తుంటాం.. ఒకరి ఆహారపుటలవాట్లను, ఆచార వ్యవహారాలను మరొకరం పంచుకుంటాం.. వాటిని గౌరవిస్తాం. మా మధ్యా రోజూ వంట చేసే క్రమంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అయినా ఆహారాన్ని, డ్రింక్‌ని కలిసి పంచుకుంటూ మళ్లీ కలిసిపోతాం..’ అంటూ తమ రిలేషన్షిప్లో ఉన్న కొన్ని అందమైన అనుభూతుల్ని నెమరువేసుకుందీ ముద్దుగుమ్మ. ఇలా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా అవి క్షణాల్లో మటుమాయమైపోవాలని అప్పుడే ఆ బంధంలోని అన్యోన్యతను ఆస్వాదించచ్చని నేటి జంటలకు రిలేషన్షిప్ పాఠాలు చెబుతోందీ బ్యూటిఫుల్ మామ్.
ఇలా కల్కి రాసిన పోస్ట్ చదువుతుంటే మీ అనుబంధంలోని సరిగమలు, మధురిమలు మీ మదిలో మెదులుతున్నాయా? మీ భాగస్వామి మీకోసం చేసిన వంటకాలు, మీ అనుబంధంలో జరిగిన చిలిపి గొడవలు, ఇచ్చిపుచ్చుకున్న కానుకలు.. ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి గుర్తొస్తున్నాయా? అయితే వాటిని మీ మనసులోనే దాచుకుంటే ఎలా? ‘వసుంధర.నెట్’ వేదికగా ఆ తీపి గుర్తుల్ని అందరితో పంచుకోండి.. మీ అనుబంధంలోని అన్యోన్యతను నలుగురికీ చాటుతూ ఆదర్శ దంపతులుగా నిలవండి.