సినిమాల్లో మన అభిమాన హీరోను చూసి ‘అబ్బ.. ఈ హ్యాండ్సమ్ నాకు భర్తైతే ఎంత బాగుంటుందో!’ అని కలలు కంటాం.. అతని ఊహల్లోనే తేలుతూ సిగ్గుపడిపోతుంటాం.. కానీ ఆ ఆలోచనలన్నీ కలలకే పరిమితమవుతాయే తప్ప నిజ జీవితంలో జరగడం చాలా అరుదు. కానీ అలాంటి కలల్ని నిజం చేసుకున్న లక్కీ గర్ల్ సంగీతా సోర్నలింగం! ఓ సినిమాలో తళపతి విజయ్‌ని చూసి తెగ ముచ్చటపడిపోయింది. అప్పట్నుంచి అతని ఊహల్లోనే గడిపేది.. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని బలంగా నిర్ణయించుకుంది. అంత గట్టిగా అనుకుంది కాబట్టే తన గుండె లయ విజయ్‌ని చేరింది. కట్ చేస్తే.. మూడేళ్లలో తమ ప్రేమాయణం పెళ్లి పీటలెక్కింది. ఇరవై వసంతాలు, ముగ్గురు పిల్లలతో వారి ప్రేమబంధం మరింత దృఢంగా అల్లుకుంది. మరి, అంతగా వలచిన విజయ్‌ని సంగీత ఎలా కలుసుకుంది? తన వీరాభిమాని ప్రేమలో మన తళపతి ఎలా పడిపోయాడు? వీరి 21 వ ‘వివాహ వార్షికోత్సవం’ సందర్భంగా ఈ ముద్దుల జంట ప్రేమ కబుర్లేంటో తెలుసుకుందాం రండి..
తళపతి విజయ్.. హీరోగా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హ్యాండ్సమ్ హీరోను చూస్తే ఏ అమ్మాయైనా ఫిదా అవకుండా ఉండగలదా? ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురైన సంగీతా సోర్నలింగం కూడా ఈ రొమాంటిక్ హీరో అందానికి పడిపోయింది. అది 1996. విజయ్ నటించిన ‘పోవే ఉనక్కగ’ అనే సినిమా విడుదలైంది. తళపతికి విపరీతమైన క్రేజ్ అందించిన ఈ సినిమా సంగీతను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ అందం, నటనకు ఆమె ఫిదా అయిపోయింది. అప్పటికే తన కుటుంబంతో కలిసి యూకేలో ఉంటోన్న సంగీత.. ఎలాగైనా విజయ్‌ని కలుసుకోవాలనుకొని ఇండియాకొచ్చింది.
మాటలతో మొదలై..!
ఆ సమయంలో విజయ్ తర్వాతి సినిమాతో బిజీగా ఉన్నాడు. చెన్నైలోని ఫిలింసిటీలో చిత్రీకరణలో పాల్గొంటోన్న విజయ్‌ని ఆయన వీరాభిమానిగా కలుసుకోవడానికొచ్చింది సంగీత. షూటింగ్ బ్రేక్‌లో తళపతికి తనను తాను పరిచయం చేసుకొని మాట కలిపిందామె. అలా ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇలా ఎంతో చలాకీగా మాట్లాడుతోన్న సంగీతను చూసి విజయ్ మనసులోనూ ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. ‘మీకు వీలైతే ఓసారి మా ఇంటికి రావచ్చుగా!’ అన్నాడు విజయ్. తన అభిమాన హీరోనే అంత ముచ్చటపడి పిలుస్తుంటే వెళ్లకుండా ఎవరైనా ఉండగలరా? ‘ఓ ఎందుకు రాను.. తప్పకుండా వస్తాను!’ అంటూ ఎగిరి గంతేసినంత పనిచేసింది సంగీత. అలా మొదటిసారి విజయ్ ఇంట్లో ఆయన తల్లిదండ్రులను కలుసుకుందీ మిసెస్ విజయ్.
ఈడూ-జోడూ కుదిరింది!
ఎంతో కలుపుగోలుగా ఉన్న సంగీత మాటతీరు విజయ్ తల్లిదండ్రులను సైతం ఆకట్టుకుంది. అయితే అప్పటికే ఆమెపై తన మనసులో ఇష్టం ఉన్నప్పటికీ ఆ ఫీలింగ్‌ని బయటపెట్టలేదీ రొమాంటిక్ హీరో. ఆపై మరోసారి సంగీతను తన ఇంటికి ఆహ్వానించాడు విజయ్. ఇలా పదే పదే సంగీత తమ ఇంటికి రావడం, ఇద్దరికీ మధ్య మంచి అనుబంధం ఏర్పడడంతో ‘ఆ అమ్మాయి నీకు సరిజోడు అనిపిస్తోంది.. నువ్వేమంటావ్?’ అంటూ విజయ్ తల్లిదండ్రులు అతడిని అడిగారు. అప్పటికే ఆమెపై ప్రేమ పెంచుకున్న తళపతి అందుకు సరేనన్నాడు. ఇదే విషయాన్ని తాము కోడలిగా భావిస్తున్న సంగీతను కూడా అడిగి చూశారు విజయ్ తల్లిదండ్రులు. మనమెంతగానో అభిమానించే హీరోతోనే పెళ్లంటే.. అసలు ఇది కలా? నిజమా? అని గిల్లుకొని మరీ చూసుకుంటాం.. అంత పనే చేసింది సంగీత కూడా! ఇలా తన కల నిజమవడంతో ఆమె ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఆపై విజయ్ తల్లిదండ్రులు లండన్ వెళ్లి సంగీత పేరెంట్స్‌తో మాట్లాడడం.. వాళ్లూ అందుకు సరేననడంతో వీరి ప్రేమకథకు శుభం కార్డు పడింది.
ప్రేమకు తీపిగుర్తులు!
అలా తమ ప్రేమను పెళ్లి పీటల దాకా నడిపించిన ఈ ముద్దుల జంట.. 1999, ఆగస్టు 25న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సంగీత హిందువు, విజయ్ క్రిస్టియన్ కావడంతో ఇరు సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారీ లవ్లీ కపుల్. వీరి అన్యోన్యమైన ప్రేమకు గుర్తుగా జాసన్ సంజయ్, దివ్యా సాషా అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వీరిద్దరూ విజయ్ నటించిన పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో కూడా నటించారు. ఇలా తమ 21 ఏళ్ల వైవాహిక బంధాన్ని నిత్యనూతనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారీ బ్యూటిఫుల్ కపుల్. భార్యాభర్తల ప్రేమ నాలుగ్గోడల మధ్య ఉంటేనే అందం అన్నట్లుగా వీరిద్దరూ కలిసి కెమెరా కంటికి చిక్కిన సందర్భాలు చాలా తక్కువ.
ఇలా తమ ప్రేమైక జీవితాన్ని, ఆలుమగల అనుబంధాన్ని అన్యోన్యంగా ఆస్వాదిస్తూ నేటితరం దంపతులకు ప్రేమ పాఠాలు నేర్పుతోన్న ఈ ముద్దుల జంటకు మనమూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుదాం..!