'ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ.. నాతిచరామి..' అంటూ వధూవరుల్ని ఒక్కటి చేసే అత్యద్భుతమైన ఘట్టమే వివాహం. ఇలా అందరి ముందు చేసిన బాసలు కలకాలం నిలుపుకోవాలంటే దంపతుల మధ్య అన్ని అంశాల్లోనూ సమన్వయం చాలా ముఖ్యం. ఇందుకోసం మామూలు రోజుల్లో ఒకరితో ఒకరు ప్రేమగా మసలుకోవడమే కాదు.. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ మీ ప్రేమకు కాస్త కొత్తదనం జోడించి సరికొత్తగా సెలబ్రేట్ చేసుకుంటే అవి మీ ఇద్దరికీ మరపురాని మధురానుభూతులుగా మిగిలిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం కూడా మరింత బలపడే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి మీ పెళ్లిరోజు కోసం మీరూ ఇలా ప్లాన్ చేసి చూడండి...
ముందు నుంచే..
చాలామంది పెళ్లిరోజు కోసం ముందు నుంచే రకరకాల ప్రణాళికలు వేసుకుంటుంటారు. కేవలం షాపింగే కాదు.. వివిధ ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేసుకోవడం, అక్కడ సెలబ్రేషన్స్, లేదంటే ఇంట్లోనే బంధువుల సమక్షంలో వేడుకలు జరుపుకోవడం.. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వారు ముందు నుంచే ఒక కచ్చితమైన ప్రణాళిక వేసుకోవడం అవసరమే. తద్వారా ఆ సమయంలో కంగారుపడకుండా ఉండడంతో పాటు ప్రణాళిక ప్రకారం అన్నీ కరక్ట్‌గా జరుగుతాయి కాబట్టి ఆ జ్ఞాపకాలన్నీ జీవితాంతం గుర్తుండిపోతాయి.

గుర్తు చేసుకోండి..
'అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో.. తడబడితే, పొరబడితే తప్పు దిద్దుకో' అని ఓ సినీకవి చెప్పినట్లుగా ప్రతి జంటా పెళ్లిలో పెద్దల సమక్షంలో చేసుకున్న బాసలు గుర్తుచేసుకుని, వాటిలో తడబాటేమైనా ఉంటే సరిచేసుకుని ముందుకు సాగితే ఆ బంధం మరింతగా దృఢమవుతుంది. అలాంటివన్నీ గుర్తుచేసుకోవడానికి పెళ్లిరోజును మించిన సందర్భం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఆ రోజంతా ఇద్దరూ కలిసి చాలా సమయం గడుపుతారు కాబట్టి ఇద్దరూ పెళ్లిలో చేసిన ప్రమాణాలను మరొక్కసారి నెమరువేసుకోవచ్చు. అయితే కేవలం వీటిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు.. అవి పాటించే క్రమంలో ఇద్దరూ ఏమైనా పొరపాట్లు చేస్తూ ఉంటే వాటిని సరిదిద్దుకోవడం, మరికొన్ని నూతన ప్రమాణాలు చేసుకోవడం, కొత్త లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని అనుకున్నట్లుగా అమలు చేయడం వంటివి చేస్తే ఇద్దరి మధ్య అనుబంధం రెట్టింపవడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలు కూడా సులభంగా నెరవేరతాయి.
ఇచ్చిపుచ్చుకోండి..
'పెళ్లిరోజు' కూడా దాంపత్య బంధంలో వచ్చే ఒక ముఖ్యమైన పండగలాంటిదే. కాబట్టి దీన్ని ఎంత సర్ప్రైజింగ్గా, సరదాగా జరుపుకొంటే ఇద్దరి మనసుల్లో అన్ని మధురమైన జ్ఞాపకాలు నిలిచిపోతాయి. ఇందుకోసం అభిరుచులను బట్టి ఒకరికి ఇష్టమైన వస్తువులు మరొకరు కొని వాటిని ఇచ్చిపుచ్చుకోవడం, ఇష్టమైన వంటకాలు చేయడం, మీ భాగస్వామి కోసం తనకు ఇష్టంలేని అలవాట్లను వదులుకోవడం.. వంటివి చేస్తే ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమ, అభిమానం రెట్టింపవుతాయి. అలాగే ఆయా సందర్భాలు వారికి జీవితాంతం మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి.

సహాయం చేయండి..
కొంతమంది దంపతులకు సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉంటుంది. అలాంటి మంచి పనులకు పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాలు ఎంచుకుంటే ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో భాగంగా ఈ రోజున అనాథాశ్రమాలకు విరాళాలు ఇవ్వడం, ఆ పిల్లలతో కాసేపు గడపడం, వృద్ధాశ్రమాలకు వెళ్లడం, వారి ఆశీర్వాదాలు తీసుకోవడం, పేదలకు అన్నదానం చేయడం.. వంటి కార్యక్రమాలు చేయచ్చు. దీనివల్ల మనం కొంతమందికి సహాయపడినట్లుగా కూడా ఉంటుంది. ఇలా వారితో గడిపిన క్షణాలన్నీ మధురానుభూతులుగా ఉండిపోతాయి.
ఫొటోల్లో బంధించండి..
ఫొటోలు ఏ సందర్భమైనా కలకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి. అందుకే పెళ్లిలో జరిగే ప్రతి వేడుకను ఫొటోలు, వీడియోల రూపంలో బంధిస్తుంటారు. అలాగే పెళ్లిరోజు మీరు గడిపే మధురక్షణాలను కూడా ఫొటోలు, వీడియోల్లో భద్రపరిస్తే కలకాలం అవి గుర్తుండిపోతాయి.