ప్రేమికులు తమ ప్రేమను ఒకరికొకరు తెలియజేసుకునే సందర్భం వాళ్ల జీవితాల్లో ఎంతో అపురూపమైనది. ఆ అద్భుత క్షణాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకోవాలని అందరూ అనుకోవడం సహజం. ఈ క్రమంలో - నవలలు, సినిమాల్లో మాదిరిగా - తన కలల రాకుమారుడు మోకాళ్ల పైన నిల్చొని, గులాబీ పువ్వు అందించి మరీ తనకు లవ్ ప్రపోజ్ చేయాలని అందరూ అనుకోకపోయినా కొంతమంది అనుకునే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో తనకు కాబోయే వాడు కూడా అలాగే ప్రేమను వ్యక్త పరచాలని కోరుకున్నానంటోంది కాజల్ అగర్వాల్. గత నెల చివరిలో తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచిందామె. ప్రస్తుతం మాల్దీవుల్లో తమ హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోందీ లవ్లీ జంట. ఈ సందర్భంగా తమ రిలేషన్షిప్, వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారీ క్యూట్ కపుల్.
తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న అందాల భామ కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ముంబయి వేదికగా మనువాడింది. నిశ్చితార్థం దగ్గర్నుంచి రిసెప్షన్ దాకా ప్రతి వేడుకలోనూ సంప్రదాయబద్ధంగా సందడి చేసిన ఈ లవ్లీ కపుల్‌కి సంబంధించిన ఫొటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక పెళ్లయ్యాక కొత్త ఇంట్లో కొత్త జీవితం ప్రారంభించిన ఈ జంట ఆ తర్వాత మధుర యాత్ర కోసం వెంటనే మాల్దీవులు చెక్కేసింది. అక్కడ తమ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారీ క్యూట్కపుల్. ఇక వివిధ సందర్భాల్లో తమ ప్రేమకథ గురించి చెప్పుకొచ్చిన కాజల్-గౌతమ్ తాజాగా తమ రిలేషన్షిప్, వివాహానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘అలా ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటా’ అన్నా!
‘నాకు లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. అందరి అమ్మాయిల్లాగే నేనూ నా కలల రాకుమారుడితో మోకాలిపై నిల్చొని ప్రపోజ్ చేయించుకోవాలనుకున్నాను. ఆ తర్వాతనే పెళ్లి చేసుకుందామనుకున్నాను. కానీ మా పెళ్లి విషయం గురించి ముందుగానే నా తల్లిదండ్రులతో మాట్లాడాడు గౌతమ్. మా వివాహానికి మా తల్లిదండ్రులు అంగీకరిస్తారని నేను ముందే వూహించాను. కాబట్టి అది పెద్ద సర్ప్రైజింగ్గా అనిపించలేదు. కానీ పెళ్లికి ముందు అతనికి ఓ కండిషన్ పెట్టాను. మోకాలిపై నిల్చొని ప్రపోజ్ చేయనంత వరకు పెళ్లి చేసుకోనని చెప్పాను (సరదాగా). అయితే నేను కోరుకున్న విధంగానే గౌతమ్ తన ప్రేమను వ్యక్తపరిచాడు. అందుకే అతనితో కలిసి ఏడడుగులు నడిచాను’.. అని చెప్పుకొచ్చింది కాజల్.
దీనికి బదులిచ్చిన గౌతమ్ ‘సినిమాల్లో మాదిరిగా నేను అలా ప్రపోజ్ చేస్తే కొంచెం నాటకీయంగా ఉంటుందేమోనని భావించాను. కానీ కచ్చితంగా మోకాలిపై నిల్చోవాలని కాజల్ కండిషన్ పెట్టింది. అందుకే చేయక తప్పలేదు’ అని చెప్పుకొచ్చాడు.
మా ఆయన దానిపై ప్రేమను వదులుకోవాలి!
తనలాగా తన భర్తకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదంటోంది కాజల్. ‘ నేను చాలా విషయాలను సినిమాటిక్ గా ఆలోచిస్తాను. కానీ గౌతమ్‌కు ఇలాంటి వాటిపై ఆసక్తి ఉండదు. సినిమాలు కూడా అసలు చూడడు. నేనే బలవంతంగా స్ర్కీన్ ముందు కూర్చోబెడుతుంటాను. ఇప్పటివరకు నేను కలుసుకున్న ‘ది మోస్ట్ నాన్ ఫిల్మీ పర్సన్’ మా ఆయనే. ఇక గౌతమ్‌తో తొలిసారి ముంబయిలోని ఎన్సీపీఏ కేఫ్‌కు డేట్‌కు వెళ్లాను. అక్కడ లంచ్ చేశాం. అయితే అక్కడ మా మధ్య సంభాషణ ఓ ఇంటర్వ్యూలా జరిగింది (నవ్వుతూ). కానీ ఆ క్షణాలు చాలా సరదాగా గడిచిపోయాయి’.. అని చెప్పింది కాజల్.
ఈ సందర్భంగా మీ భర్తలో మీకు నచ్చే మూడు సుగుణాలేంటో చెప్పమని అడగ్గా- ‘గౌతమ్ చాలా నమ్మదగిన వ్యక్తి. చాలా కష్టపడతాడు. తనకిష్టమైన వారి పట్ల అమితమైన కేరింగ్ తీసుకుంటాడు’ అంది చందమామ. ఇక కాజల్‌ది చాలా ఉదార స్వభావమని, తన కష్టపడే తత్వం, పట్టుదల తనతో పాటు ఎవరికైనా నచ్చుతాయన్నాడు గౌతమ్. అయితే తను ఎక్కువగా కొబ్బరి నూనె ఉపయోగిస్తుందని, ఆ వాసన తనకు అసలు పడదన్నాడీ హ్యాండ్సమ్ హజ్బెండ్. ఈ క్రమంలో గౌతమ్ ఎక్కువగా ఫోన్లోనే మునిగి తేలుతుంటాడని, పైగా ఇటీవల కొత్త ఫోన్ కూడా కొన్నాడని, దానిపై ప్రేమను వదులుకోవాలని సరదాగా చెప్పుకొచ్చింది కాజల్.
పెళ్లితో బాధ్యతలు పెరిగాయి!
ఈ సందర్భంగా పెళ్లి తన జీవితంలో కొత్త బాధ్యతలు తీసుకొచ్చిందంటోంది కాజల్. ‘జీవితంలో ఏదైనా మార్పు రావాలంటే 21 రోజులు చాలా తక్కువ సమయం. కానీ కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే మా ఇద్దరిలో చాలా మార్పులొచ్చాయి. ఏ ఇద్దరి మధ్య అయినా సరే ఒక బంధం నిలబడాలంటే- ప్రేమ, గౌరవం, కేరింగ్ తప్పనిసరిగా ఉండాలి. అదృష్టవశాత్తూ మా పరిచయం మొదలైనప్పటి నుంచి ఇవి మా మధ్యన ఉంటున్నాయి. అయితే పెళ్లయిన తర్వాత ఒకరి పట్ల ఒకరికి మరింత బాధ్యత పెరిగిందని అనిపిస్తోంది. ఈ క్రమంలో నేను ఎక్కడికి వెళ్లినా నిరంతరం నా క్షేమ సమాచారాల గురించి ఫోన్లో వాకబు చేస్తుంటాడు గౌతమ్. సమయానికి తిన్నావా? ఆ రోజెలా గడిచింది? అని ప్రతిరోజూ బాధ్యతగా అడుగుతుంటాడు. నేను కూడా గౌతమ్‌కు ఇష్టమైన వంటకాలను చేసి పెడుతున్నాను. ఆయనకు తగినంత విశ్రాంతి దొరుకుతోందో?లేదో? అని రోజూ ఆరా తీస్తాను. ఇలా రోజువారీ సంభాషణలే మా రిలేషన్‌షిప్‌ను మరింత ముందుకు తీసుకెళతాయి’ అని ఈ సందర్భంగా తెలిపిందీ అందాల తార.