కొంతమందిని చూడగానే ‘ఈ అబ్బాయి భలే హ్యాండ్సమ్గా ఉన్నాడే’ అనిపిస్తుంది. అదే మన మనసుకు నచ్చిన వాడు కనిపిస్తే ‘ఈ అబ్బాయి నాకోసమే పుట్టాడేమో’ అని మన మనసు చక్కిలిగింతలు పెడుతుంది. రోహన్‌ప్రీత్‌ను చూడగానే తన మనసూ అలాగే పులకరించిపోయిందంటోంది కొత్త పెళ్లి కూతురు, బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన ఈ అందాల జంట.. మొదట మనసుల్ని ఇచ్చిపుచ్చుకున్నారు.. ఆపై ఒకరు లేని మరొకరు శూన్యమనుకున్నారు.. అందుకే ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టి తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. అయితే అందరికీ వీరిది ప్రేమ వివాహమే అని తెలిసినా.. అసలు అది ఎక్కడ మొదలైంది? ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? అన్న సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. అందుకే ఈ అందాల జంట పంచుకున్న తమ అందమైన ప్రేమకథను ప్రముఖ ఫ్యాషనర్ అనితా డోంగ్రే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీరిద్దరి లవ్‌స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
సంగీత ప్రపంచంలో తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న నేహా కక్కర్, రోహన్ ప్రీత్ సింగ్‌లను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. 2008లో ‘మీరాబాయి నాటౌట్’ అనే సినిమా దగ్గర్నుంచి ఈ ఏడాది విడుదలైన ‘గిన్నీ వెడ్స్ సన్నీ’ దాకా ఎన్నో పాటలతో సినీ సంగీత ప్రేమికుల్ని ఓలలాడించిన నేహ.. రోహన్‌ప్రీత్ అందం, సింప్లిసిటీకి ఫిదా అయిపోయింది. ఇక పంజాబీ గాయకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రోహన్.. నేహను తొలిసారి చూడగానే మనసిచ్చేశానంటున్నాడు.
అది నిజమవుతుందనుకోలేదు!
ఏ బంధమైనా పరిచయంతోనే మొదలవుతుంది.. కొందరి విషయంలో ఆ పరిచయమే ప్రేమగా మారుతుంది. అలా తామిద్దరం ‘నేహూ దా వ్యాహ్’ అనే పాట సింగిల్‌లో భాగంగా కలుసుకున్నామంటున్నారీ క్యూట్ కపుల్. నేహా కక్కర్ స్వయంగా రాసి పాడిన ఈ మ్యూజిక్ వీడియోలో నేహతో పాటు రోహన్ కూడా నటించాడు. ఇద్దరూ కలిసి రొమాంటిక్ కపుల్‌గా ఆడిపాడిన ఈ అందమైన పాట నిజ జీవితంలో కూడా నిజమవుతుందనుకోలేదంటున్నాడీ హ్యాండ్సమ్ హబ్బీ.
‘నేహూ దా వ్యాహ్ అనే మ్యూజిక్ వీడియోలో భాగంగా మేమిద్దరం కలుసుకున్నాం. నేహ స్వయంగా రాసి పాడిన ఈ పాట ఏదో ఒక రోజు నిజమవుతుందని నేను అసలు ఊహించలేదు. ఈ విషయాన్ని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా. నిజంగా ఈ క్షణం నా జీవితాన్నే మరింత అందంగా మార్చేసింది..’ అంటాడు రోహన్.
ఆ రోజు ధైర్యం చేశా!
ఇలా తన పాటకు, తన అందమైన చిరునవ్వుకు ఫిదా అయిపోయిన రోహన్.. ఇక ఆలస్యం చేయకుండా తన మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నానంటున్నాడు. ‘తను నాకు తొలి చూపులోనే నచ్చేసింది. ఇంత నిరాడంబరమైన అమ్మాయిని ఇది వరకు నేనెప్పుడూ చూడలేదు.. ఆమె సింప్లిసిటీ నన్నెంతో ఆకట్టుకుంది. అందుకే నా ధైర్యాన్నంతా కూడగట్టుకొని ఒక రోజు తనకు ప్రపోజ్ చేశా. వెంటనే తనూ నాకు ఓకే చెప్పేసింది.. అందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను!’ అంటూ తన లవ్ ప్రపోజల్‌ను బయటపెట్టాడీ పంజాబీ స్టార్.
అతని క్యూట్‌నెస్ నచ్చింది!
రోహన్‌కు నేహ సింప్లిసిటీ నచ్చితే.. రోహన్లోని క్యూట్‌నెస్, అందరితో కలిసిపోయే తత్వం తనని కట్టిపడేసిందంటోందీ కొత్త పెళ్లి కూతురు. ‘రోహన్కే కాదు.. నాకూ తనను చూడగానే గుండెలో ప్రేమ గంట మోగింది. అతడిని చూడగానే ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. ముఖ్యంగా సెట్లో అందరితో కలుపుగోలుగా మాట్లాడడం నన్ను మాయ చేసిందని చెబుతా. అంత క్యూట్‌నెస్‌ని నేను ఇప్పటిదాకా మరే అబ్బాయిలో కూడా చూడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అతను నాకోసమే పుట్టాడేమో అన్నంత సంతోషం నా మదిని ముంచేసింది..’ అంటోంది నేహ.
దుబాయ్‌లో హనీమూన్!
ఇలా ఒకరి మనసును మరొకరు దోచుకొని.. ఒకరి ప్రేమను మరొకరు అంగీకరించుకొని .. తమ ప్రేమ, పెళ్లి విషయాలను ఒకేసారి బయటపెట్టారీ లవ్లీ కపుల్. ఆపై అక్టోబర్ 24న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నేహూప్రీత్ జంట.. ప్రి-వెడ్డింగ్ వేడుకల్లో, పెళ్లిలో తెగ సందడి చేసింది. ఈ వేడుకల్లో అంతే సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు కూడా!
ఈ క్రమంలో భారీగా డిజైన్ చేసిన లెహెంగాలు, అనార్కలీలను ఎంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఫొటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయంటే అతిశయోక్తి కాదు. ఇక రోహన్ కూడా నేహ అటైర్స్కు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ షేర్వాణీల్లో అదరగొట్టాడు. వీరిద్దరి మెహెందీ, సంగీత్ ఫంక్షన్ల కోసం అనితా డోంగ్రే ప్రత్యేకంగా దుస్తుల్ని డిజైన్ చేసి అందించారు. ఇక ఇటీవలే తమ తొలి కర్వాచౌత్ వేడుకల్ని ఎంతో వేడుకగా జరుపుకొన్న నేహూప్రీత్ జంట.. ప్రస్తుతం హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడి హోటల్ రూమ్ ఫొటోలను రోహన్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకోగా ప్రస్తుతం అవి ట్రెండింగ్‌లో ఉన్నాయి. మరి, ఈ అందాల జంట పెళ్లి సందడి ఫొటోలను మనమూ చూసేద్దాం రండి..!