Image for Representation
హాయ్ మేడమ్.. నాకు ఏడు నెలల బాబు ఉన్నాడు. డెలివరీ ముందు వరకు నేను ఒక MNC లో జాబ్ చేసేదాన్ని. డెలివరీ అయ్యాక నేను వాడిని ఎలా పెంచుతానోనని భయాలు నాలో మొదలయ్యాయి. దానికి తోడు ఆఫీసులో పని ఒత్తిడిని తట్టుకోలేక, బాబు పుట్టాక మానేశాను. ఇదిలా ఉంటే- ఇంట్లో వాళ్లు, అయిన వాళ్లు, బంధువులు అని తేడా లేకుండా అందరూ ఇచ్చే ఉచిత సలహాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. బాబుని ఏమైనా అన్నా, కామెంట్లు చేసినా తట్టుకోలేకపోతున్నా. చాలా కోపం వస్తుంది. ఒక్కదాన్నే ఉన్నప్పుడు గతంలో జరిగిన చెడు సంఘటనల గురించి ఆలోచిస్తున్నా. వీటికి తోడు ‘మా అప్పుడు మేము ఒక్కరమే చూసుకున్నాం’, ‘చాలామంది వర్క్, పర్సనల్ లైఫ్ రెండూ బ్యాలన్స్ చేసుకుంటారు.. నువ్వు జాబ్ మానేశావేంటి’ అంటూ కొంతమంది చేసే చెత్త కామెంట్లు భరించలేకపోతున్నా. వీటి నుంచి తేరుకునే మార్గం చెప్పండి.. కృతజ్ఞతలు - ఓ సోదరి
జ. మీ సమస్యని పరిష్కరించుకోవడానికి మీరు రెండు కోణాల్లో నుంచి ఆలోచించాలి. ఒకటి మీకెదురవుతున్నటువంటి సలహాలు, సూచనలు, వ్యాఖ్యానాలను వడపోయడం.. రెండోది- డెలివరీ తర్వాత మీకు కలుగుతున్న భయాలు, చెడు సంఘటనల తాలూకు ఆలోచనల గురించి మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం.. ఇలా రెండు కోణాల నుంచి ఆలోచించండి.
కొంతమందికి డెలివరీ తర్వాత వచ్చేటువంటి శారీరక మార్పులు, కొన్ని చర్యలు వాళ్ల ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తాయి. దీనికి సంబంధించి గైనకాలజిస్టుని సంప్రదించండి. వారి సలహా ప్రకారం మానసిక నిపుణుల సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉందేమో పరిశీలించండి.

డాక్టర్ సలహాలు మాత్రమే తీసుకోండి...
ఇక ఇతరులు మీ పట్ల చేసే వ్యాఖ్యానాలు, సలహాలు మీ మనసుకి గుచ్చుకుంటున్నాయి. అలాగే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నాయి. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ బిడ్డ విషయంలో మీరు తీసుకోవాలనుకుంటున్న జాగ్రత్తలను ప్రశ్నించే స్థితికి తీసుకెళ్తున్నాయి.
బాబుకి ఫీడింగ్ ఏవిధంగా చేయాలి? ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాక్సిన్లు ఏమేమి వేయించాలి? ఇలాంటివన్నీ అందరికంటే మీ డాక్టర్ మాత్రమే సరైన సలహా ఇవ్వగలరు. కాబట్టి బిడ్డ ఆరోగ్యం విషయంలో డాక్టర్ సలహా ప్రకారమే ఏమేమి చేయాలనేది నిర్ణయించుకోండి. అలాగే బాబు పెంపకం విషయంలో ఏం చేయాలనేది మీరు, మీ భర్త మాత్రమే నిర్ణయించుకోవాలి.

స్పష్టమైన అవగాహనకు రండి..
అలాగే మీరు తాత్కాలికంగా ఉద్యోగం మానేసినంత మాత్రాన మీకసలు ఉద్యోగం రాకుండా ఉంటుందా? అనే విషయంలో మీ భార్యాభర్తలిద్దరూ ఒక స్పష్టమైన అవగాహనకు రండి. దీనివల్ల ఎవరు ఏం మాట్లాడినా అది మీ ఆలోచనాధోరణికి భిన్నమైంది కాబట్టి దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది మీరే నిర్ణయించుకోగలుగుతారు. మీరు ఉద్యోగం మానేసినంత మాత్రాన మీ విలువ తగ్గిపోతుందా? మీ సమర్థతలో మార్పు వస్తుందా?అనేది మీకు మీరుగా విశ్లేషించుకోండి. దానివల్ల అవతలి వాళ్లంటున్న మాటల్లో ఎంతవరకు నిజముందనేది మీకే తెలుస్తుంది. కాబట్టి ఎవరో అన్న మాటల వల్ల మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసుకోవడం ఎంతవరకు సహేతుకమో ఆలోచించి చూడండి. మీ పూర్తి సమయాన్ని బాబుకి కేటాయించదలుచుకున్నారు. అలాంటప్పుడు మీ నిర్ణయాన్ని పదే పదే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనేది అర్థం చేసుకోండి.
మీ ఆత్మవిశ్వాసం దృఢంగా ఉండి, మీ నిర్ణయాల పట్ల స్పష్టత ఉన్నప్పుడు.. మీ బాబుకి సమయం కేటాయించడమనేదే మీ నిర్ణయమైనప్పుడు.. ఆ నిర్ణయం విషయంలో ఎవరూ ఏం మాట్లాడినా అది మిమ్మల్ని ఎంతమాత్రం ప్రభావితం చేయదనే విషయాన్ని కూడా అర్ధం చేసుకోండి. మీ దంపతులిద్దరూ స్పష్టమైన అవగాహనతో బాబు పెంపకం పైన దృష్టి నిలపండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్