Photo: Instagram
కెరీర్ పరంగా వారిద్దరి దారులు ఒకటే. అందుకే ఆటతో పాటు అభిరుచులు కూడా తొందరగానే కలిశాయి. స్నేహంతో మొదలైన వారి పరిచయం ప్రేమగా చిగురు తొడిగింది. ఆ మరుక్షణం నుంచే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరస్పరం సహాయ సహకారాలు అందించుకున్నారు. సంతోష క్షణాలను కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లే కన్నీళ్లొచ్చినప్పుడు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఈ క్రమంలో తమ ప్రేమ బంధాన్ని శాశ్వతమైన వివాహ బంధంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడయింది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లిపీటలెక్కారు. వారే స్టార్ రెజ్లర్లు సంగీతా ఫోగట్- బజరంగ్ పునియా. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
ఏడడుగులు నడిచారు!
గీతా ఫోగట్- పవన్ కుమార్, సాక్షి మాలిక్- సత్యవర్త్ కడియన్, వినేశ్ ఫోగట్- సోమ్ వీర్ రాతి... వివాహ బంధంతో ఒక్కటైన ఈ ఇండియన్ రెజ్లర్ల క్లబ్లో మరో జంట చేరింది. వారే ఫోగట్ సిస్టర్స్‌లో ఒకరైన సంగీతా ఫోగట్- బజరంగ్ పునియా. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ గతేడాది చివరిలో నిశ్చితార్థం చేసుకుని ఉంగరాలు మార్చుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ పూర్తయ్యాక ఆగస్టులో అందరి సమక్షంలో వేడుకగా వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో వీరి పెళ్లి ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. పైగా ఇప్పట్లో వైరస్ తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. దీంతో ఈ శుభకార్యాన్ని ఇంకా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో నిరాడంబరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారీ లవ్ బర్డ్స్. ఈ క్రమంలో ‘ఫోగట్ సిస్టర్స్’ సొంత వూరైన హరియాణా లోని ఛార్కి దాద్రి జిల్లాలోని బలాలి వేదికగా ఏడడుగులు నడిచారు.
అలా మొదలైంది!
కుస్తీ పోటీలంటే భారతదేశంలో అందరికీ గుర్తుకు వచ్చేది ‘ఫోగట్ కుటుంబమే’. బబితా ఫోగట్, వినేశ్ ఫోగట్, ప్రియాంక ఫోగట్, గీతా ఫోగట్, రీతూ ఫోగట్... ఇలా ఆరుగురి సిస్టర్స్‌లో అందరికంటే చిన్నదైన సంగీతా ఫోగట్ 59 కేజీల విభాగంలో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక బజ్రంగ్ విషయానికొస్తే 65 కేజీల విభాగంలో వరల్డ్ నంబర్ వన్ రెజ్లర్‌గా కొనసాగుతున్నాడు. కుస్తీ పోటీలకు సంబంధించి చిన్నప్పటి నుంచి తండ్రి మహావీర్ సింగ్ ఫోగట్ దగ్గరే శిక్షణ తీసుకుంది సంగీత. ఆ తర్వాత మల్లయుద్ధంలో మరింత రాటుదేలేందుకు సోనిపట్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి చేరుకుంది. అప్పటికే తన సోదరి గీతా ఫోగట్, బజరంగ్ అక్కడే శిక్షణ పొందుతున్నారు. దీంతో సంగీత-బజరంగ్ల మొదటి పరిచయానికి ఆ శిక్షణ కేంద్రమే వేదికైంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మొగ్గ తొడిగింది.
‘బజ్రంగ్ గురించి గీత, బబితకు ముందే తెలుసు. ఆ తర్వాతే నేను అతడిని కలుసుకున్నాను. సోనిపట్‌లోని శిక్షణ కేంద్రానికి రోజూ ట్రైన్లోనే కలిసి వెళ్లేవాళ్లం. ఇద్దరి ఆట, అభిరుచులు కలవడంతో మా మనసులు కూడా కలిశాయి. మా తల్లిదండ్రులకు కూడా అతనంటే చాలా ఇష్టం. అలా ఇరు పెద్దల అంగీకారంతో మేం ఒక్కటవుతున్నాం’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది సంగీత.
మా జీవితంలోని కొత్త అధ్యాయం సంతోషంతో నిండాలి!
ఈ క్రమంలో హరియాణా లోని బలాలీ వేదికగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు సంగీత-బజ్రంగ్. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో భాగంగా నూతన వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై మెరిసిపోయారు. ఈ సందర్భంగా ఎరుపురంగు భారీ ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ లెహెంగా, మ్యాచింగ్ బ్లౌజ్, గ్రే కలర్ దుపట్టాలో సంగీత సూపర్బ్ అనిపించగా, క్రీమ్ కలర్ షేర్వాణీలో ఆకట్టుకున్నాడు బజరంగ్. వివాహ వేడుక అనంతరం తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారీ లవ్లీ కపుల్.
తన భర్తతో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్న సంగీత ‘నా జీవితం పరిపూర్ణమైంది. ఈ జీవితానికి తోడు నువ్వు. మా జీవితంలోని కొత్త అధ్యాయం ప్రేమ, సంతోషంతో నిండాలి’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది.
నా జీవిత భాగస్వామిని ఇంటికి తీసుకొచ్చాను!
పెళ్లి వేడుకలో సంగీతతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న బజరంగ్ ‘ఈ రోజు నేను నా జీవిత భాగస్వామిని ఎన్నుకుని నా ఇంటికి తీసుకొచ్చాను. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే కొంచెం ఆందోళనగా ఉంది. ఈ పరీక్షలో నేను గెలవాలి. మాపై అత్యంత ప్రేమను కురిపించి, ఆశీర్వాదాలు అందించిన అందరికీ ధన్యవాదాలు’ అని భావోద్వేగానికి గురయ్యాడు.
ఉత్తమ భార్యవి అవుతావు!
సంగీత సోదరి రితూ ఫోగట్ నూతన వధూవరులిద్దరి ఫొటోలను షేర్ చేసుకుంటూ ‘నీతో నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నువ్వు తప్పు చేస్తే నేను క్షమించాను. నేను తప్పు చేస్తే నువ్వు సరిదిద్దావు. నాపై అత్యంత ప్రేమను చూపించావు. నాకు మంచి సోదరి అయినట్లే, నీ భర్తకు నువ్వు ఉత్తమ భార్యవి అవుతావు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న మీ ఇద్దరికీ నా అభినందనలు. నీతో గడిపే అద్భుత క్షణాలను మిస్సవుతున్నాను’ అంటూ రాసుకొచ్చింది.
బబితా ఫోగట్-వివేక్ సుహాగ్, గీతా ఫోగట్- పవన్‌కుమార్ దంపతులు సోషల్ మీడియా వేదికగా సంగీత-బజరంగ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు హాకీ క్రీడాకారిణి రాణీ రాంపాల్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, క్రీడాభిమానులు, నెటిజన్లు ‘కొత్త దంపతుల జీవితం సుఖ సంతోషాలతో సాగాలని’ కోరుతూ అభినందనలు తెలుపుతున్నారు. మరి జీవితంలో నూతన ఆధ్యాయాన్ని ప్రారంభించిన సంగీత-బజరంగ్ దంపతులకు మనమూ శుభాకాంక్షలు తెలుపుదాం. అదేవిధంగా వారి వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలపై ఓ లుక్కేద్దాం.