మేడం.. నా వయసు 30సం||. నాది చాలా మెతక స్వభావం. నలుగురితోనూ కలవాలంటే చాలా సిగ్గు, భయం. అమ్మానాన్న నాకు చాలా సంబంధాలు చూశారు. కానీ నా స్వభావం కారణంగా నన్ను చేసుకోవడానికి మంచి సంబంధాల వాళ్లు ఎవరూ తొందరగా ముందుకు రాలేదు. ఆ తర్వాత 2015లో నాకు ఒక సంబంధం కుదిరింది. వాళ్లు నన్ను చేసుకుంటానని వెంట పడడంతో మంచి సంబంధమని చేసుకున్నాం. కానీ పెళ్లయ్యాక కూడా నా మెతక స్వభావం కారణంగా అత్తారింట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. మా అత్తగారు చాలా డామినేటింగ్‌గా ఉండేవారు. ఆయన, అత్తయ్య.. ఏం చెబితే అది చేసేదాన్ని. భయం కారణంగా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కనీసం నా భర్తకు దగ్గరయ్యేందుకు కూడా సిగ్గు, భయం ఉండేవి. ఈ పద్ధతి మా అత్తగారు వాళ్లకి నచ్చలేదు. నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు.
ఈ విషయం నేను ముందే గ్రహించినా ఏమీ చేయలేకపోయా. ఆ తర్వాత మా అత్తగారు ఆషాఢమాసం అని పుట్టింటికి పంపించి మళ్లీ తీసుకెళ్లలేదు. విడాకులు కావాలని కోరారు. జాతకాలు కుదరలేదు, కలిసి ఉండలేము.. అంటూ రకరకాల కారణాలు చెప్పారు. వారికి మా అమ్మానాన్న సర్దిచెప్పేందుకు చాలా ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. దాంతో న్యాయస్థానం ద్వారా మేమిద్దరం విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు మా ఇంట్లో నాకు మళ్లీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ నా మెతక స్వభావం కారణంగా నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది. సంసారం చక్కదిద్దుకునే తెలివి నాకు లేదనిపిస్తోంది. ఇతరులకి చాలా తొందరగా లొంగిపోయే నా స్వభావం కారణంగా నన్ను ఒక కీలుబొమ్మలా ఆడిస్తారేమో అని చాలా ఆందోళనగా ఉంది. దురదృష్టవశాత్తు నాకు వచ్చే సంబంధాలన్నీ బాగా డామినేటింగ్‌గా ఉన్నవే వస్తున్నాయి. ఈ విషయంలో మా అమ్మానాన్న కూడా భయపడుతున్నారు. మరి, ఈ మెతక స్వభావం పోయి, అందరిలాగే నేనూ ధైర్యంగా పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి??
- ఓ సోదరి
మీ ఆలోచనల్లో ఉన్న స్పష్టత మీరు మీ సమస్య చెప్పిన విధానంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మీ సమస్య ఏంటో మీకు స్పష్టంగా తెలుసు. మీరు మెతక స్వభావం అని అనుకుంటున్న దాని వెనుక గల కారణాలను ముందుగా విశ్లేషించుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న అభద్రతలు ఏంటి? మీరు అవతలివారికి లొంగిపోవడం లేదా డామినేటింగ్‌గా ఉండలేకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి యత్నించండి. అందరితోనూ మీది మెతక స్వభావం అని పిలిపించుకోవడం లేదా చెప్పించుకోవడం మీకు ఏ రకమైన ప్రయోజనాలను ఇచ్చింది? ఎప్పుడైనా దాని వల్ల మీకు ఎలాంటి లాభాలైనా కలిగాయా? అలా లాభాలు రావడం వల్ల మీరు దానిని కొనసాగిస్తూ వచ్చారా? అలాగే ఇంట్లో కూడా మీది మెతక స్వభావం అంటూ మీ తరఫున మిగతావాళ్లు నిర్ణయాలు తీసుకోవడం, మీ కోసం మిగతావాళ్లు అన్నీ చేయడం.. వంటివి చేస్తున్నారా?? ఇలాంటివి చేయడం వల్ల అది మీకు ఒక అలవాటు కింద మారిందా?? ఒకవేళ అది అలవాటుగా మారితే దానిని మార్చుకునే ప్రయత్నం చేయచ్చు. అయితే ఈ క్రమంలో మీకు మానసిక నిపుణుల సహాయం అవసరం.
ఎందుకు మీరు అనేక విషయాల్లో మాట్లాడలేకపోతున్నారు?? చక్కని ఆలోచన, స్పష్టత.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఎందుకు మీరు వాటిని వ్యక్తీకరించలేకపోతున్నారు?? వంటి విషయాల గురించి ముందుగా మీకు మీరు విశ్లేషణాత్మకంగా ఆలోచించుకోండి. ఆలోచనల్లో స్పష్టత లేకపోయినా లేదా తెలియకపోయినా.. ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ మీకు సమస్యపై చక్కని స్పష్టత ఉంది. అలాగే చక్కని ఆలోచనా తీరు కూడా ఉంది. అన్నీ తెలిసి కూడా మీరు ఏమీ చేయలేకపోతున్నారంటే దానికి తగ్గ ప్రయత్నాలు ఏ రకంగా చేయాలో ఆలోచించండి. అలాగే వాళ్ల ఇష్టానికి అనుగుణంగా విడాకుల వరకు వెళ్లిపోవడం కూడా కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. అయితే ఆ బంధం ముగిసిపోయింది కాబట్టి దాని గురించి ఇక చర్చ అనవసరం. మీకు కావాల్సిన విధంగా జీవితాన్ని నడుపుకోవాలంటే మీ కాళ్లపై మీరు నిలబడాలి. స్వయంకృషితో మిమ్మల్ని మీరు దిద్దుకునే ప్రయత్నం చేయాలి. దాని కోసం మీలో ఉన్న జీవన నైపుణ్యాలను వెలికి తీసి వాటిని మెరుగుపరుచుకోవడం మంచిది. దీనికి మీకు మానసిక నిపుణుల సహాయం అవసరం అవుతుంది. ఆత్మవిశ్వాసం, దృఢత్వం (ఎసర్టివ్నెస్) పెంచుకోవడం, మీ కాళ్లపై మీరు నిలబడడం ద్వారా మీ గౌరవాన్ని మీరు పెంచుకోవడం.. వంటివి చేయాలి. ఎప్పుడైతే మీకు మీరు గౌరవం ఇచ్చుకోవడం ప్రారంభిస్తారో, ఇతరులకు కూడా మీపై గౌరవం పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది.
డా|| పద్మజ
సైకాలజిస్ట్