Photo: Instagram
‘ప్రేమకు వయసు, అందచందాలు, అంతస్తులతో సంబంధం లేదు... అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి మీద పుడుతుందో ఎవరూ చెప్పలేరు’.. సినిమాల్లో ఎక్కువగా వినిపించే ఈ డైలాగ్ నిజ జీవితంలోనూ చాలామంది విషయంలో నిరూపితమైంది. అలాంటి వారిలో బాలీవుడ్ లవ్లీ కపుల్ సుస్మితా సేన్-రోమన్ షాల్ జంట కూడా ఒకటి. గత కొంత కాలంగా డేటింగ్లో ఉన్న ఈ ప్రేమ పక్షుల వయసుల మధ్య సుమారు 15 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే ఇటీవల 45వ వసంతంలోకి అడుగుపెట్టింది సుస్మిత. ఈ సందర్భంగా తన ప్రియుడితో తనకున్న ప్రేమబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్ చేసుకుంది.
సుస్మితా సేన్.. విశ్వసుందరిగా, నటిగా, మోడల్‌గా ఎందరికో సుపరిచితురాలైన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘రక్షకుడు’ సినిమాతో ‘సోనియా’గా టాలీవుడ్‌ను పలకరించిన ఈ బాలీవుడ్ బేబ్.. తమిళం, బెంగాలీ సినిమాల్లో సైతం నటించి మెప్పించింది. ప్రస్తుతం 45 ఏళ్ల వయసున్న సుస్మిత తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోమన్ షాల్‌తో గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దుస్తుల్ని ప్రదర్శిస్తూ మోడల్‌గా తనని తాను నిరూపించుకుంటోన్న ఈ మిస్టర్ హ్యాండ్సమ్.. కొన్నేళ్ల క్రితం ఓ ఫ్యాషన్ షోలో సుస్మితతో కలిసి ర్యాంప్‌వాక్ చేశాడు. ఆ సమయంలో వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా చిగురించింది. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ సాక్షిగా తాము ప్రేమించుకుంటున్నట్లు అందరికీ చెప్పిన ఈ ప్రేమ జంట.. అప్పట్నుంచి చెట్టపట్టాలేసుకునే కెమెరా ముందు ప్రత్యక్షమవుతున్నారు. ఎక్కడికెళ్లినా జంటగా వెళ్తూ తమ ప్రేమానురాగాల్ని పంచుకుంటున్నారు. కలిసి వ్యాయామాలు చేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ జంటలకు రిలేషన్షిప్ పాఠాలతో పాటు ఫిట్నెస్ పాఠాలు కూడా నేర్పుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చిన సుస్మిత.. తాజాగా మరోసారి రోమన్‌తో పరిచయం, అతనితో తనకున్న అనురాగాన్ని అందరితో పంచుకుంది.
అలా పరిచయమయ్యాడు!
‘నేను, రోమన్ సోషల్ మీడియా వేదికగా పరిచయమయ్యాం. కొన్నేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అతను ఓ పర్సనల్ మెసేజ్ పెట్టాడు. నేను కూడా రిప్లై ఇచ్చాను. ఆ తర్వాత రోజూ మేం సందేశాలు పంపుకోవడం ప్రారంభించాం. అలా మొదట మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. కొంతకాలానికి రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టాం. అయితే మనం కోరుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయని నేను అసలు నమ్మను. మనకి ఏం జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని భావిస్తాను. అలాగే వయసులో నాకంటే 15 ఏళ్లు చిన్నవాడిని ప్రేమిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఏదేమైనా మా బంధంతో మేం చాలా సంతోషంగా ఉన్నాం. నేను, నా ఇద్దరు పిల్లలు, రోమన్ ఓ కుటుంబంలా మారిపోయింది. అయితే మహిళకు ఓ తోడు అవసరమని, ఒకరి సావాసం కోరుకునేంత రొమాంటిక్ కాదు నేను. జీవితంలో ఎప్పుడూ అలా ఆలోచించలేదు. రోమన్‌ను నాకు పరిచయం చేసినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. ఎందుకంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తులే కలిసి ఉండగలరు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని..’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ క్వీన్.
వాటి కోసం పెద్దగా ఖర్చు పెట్టను!
బాలీవుడ్‌కు సంబంధించి ఫిట్నెస్తో పాటు ఫ్యాషన్‌కు ప్రాధాన్యమిచ్చే తారల్లో సుస్మిత కూడా ఒకరు. ఈ సందర్భంగా ఫ్యాషనబుల్ దుస్తుల విషయంలో సౌకర్యానికే తన మొదటి ప్రాధాన్యమంటోందీ ముద్దుగుమ్మ. ‘దుస్తులు, షూస్ విషయంలో నా సౌకర్యానికే ప్రాధాన్యమిస్తాను. ఫ్యాషన్ పరంగా నేను ప్రతిసారీ ప్రశంసలు అందుకోకపోవచ్చు.. కానీ నా పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. అంతేకాకుండా దుస్తులు, షూస్ తరచూ రిపీట్ చేస్తుంటాను. కేవలం ఫొటోల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి ఫ్యాషన్‌ని ఫాలో అవ్వడం నాకు అస్సలు నచ్చదు’ అని అంటోందీ అందాల తార.
రెనీని చూస్తుంటే గర్వంగా ఉంది!
గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న సుస్మిత ఇటీవల ‘ఆర్య’ అనే వెబ్‌సిరీస్‌తో మళ్లీ తెరపై దర్శనమిచ్చింది. హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సిరీస్ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఇక అమ్మ బాటలోనే అడుగులేస్తూ ఆమె దత్త పుత్రిక రెనీ కూడా నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. ఈక్రమంలో ‘సుత్తాబాజీ’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో ఆమె బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా సుస్మితా సేన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ సందర్భంగా తన కూతురు నటించిన సినిమా ట్రైలర్‌ను ఇన్‌స్టా వేదికగా అందరితో షేర్ చేసుకుంటూ ‘నా పుట్టిన రోజు నాడు నా కూతురు నుంచి అందుకున్న బెస్ట్ గిఫ్ట్ ఇదే. నటిగా తనను తెరపై చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తన కలను నెరవేర్చుకునే క్రమంలో ధైర్యంగా అడుగులేస్తోన్న రెనీకి అంతా మంచి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటిఫుల్ మామ్.