'మేడమ్, కొంచెం నవ్వండి ప్లీజ్..'
'మీరిద్దరూ ఇంకాస్త దగ్గరగా జరగండి.. సర్.. మీరు మేడమ్ భుజాలపై చేతులు తీయకండి..'
'మీరు కదలకండి మేడమ్.. ఫొటో సరిగ్గా రావట్లేదు..'
అబ్బబ్బా.. ఈ గోలంతా ఏంటని అనుకుంటున్నారు కదూ.. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది కదా.. పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలు ఫొటోల మీద ఫొటోలు దిగడానికి సిద్ధమైపోతుంటారు. ఎందుకంటే పెళ్లిలో వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా!! పెళ్లి తంతును కవర్ చేయడం.. వధూవరులిద్దరినీ వేర్వేరు యాంగిల్స్‌లో ఫొటోల్లో బంధించడం.. ఇవన్నీ ఇప్పుడు ఫొటోషూట్ ప్యాకేజీలో భాగమే. ఈ క్రమంలో పెళ్లిలో వధూవరుల ఫొటోలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?
అనువైన ప్రదేశంలోనే..
ఎలాగో పెళ్లి ఆల్బమ్‌లో ఫొటోషాప్ ద్వారా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ పెడతాం కదా అని పెళ్లిలో ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు క్లిక్మనిపించేస్తారు కొందరు ఫొటోగ్రాఫర్లు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు తీస్తే ఆ ఫొటోకున్న అందం దెబ్బతింటుంది. అలాంటి వాటికి ఫొటోషాప్‌లో ఎంత అందమైన బ్యాక్‌గ్రౌండ్ పెట్టినా ఏదో లోపం కనిపిస్తుంటుంది. కాబట్టి ఫొటోగ్రాఫర్లు ఫొటోషూట్ కోసం ఎంచుకునే ప్రదేశం అటు వాళ్లకు.. ఇటు కొత్తజంటకు నచ్చేలా, సౌకర్యవంతంగా, అనువుగా ఉండేలా చూసుకుంటే ఫొటోలు సహజసిద్ధంగానే అందంగా రావడం ఖాయం. అలాగే మరో ముఖ్యమైన విషయమేంటంటే.. మీరు ఫొటోషూట్ కోసం ఎంచుకునే ప్రదేశంలో మంచి వెలుతురు, గాలి వచ్చేలా జాగ్రత్తపడాలి. లేదంటే చెమటలు పట్టి ఫొటోల్లో అంత బాగా పడకపోవచ్చు.

అతిగా మేకప్ వద్దు!
అసలే మ్యారేజ్ ఫొటోషూట్.. ఫొటోల్లో తెల్లగా కనిపించాలి.. అని ఎక్కువ మేకప్ వేసుకుంటే ఫొటోల్లో ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. అలాగని మరీ సాదాసీదాగా వేసుకోమని కాదు. మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ కాకుండా అవసరమైన మేరకే మేకప్ ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఐ-మేకప్‌ను మాత్రం మరువద్దు.. ఎందుకంటే ముఖంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కళ్లు. కాబట్టి వాటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం చాలా ముఖ్యం.
కంగారు వద్దు..!
కొంతమంది ఫొటోలు దిగేటప్పుడు బాగా వస్తుందో, రాదోనని తెగ కంగారు పడిపోతారు. ఈ కంగారే కొంప ముంచుతుంది. దీనివల్ల మీరు టెన్షన్ పడుతున్నట్లుగా ఫొటోలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే ఫొటోలకు ఇచ్చే ఫోజులు కూడా సహజంగా అనిపించవు. దీంతో మీరు ఎంత బాగా రడీ అయి ఫొటోకు ఫోజిచ్చినా వృథానే అవుతుంది. కాబట్టి ఫొటోలకు ఫోజిచ్చేటప్పుడు చాలా కూల్‌గా ఉండాలి. అలాగే వేడుక ఆద్యంతం నవ్వుతూ ఉండడం వల్ల ఫొటోలు మరింత సహజంగా వచ్చే అవకాశం ఉంటుంది.

అనుభవం చాలా ముఖ్యం..
అందరు ఫొటోగ్రాఫర్లకూ పెళ్లికి సంబంధించిన ఫొటోషూట్‌లో అనుభవం ఉంటుందనుకుంటే పొరపాటే. అందుకే పెళ్లి ఫొటోలు తీయడానికి బంధువులు లేదా స్నేహితులకు తెలిసిన మంచి అనుభవం ఉన్న ఫొటోగ్రాఫర్లను ఎంచుకోవాలి. వీలుంటే అంతకుముందు వారు తీసిన ఫొటోలను కూడా ఒకసారి పరిశీలించి.. అవి మీకు బాగా నచ్చితేనే ఫొటోషూట్ కోసం వాళ్లను ఎంపిక చేసుకోండి. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అదే ఫొటోగ్రాఫర్స్ కొత్తవాళ్లయితే.. మంచి గిరాకీ వచ్చిందని వాళ్ల అనుభవం గురించి తప్పుగా చెప్పి మనల్ని మోసగించే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా మసలుకోవడం మంచిది.
నమ్మకం ఉంచాలి..
మీరు ఫొటోషూట్ కోసం ఎంచుకున్న ఫొటోగ్రాఫర్‌పై పూర్తి విశ్వాసం ఉంచాలి. అలాకాకుండా 'ఫొటోగ్రాఫర్ అనుభవం చూసిన తర్వాత కూడా బాగా తీస్తారో? తీయరో? ఫొటోలు బాగా వస్తాయో? రావో?' ఇలాంటి సందేహాలు చాలామందిలో తలెత్తుతుంటాయి. అలా ఏదో ఆలోచిస్తూ, సందేహిస్తూ ఫొటోలకు ఫోజులిస్తే ఎంత అనుభవజ్ఞులైన ఫొటోగ్రాఫర్స్ ఫొటో తీసినా అందులో లుక్ ఉండదు. కాబట్టి ఫొటోగ్రాఫర్‌పై పూర్తి నమ్మకంతో, తను ఫొటోలు బాగా తీయగలడనే విశ్వాసంతో ఉంటేనే ఫొటోషూట్ అనుకున్నట్లుగా జరుగుతుంది. మంచి స్టిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది.

వాళ్లకే తెలుసు..!
పెళ్లిలో జరిగే ఫొటోషూట్‌లో భార్యాభర్తలిద్దరూ ఏయే యాంగిల్స్‌లో ఫొటోలు దిగితే బాగా వస్తాయో.. మీకంటే ఫొటోగ్రాఫర్లకే ఎక్కువగా తెలిసుంటుంది. ఎందుకంటే చాలా పెళ్లిళ్లలో ఫొటోలు తీసిన అనుభవం వాళ్లకుంటుంది. దీంతోపాటు మీ ముఖంలో ఉండే లోపాలను సవరించి ఫొటో వంద శాతం బాగా వచ్చేందుకే వాళ్లు ప్రయత్నిస్తారు. ఎందుకంటే పెళ్లి, పెళ్లి ఫొటోలు జీవితంలో మిగిలిపోయే మధుర జ్ఞాపకాలు. అలాగే ఈ తంతు వల్ల భార్యాభర్తల మధ్య సమన్వయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఫొటోలు తీసేటప్పుడు ఫొటోగ్రాఫర్లకు 'ఈ యాంగిల్స్ వద్దు.. ఇలా బాగోలేదు..' అంటూ ఎదురుచెప్పకుండా వాళ్లకు పూర్తి స్వేచ్ఛనివ్వండి.. మీరు కూడా ఫ్రీగా ఉండి.. సహజంగా ఫోజులివ్వండి.
సౌకర్యంగా ఉంటేనే..
అలాగే మరికొందరు ఫొటోగ్రాఫర్లు 'ఆ ఫోజు పెట్టండి.. ఈ ఫోజు పెట్టండి.. మేడం మీరు ఇలా నిల్చోండి.. సర్ మీరు మేడంని ఇక్కడ పట్టుకోండి.. అక్కడ పట్టుకోండి..' అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. వాళ్లకిష్టమున్న యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తుంటారు. కానీ కొన్ని స్టిల్స్ ఇద్దరికీ సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు. ఇలాంటి సందర్భాలేమైనా ఎదురైతే ఎలాంటి మొహమాటం లేకుండా 'మాకు ఫలానా యాంగిల్ అసౌకర్యంగా ఉంది..' అని చెప్పేయడం మంచిది. ఫలితంగా ఫొటోలు సహజంగా, అందంగా రావడానికి అవకాశం ఉంటుంది.
అన్నిటికన్నా మించి - ఈ కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ సాధ్యమైనంత సింపుల్ గా పెళ్లి తంతు ముగించడం మాత్రం అత్యంత ముఖ్యమని మరవకండి!