ఆ ఆలుమగలది 60 ఏళ్ల దాంపత్య బంధం.. ఈ ఆరు దశాబ్దాల అనుబంధంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా కలిసే అడుగేశారు. కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా కలిసే పంచుకున్నారు. అయితే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ఇన్నాళ్లూ కలిసున్న ఆ ఆలుమగలను దూరం చేసింది. మనకంటూ ఓ తోడు కచ్చితంగా ఉండాల్సిన మలి వయసులో కనీసం ఒకరికొకరు చూసుకోకుండా చేసింది. మరి మహమ్మారి ప్రభావంతో ఏడు నెలల పాటు తీవ్ర ఎడబాటుకు గురైన ఆ వృద్ధ దంపతులు కలిస్తే... మాటల్లో వర్ణించలేని ఆ ఆనందానికి ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు.
ఏడు నెలల ఎడబాటు!
ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి వృద్ధులకు ప్రాణ సంకటంగా పరిణమించింది. ఇతర వయస్కుల వారితో పోల్చుకుంటే 60-80 ఏళ్ల మధ్యనున్న వారికే ఈ వైరస్ ముప్పు అధికంగా ఉందని పలు అధ్యయనాలతో పాటు ఆయా దేశాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక కొవిడ్ బారిన పడిన వృద్ధులు కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా ప్రభావం అత్యధికంగా ఉంటున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో అక్కడి అధికారులు కొన్ని కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు ఉండే ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, నర్సింగ్ హోంలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇతరులెవరూ వారిని కలవకుండా కట్టడి చేస్తున్నారు. కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా ఆ పరిసరాల్లోకి రాకుండా నిషేధం విధిస్తున్నారు. ఈ ఆంక్షలతో చాలామంది వృద్ధులు తమ ఆప్తులను కలుసుకోలేక ఒంటరితనంతో బాధపడుతున్నారు.
ఫ్లోరిడాకు చెందిన జోసెఫ్, ఎవీ అనే దంపతులు కూడా ఇలాగే మానసిక క్షోభ అనుభవించారు. 60 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన ఆ వృద్ధ దంపతులు కరోనా కారణంగా సుమారు ఏడు నెలలు (215 రోజులు) ఒకరి ముఖం ఒకరు చూసుకోలేకపోయారు.

ఫోన్లలో మాత్రమే క్షేమ సమాచారాలు!
80 ఏళ్ల వయసున్న జోసెఫ్ మార్చిలో కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం ఓ ఆస్పత్రిలో చేరిన ఆయనకు అక్కడి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. జోసెఫ్ కరోనా నుంచి కోలుకున్నప్పటికీ సాధారణ స్థితికి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఇక వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆస్పత్రి పరిసరాల్లో కఠినంగా ఆంక్షలు విధించడంతో తన భర్తను చూడడానికి ఎవీకి ఏ మాత్రం సాధ్యపడలేదు. కేవలం ఫోన్లలో మాత్రమే పరస్పర క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అప్పుడప్పుడు ఆస్పత్రి కొచ్చినా దూరం నుంచే అతడిని చూసి వెళ్లిపోయేది. ఈ క్రమంలో సుమారు 7 నెలల పాటు ఒకరిని ఒకరు కలుసుకోలేకపోయారీ ఓల్డ్ కపుల్.
ఐ లవ్యూ...ఐ మిస్ యూ!
తాజాగా జోసెఫ్ ఆరోగ్యం మెరుగుపడడంతో ఒకరినొకరు కలుసుకునేందుకు అనుమతి లభించింది. ఈ క్రమంలో అక్కడి సిబ్బంది సహాయంతో ఓ పునరావాస సహాయక కేంద్రంలో ప్రత్యక్షంగా కలుసుకున్నారు జోసెఫ్-ఎవీ. ఈ సందర్భంగా 215 రోజుల పాటు దూరంగా ఉన్న వారిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా హత్తుకొని ‘ఐ లవ్యూ’, ‘ఐ మిస్ యూ’ అంటూ ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వృద్ధ దంపతుల రీయూనియన్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటివరకు ఇన్ని రోజులు విడిగా ఉండలేదని ఆ ఓల్డ్ కపుల్ వీడియోలో చెబుతున్న మాటలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి.