హాయ్ మేడమ్.. నా వయసు 26. మా బంధువులబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని విసిగించేవాడు. అతని ప్రేమను నేను చాలాసార్లు తిరస్కరించాను. దాంతో అతను సూసైడ్ చేసుకున్నాడు. ‘నా చావుకి కారణం ప్రేమ విఫలమవడమే’ అని సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఇప్పుడు మా బంధువులందరూ నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలోనే ఇలా జరిగింది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ, నేను ఇద్దరమే ఉంటున్నాం.. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ: మీకు అతని పట్ల ఏ విధమైన ఆసక్తి లేనప్పుడు.. కేవలం మీరంటే అతనికి ఇష్టమున్నంత మాత్రాన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదన్న వాస్తవం అందరికీ తెలిసిందే.. ప్రేమ అనేది రెండు వైపుల నుంచి ఉండాలి.. కానీ బెదిరింపులతోనో, ఆత్మహత్యలతోనో సాధించగలిగేది కాదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి ఆమోద తిరస్కారాలకు కూడా విలువ ఉంటుంది. అలా కాకుండా కేవలం ఒక వ్యక్తి కోరుకున్నంత మాత్రాన అవతలి వ్యక్తికి ఏమాత్రం ఆసక్తి లేనప్పుడు అది జరిగే విషయం కాదు.
మిమ్మల్ని ఇంకొకరు వేలెత్తి చూపుతారని, మీకిష్టం లేని పని మీరు చేయలేరు కదా! పరిస్థితి ఇంత దూరం వస్తుందని మీరు కూడా అనుకోకపోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయం మీ వ్యక్తిగతమైనది. దానికి అతను ప్రభావితమవడం అనేది అతని ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుంది. అతని మీద, అతని కుటుంబం మీద మీకు సానుకూల ధోరణి ఉండచ్చు. కానీ అదే సమయంలో నిందను మీపై వేసుకుంటే.. మీ మనసు నిరాశాపూరిత ధోరణిపైపు వెళుతుందనేది గుర్తు పెట్టుకోండి. కాబట్టి మిమ్మల్ని మీరు దృఢపరచుకునే ప్రయత్నం చేయండి. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే మార్గాలను అన్వేషించుకోండి. అలాగే మీ మీద ఆధారపడ్డ మీ అమ్మగారిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం ముందుగా మీరు మానసికంగా దృఢంగా తయారుకావాలి. మీ మనసు కుదుటపడ్డ తర్వాత పెళ్లి గురించి ఆలోచించండి. అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్