చిట్టిపొట్టి చేతులు, బుజ్జిబుజ్జి పాదాలు, ముట్టుకుంటే కందిపోయే చర్మం.. ఒక తల్లి తనకు పుట్టబోయే పాపాయి గురించి కనే కలలు, ఎదురుచూపులు ఏమని చెప్పగలం. ఇక పుట్టబోయేది తొలుచూరు బిడ్డ అయితే ఆ తల్లిదండ్రుల ఆతృతకు అంతే ఉండదు! మరికొన్ని రోజుల్లో తమ గారాల పట్టిని ఈ లోకంలోకి తీసుకురాబోతోన్న సెలబ్రిటీ కపుల్ హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్ కూడా ప్రస్తుతం ఇంతకుమించిన ఆనందంలో తేలియాడుతున్నారు.. తమ ఆనందాన్ని పంచుకోవడానికి మాటలు సరిపోక ఫొటోల రూపంలో తమ ఫ్యాన్స్ ముందుంచుతున్నారు. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన మరుక్షణం నుంచే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో బంధిస్తోన్న ఈ బ్యూటిఫుల్ కపుల్.. ఇటీవలే మెటర్నిటీ ఫొటోషూట్‌కు కూడా పోజిచ్చింది. ఆ మధురానుభూతుల్ని ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో పంచుకుంటూ తెగ మురిసిపోతోంది.
హార్దిక్ పాండ్యా.. ఈ ఏడాదికి ముందు వరకు ఒక డ్యాషింగ్ క్రికెటర్‌గా, లవర్ బాయ్‌గా మాత్రమే మనకు తెలుసు..! కానీ ఎప్పుడైతే ఈ ఏడాది తొలి రోజున సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌తో తన ప్రేమాయణం, నిశ్చితార్థం విషయాలను బయటపెట్టాడో.. అప్పుడు ఈ హ్యాండ్సమ్ క్రికెటర్లో ఓ రొమాంటిక్ ప్రేమికుడు కూడా దాగున్నాడని ఫ్యాన్స్‌కు అర్థమైంది. ఇక ఈ విషయం విని చాలామంది లేడీ ఫ్యాన్స్ గుండె జారి గల్లంతయ్యిందనుకోండి! ఇక అప్పట్నుంచి తన ప్రేయసితో గడిపిన ప్రతి మధుర క్షణాన్నీ ఫొటోల్లో బంధిస్తూ, సోషల్ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతున్నాడీ హ్యాండ్సమ్ హంక్. ఇక మరోవైపు ఇండియన్ కోడలు నటాషా కూడా తన ఇష్టసఖుడితో కలిసి దిగిన లవ్లీ మూమెంట్స్‌ని పంచుకుంటూ మైమరచిపోతోంది.
ముగ్గురం కాబోతున్నాం..!
ఇక ఈ ఏడాది మేలో మరో షాకింగ్ న్యూస్‌తో తెరమీదకొచ్చిందీ అందాల జంట. త్వరలో తామిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నామన్న వార్తను సోషల్ మీడియా వేదికగా మోసుకొచ్చారీ లవ్లీ కపుల్. గర్భం ధరించిన తన ప్రేయసి నటాషాతో దిగిన ఓ క్యూట్ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన హార్దిక్.. ‘నటాషాతో కలిసి నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది.. త్వరలోనే మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం.. ఆ క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం..’ అంటూ క్యాప్షన్ పెట్టాడీ రొమాంటిక్ మ్యాన్. ఇక ఈ ఫొటోతో పాటు ఇద్దరూ పూలదండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న మరో ఫొటోను కూడా పోస్ట్ చేయడంతో వీరిద్దరూ గోప్యంగా వివాహం చేసుకున్నారని అనుకున్నారంతా! కానీ ఈ విషయం గురించి హార్దిక్-నటాషా, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఆనందం వైపు అడుగులేస్తున్నాం..!
నటాషా గర్భం ధరించిన దగ్గర్నుంచి ప్రతి క్షణాన్నీ ఫొటోలో బంధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఆ ఆనందాన్ని తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటోన్న ఈ అందాల జంట.. ఇటీవల తీయించుకున్న మెటర్నిటీ ఫొటోషూట్ ఫొటోలను కూడా ఒక్కొక్కటిగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో నటాషా బ్లూ గౌన్‌లో, హూప్ ఇయర్‌రింగ్స్‌తో ప్రకాశవంతంగా మెరిసిపోగా.. హార్దిక్ బ్లాక్ అండ్ వైట్ క్యాజువల్ వేర్‌తో సింపుల్‌గా దర్శనమిచ్చాడు. హార్దిక్.. నటాషా వెనక నిల్చొని బేబీబంప్ని సుతారంగా నిమురుతూ, ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని ముందుకు నడుస్తూ.. ఇలా డిఫరెంట్ యాంగిల్స్‌లో దిగిన ఫొటోలను హార్దిక్, నటాషాలిద్దరూ ఇన్‌స్టా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇందులో ఓ ఫొటోకి హార్దిక్ ‘అంతులేని ఆనందం వైపు అడుగులేస్తున్నాం..’ అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా ఈ రొమాంటిక్ మెటర్నిటీ ఫొటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్‌ని చూసి అటు ఫ్యాన్స్, ఇటు సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు. సానియా మీర్జా, సోనాల్ చౌహాన్, సాగరికా ఘడ్గే, యాస్మిన్ కరాచీవాలాతో పాటు మరికొందరు క్రికెటర్లు, సినీ తారలు ‘హార్ట్’ ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ని నింపేశారు.. తమ ఆనందాన్ని రంగరించి ఈ క్యూట్ కపుల్‌ని ఆశీర్వదిస్తున్నారు.
ఇక గతంలోనూ ఇద్దరూ కలిసి దిగిన కొన్ని లవ్లీ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుందీ అందాల జంట. అలాంటి స్వీట్ అండ్ క్యూట్ ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..!