నిశ్చితార్థం.. అతి త్వరలో జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది... మీ కలల రాకుమారుడితో కలిసి నడవబోయే సమయం ఆసన్నమైందని చెప్పే వేడుక. ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఒక్కరికీ పెళ్లి గురించిన ఆలోచనలతో నిద్ర కరవవుతుందంటే అతిశయోక్తి కాదు. నిశ్చితార్థం జరుపుకొన్న జంట మూడుముళ్లు పడే ఆ అపురూపమైన క్షణం కోసం ఎదురుచూస్తుంటారు. అంతవరకు ఇద్దరూ ఫోన్లోనే ఎన్నెన్నో కబుర్లు చెప్పుకొంటూ సమయం గడుపుతుంటారు. తమ భవిష్యత్తుకి సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటుంటారు. అప్పుడప్పుడూ అలా సరదాగా షికార్లకు కూడా వెళుతుంటారు. ఇదిగో ఇలా పెళ్లికి ముందు సరదాగా గడిపే ఈ కాస్త సమయమే ఆ తర్వాతి జీవితానికి పునాదిగా మారుతుందంటే మీరు నమ్ముతారా? పెళ్లికి ముందు గడిపే సమయం చాలా అమూల్యమైనది. ఆ సమయంలో చెప్పుకొన్న వూసులు, తిరిగిన ప్రదేశాలు ఆ తర్వాత గుర్తు చేసుకొని మురిసిపోయే జంటలెన్నో..! అయితే ఈ సమయాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా గడపడంతో పాటు మీ బంధం మరింత దృఢమయ్యేలా ఏం చేయాలో తెలుసుకొందామా...

వీలైనంత ఎక్కువ సమయం..
నిశ్చితార్థం తర్వాత షాపింగ్, పెళ్లి పనులు అంటూ క్షణం తీరిక లేకుండా సమయం గడపడాల్సి వస్తుంది. అయితే ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఒకరికోసం మరొకరు సమయాన్ని కేటాయించడం మర్చిపోవద్దు. వీలైనంత ఎక్కువగా ఫోన్లో మాట్లాడుకోవడం, తరచుగా కలుసుకోవడం చేస్తుండాలి. దీనివల్ల ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది. అలాగే ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి పంచుకోవాలి. ఫలితంగా వారి మనసును గుర్తెరిగి నడుచుకోవడం, వారికి నచ్చే పనులు చేయడం లాంటివి అలవాటవుతాయి. ఇద్దరి మధ్య ఉన్న దూరం కొద్దికొద్దిగా కనుమరుగువుతూ వస్తుంది. అలాగే వారు చేసిన మంచి పనులు చిన్నవే అయినా ప్రశంసించడం అలవాటు చేసుకోవాలి. తద్వారా ఎదుటివారి మనసులో మీకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇలా ఏ ఒక్కరో చేయడం కాకుండా ఇద్దరూ అలవాటు చేసుకోవాలి. దీంతో పాటు మీ పెళ్లి, హనీమూన్ కోసం ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకోవడం ద్వారా ఇద్దరూ మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.

భవిష్యత్తు ప్రణాళికలతో..
పెళ్లి కాబోయే ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తుకి సంబంధించి కొన్ని ఆలోచనలుంటాయి. కొంతమంది వివాహమైన వెంటనే పిల్లలు కావాలనుకుంటే.. మరికొందరు కొన్ని రోజులు ఆగాలనుకుంటారు. కొందరు సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడితే.. మరికొందరు భవిష్యత్తు కోసం కొంత మొత్తం వెనకేసుకోవాలనుకొంటారు. ఇలాంటి ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. అప్పుడే ఇద్దరి అభిప్రాయాలకనుగుణంగా అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. ఈ క్రమంలో ఆలోచనలు కలవకపోతే గొడవ పెట్టుకోవడం కాకుండా మీరు చెబుతున్న విషయం ఎందుకు సరైందో అర్థమయ్యేలా వివరించాలి. అలాగే మీకు కాబోయే జీవితభాగస్వామి చెబుతున్న అంశాలను సైతం ఓపికగా వినాలి. తద్వారా ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి భవిష్యత్తుపై స్పష్టత ఏర్పడుతుంది. దానికనుగుణంగా ముందుకెళ్లడం ద్వారా వైవాహిక జీవితంలోకి ఆనందంగా అడుగుపెట్టవచ్చు.

స్నేహితులతో కలుపుకోండి..
అమ్మాయైనా.. అబ్బాయైనా.. స్నేహితుల బృందం కచ్చితంగా ఉంటుంది. పెళ్లి ముందు వరకు ఎక్కువగా స్నేహితులతో గడిపినవారు ఆ తర్వాత జీవిత భాగస్వామితోనే గడుపుతుంటారు. అలాంటి సందర్భాల్లో పెళ్లి తర్వాత ఫ్రెండ్స్‌ని మిస్సవుతున్నామనే భావన కొందరిలో ఉంటుంది. ఇంకొన్ని జంటల్లో ఒకరి స్నేహితులపై మరొకరికి సదభిప్రాయం ఉండదు. ఫలితంగా కొన్ని మనస్పర్థలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండాలంటే మీ బృందంలోకి మీకు కాబోయే భాగస్వామిని కూడా ఆహ్వానించండి. సరదాగా అందరితో కలిసి టూర్ ప్లాన్ చేయండి. ఇలా కాబోయే భర్త స్నేహితులతో భార్య, భార్యామణి ఫ్రెండ్స్‌తో భర్త చెలిమి చేస్తే ఒకరి గురించి మరొకరికి బాగా అర్థం అవుతుంది. ఫలితంగా మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. అయితే ప్రస్తుతం కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండడం.. కనీస జాగ్రత్తలు పాటించడం మాత్రం మర్చిపోవద్దు.

సర్ప్రైజ్ చేయండి..
సర్ప్రైజ్లంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి..? మరి, మీకు కాబోయే భాగస్వామిని కూడా ఇలా ఏదో ఒక సర్ప్రైజ్ ఇచ్చి ఆనందపరిస్తే..? ఆ క్షణం వారికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోదూ..! ఎలాగూ మీరు వివాహం చేసుకోబోయే వారి ఇష్టాయిష్టాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి వారి మనసుకి నచ్చే వస్తువుని సర్ప్రైజ్ గిఫ్ట్‌గా అందించండి. అది వారి కళ్లలో వెలుగు నింపడం మాత్రమే కాదు.. వారి మనసుని గుర్తించిన మీకు జీవితంలో మరింత ప్రాధాన్యం కల్పించేలా చేస్తుంది. అలాగే పెళ్లికి ముందు మీరిచ్చిన బహుమతులన్నీ వారు ఎంతో అమూల్యంగా దాచిపెట్టుకుంటారు. మీరు ఇచ్చే సర్ప్రైజ్ కచ్చితంగా ఏదో వస్తువే అయి ఉండాలనే నియమేం లేదు. వారికి నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లడం, ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టడం, తన ఆత్మీయులను పిలిచి పార్టీ ఇవ్వడం వంటివన్నీ వారి మనసులో మీ స్థానాన్ని మరింత పదిలపరిచేవే.
పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి సమయాన్ని ఆనందంగా గడిపి అపురూపమైన అనుభూతులు మూటగట్టుకోవడంతో పాటు.. ఇద్దరి మధ్య బంధం బలపడాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు కదా..! మీరు కూడా వీటిని పాటించి అందమైన జీవితానికి పూలబాట పరుచుకోండి..!