Image for Representation
కంటికి కనిపించకుండానే మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది కరోనా. మధ్యలో కొంచెం కనికరించినా మళ్లీ సెకండ్ వేవ్ అంటూ పలు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో ఈ వైరస్ నుంచి మానవ జాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు. ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు ప్రయోగాల్లో ఉండగా ఫైజర్-బయోఎన్‌టెక్ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. దీంతో అందరిలో ఆశలు రేకెత్తిస్తోందీ వ్యాక్సిన్. అయితే ఈ టీకా తయారీ వెనక ఓ జంట అలుపెరగని కృషి ఉంది.
ఆ దంపతుల కృషితోనే...
కరోనాపై పోరులో భాగంగా అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా చేస్తున్న పరిశోధనలు ప్రపంచ మానవాళికి సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ‘BNT162b2’ పేరుతో ఈ రెండు కంపెనీలు రూపొందించిన టీకా 90 శాతం మేర సమర్థంగా పని చేస్తోందని తెలిసింది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను త్వరలో అమెరికా అంతటా అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థలు ప్రకటించాయి. ఈ వ్యాక్సిన్‌ను దక్కించుకోవడంలో బ్రిటన్ ముందుంటుందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆ దేశ ప్రజలకు హామీ కూడా ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో టర్కీకి చెందిన డాక్టర్ ఓజ్లెమ్ ట్యూరెసి, డాక్టర్ ఉగర్ సాహిన్ అనే దంపతులు ఈ టీకా తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైద్య పరిశోధనల పట్ల ఎంతో అంకితభావం ఉన్న ఈ భార్యాభర్తల కృషి కారణంగానే ఈ వైరస్‌కు విరుగుడు తయారైంది.
ఆ స్నేహం పెళ్లి పీటలెక్కింది!
ప్రస్తుతం బయోఎన్‌టెక్ కంపెనీకి సీఎంవో (ఛీఫ్ మెడికల్ ఆఫీసర్)గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు డాక్టర్ ఓజ్లెమ్ ట్యూరెసి. ఆమె భర్త ఉగర్ సాహిన్ సీఈవోగా ఉంటున్నారు. వీరిద్దరూ టర్కీకి చెందిన వారే. వైద్య పరిశోధనల పట్ల ఉన్న మక్కువతోనే వీరిద్దరూ ఒక్కటై పెళ్లి చేసుకున్నారు. టర్కీలో పుట్టి పెరిగిన సాహిన్ జర్మనీలో పెరిగారు. ఆయన తల్లిదండ్రులు ఫోర్డ్ కార్ల పరిశ్రమలో ఉద్యోగులవడంతో అక్కడే మెడిసిన్ పూర్తి చేశారు. అనంతరం వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అప్పుడే ఎం.డీ. (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) కోర్సు చదువుతున్న ట్యూరెసి ఆయనకు పరిచయం అయ్యారు. ఆమెది కూడా టర్కీనే. కానీ ఆమె తల్లిదండ్రులు కూడా జర్మనీకి వలస వచ్చారు. ఇద్దరూ వైద్యులు కావడంతో ట్యూరెసి, సాహిన్లు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారి పెళ్లిపీటల వరకు వెళ్లింది.
పెళ్లి చేసుకుని ల్యాబ్ కి వెళ్లారు!
వైద్య పరిశోధనలంటే ఎంతో ఆసక్తి చూపుతారు ట్యూరెసి-సాహిన్. దీంతో తమ పెళ్లి రోజును కూడా ల్యాబ్‌లోనే పరిశోధనల మధ్య సెలబ్రేట్ చేసుకునే వాళ్లమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ట్యూరెసి. చివరికి పెళ్లి నాడు కూడా పెళ్లి తంతు ముగియగానే సరాసరి ల్యాబ్ కి వెళ్లి పరిశోధనల్లో మునిగిపోయారట ఈ దంపతులు! అంటే పరిశోధనల పట్ల వీళ్లిద్దరికీ ఎంత ఆసక్తో అర్ధం చేసుకోవచ్చు. 2001 నాటికి ప్రముఖ ఫిజీషియన్లుగా పేరుపొందిన ఈ లవ్లీ కపుల్ ఆ ఏడాది ‘గెనిమెడ్ ఫార్మాస్యూటికల్స్’ అనే కంపెనీని స్థాపించారు. మనుషుల్లో క్యాన్సర్‌ను ఎదుర్కొనే యాంటీబాడీస్‌ను అభివృద్ధి చేయడం కోసం ఈ సంస్థను ప్రారంభించారు. ఛీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్‌గా వ్యవహరించిన ట్యూరెసి 2008లో కంపెనీ సీఈవోగా పగ్గాలు స్వీకరించారు. అదే సమయంలో అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ ఇమ్యునోథెరపీకి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇక క్యాన్సర్‌పై తదుపరి పరిశోధనల కోసం ట్యూరెసి దంపతులు 2008లో ‘బయో ఎన్‌టెక్’ పేరుతో మరో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి క్లినికల్ అండ్ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గా వ్యవహరించిన ట్యూరెసి 2018లో కంపెనీ సీఎంవోగా కీలక బాధ్యతలు స్వీకరించారు. వీరి పరిశోధనలను మెచ్చుకున్న అపర కుబేరుడు బిల్‌గేట్స్‌కు చెందిన ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ ఈ సంస్థలో 55 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడం విశేషం.
సైకిల్ పైనే..!
జర్మనీ శ్రీమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించారు ఈ దంపతులు. అయినా సరే ఎలాంటి భేషజాలూ లేకుండా చాలా నిరాడంబరంగా జీవించడం వీరికే చెల్లింది. అంతటి శ్రీమంతులైనా సరే ఇప్పటివరకూ ఒక్క కారు కూడా కొనుక్కోలేదట. ఒక చిన్న అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఇప్పటికీ సైకిల్ పైనే ఆఫీసుకి వస్తారంటే వాళ్ల సింప్లిసిటీ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
అందుకే ముందుగా బ్రిటన్‌కే!
కరోనాపై పోరులో భాగంగా ఈ ఏడాది మార్చిలో అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీతో ట్యూరెసి-సాహిన్ దంపతులు చేతులు కలిపారు. అప్పటి నుంచి రాత్రి, పగలు అనే తేడా లేకుండా కరోనా వ్యాక్సిన్ కోసం కృషి చేశారు. జులై 27న మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు చేరుకున్న ఈ వ్యాక్సిన్ 90 శాతం మేరకు సమర్థంగా పనిచేస్తుందని తాజాగా ఆ కంపెనీలు స్పష్టం చేశాయి. ట్యూరెసి, సాహిన్ దంపతులే ఈ వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. కానీ బ్రిటన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఫైజర్, బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఒక కోటి డోస్‌లను ముందుగా బ్రిటన్‌కు అందజేయాల్సి ఉంది. అందుకే వ్యాక్సిన్ ప్రకటన రాగానే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ టీకా వచ్చేస్తోందని తమ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.