‘మా జీవితాలు సినిమాలకేమీ తక్కువ కాదు..!’ అంటోంది బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ సతీమణి సుతపా సిక్దర్. ఇర్ఫా్న్, సుతపాలది 35 ఏళ్ల అనుబంధం. బాబిల్, అయాన్ అనే ఇద్దరు కుమారులు వీరి ప్రేమకు ప్రతిరూపాలు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా వీళ్లిద్దరూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వాటిని అధిగమించారు. ఇర్ఫాన్ గత కొద్దికాలంగా క్యాన్సర్ (Neuro Endocrine Tumour)తో పోరాడుతూ ఇటీవలే మరణించిన సంగతి విదితమే. ఇర్ఫాన్ మరణం ఆయన కుటుంబ సభ్యులనే కాదు.. యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో తన భర్తతో తనకున్న అనుబంధం గురించి సుతపా ఇటీవలే సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
‘ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఆయనను (ఇర్ఫాన్‌ను) తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ, ఆయన ఇక లేరనే వార్త విని బాధపడుతోంటే.. ఇది నా ఫ్యామిలీకి మాత్రమే జరిగిన నష్టంగా ఎలా చెప్పగలను..? మా కుటుంబ సభ్యులతో పాటు లక్షలాది మంది తన కోసం రోదిస్తుంటే నేను ఒంటరిని అని ఎలా అనుకోగలను..? ప్రస్తుతం ఇర్ఫాన్ మన మధ్య లేకపోవడాన్ని నష్టంగా భావించకుండా.. తన జీవితకాలంలో ఆయన నేర్పిన విషయాలను మనమంతా ఆచరించి ఆయన లేని లోటును భర్తీ చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నా..! ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకొంటున్నాను.
ఆయనపై నాకున్న కోపం అదే..!
ఇర్ఫాన్‌కు ఏ విషయాన్నైనా ఒకే కోణంలో నుంచి చూడడం ఇష్టముండేది కాదు. అందుకే తనకు ప్రతిదీ ఓ అద్భుతంగా కనిపించేది. ఈ లక్షణాన్ని నాకూ అలవాటు చేశాడు. అప్పటినుంచి తనతో పాటు నాకు కూడా ఏ విషయంలోనూ రాజీ పడకుండా.. పర్ఫెక్షన్ కోసం పరితపించడం ఓ అలవాటుగా మారింది. దీంతో ఏ విషయమైనా పర్ఫెక్ట్గా లేకపోతే నేను చూడలేకపోతున్నాను. ఇర్ఫాన్‌పై నాకు ఏదైనా కోపం ఉందంటే అది.. తన పర్ఫెక్షన్తో నన్ను పాడు చేయడమే..! ఎంతటి గందరగోళంతో కూడిన శబ్దంలోనైనా ఇర్ఫాన్ ఒక మధురమైన లయను కనిపెట్టగలడు. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిలో ఆనందాలను చూడగలడు. ఈ క్రమంలో తనలాగే నాకు కూడా అదే తత్వం అలవాటైంది.
డాక్టర్ రిపోర్టులే మా సినిమా స్క్రిప్ట్‌లు..!
మా జీవితాలు కూడా సినిమా ఫక్కీలోనే ఉంటాయి. మేము స్వాగతించని అతిథులెందరో మాకు ఎదురయ్యారు. వైద్యులు ఇచ్చే రిపోర్టులే మా సినిమా స్క్రిప్ట్‌లు. అవి కూడా పర్ఫెక్ట్గా ఉండాలని వాటిని నేను శ్రద్ధగా పరిశీలించే దాన్ని.. ఎందుకంటే వాటి వల్ల తన పెర్ఫార్మెన్స్లో తేడా రావద్దు కదా..! మా జీవితంలో మేము ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నాం. వీరిలో ఆపద సమయంలో మమ్మల్ని ఆదుకున్న వైద్యులు కూడా ఉన్నారు. వాళ్లు చేసిన ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. 35 ఏళ్ల మా జీవిత ప్రయాణంలో ఈ రెండున్నర ఏళ్లు (ఇర్ఫాన్ అనారోగ్యానికి గురైన దగ్గర నుంచి) ఎంత కష్టంగా గడిచాయో మాటల్లో చెప్పలేను. వీటి గురించి ఆలోచించినప్పుడల్లా మాది సాధారణ వివాహబంధం కాదు.. ఒక అన్యోన్య సంగమం అని అనిపిస్తుంటుంది.
జీవితంలో రీటేక్స్ ఉండవు..!
ప్రస్తుతం నేను నా పిల్లలిద్దరితో కలిసి పడవ ప్రయాణం చేస్తున్నాను. పిల్లలిద్దరూ తెడ్డు వేస్తుంటే.. ఇర్ఫాన్ ‘ఇటు కాదు అటు తిప్పండి’ అంటూ వాళ్లకు దిశ నిర్దేశిస్తున్నాడు. జీవితం సినిమా కాదు కాబట్టి.. ఇందులో రీటేక్స్ ఉండవు. అందుకే నా పిల్లలు.. వచ్చే తుఫానులను ఎదుర్కొంటూ.. తమ తండ్రి చెప్పిన సూచనలు పాటిస్తూ పడవను క్షేమంగా గమ్యానికి చేరుస్తారని ఆశిస్తున్నాను.. మేము ఇర్ఫాన్‌కు ఎంతో ఇష్టమైన ‘రాత్ కీ రాణి’ మొక్కను తన సమాధిపై నాటాలని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఆ మొక్క పెరిగి, దానికి పూలు పూచి.. వాటి నుంచి వచ్చే సువాసన తనను అభిమానిస్తోన్న ప్రతి ఒక్కరినీ చేరుతుందని ఆశిస్తున్నాను..’ అంటూ తన బాధాతప్త హృదయంతో రాసుకొచ్చింది సుతపా.
ఇర్ఫాన్, సుతపాలు 35 ఏళ్ల క్రితం దిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో తొలిసారి కలుసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఫిబ్రవరి 23, 1995లో వీళ్లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఇర్ఫాన్ నటుడిగా నిలదొక్కుకుంటే.. సుతపా సినిమా డైలాగ్ రైటర్‌గా కెరీర్లో స్థిరపడింది.
ఒకరికి ఒకరై..

2018లో ఇర్ఫాన్‌కు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉందని వైద్య పరీక్షల్లో వెల్లడైనప్పుడు కూడా సుతపా తన మనోభావాలను ఫేస్బుక్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ‘నా ప్రియ స్నేహితుడు, జీవిత భాగస్వామి ఓ గొప్ప యోధుడు. తనకు ఎదురైన ప్రతి అవరోధాన్నీ అధిగమించడానికి ఆయన ఎంతో యుక్తితో పోరాడుతున్నారు. ఆయనతో పాటు నన్నూ ఓ యోధురాలిగా మార్చినందుకు ఆ భగవంతుడికి రుణపడి ఉంటాను. ప్రస్తుతం నా ముందున్న యుద్ధక్షేత్రంలో గెలవాలంటే బోలెడన్ని సవాళ్లు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటిని మేమిద్దరం కలిసి జయించగలమనే నమ్మకం నాకుంది..’ అంటూ ఇర్ఫాన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుందామె. ఇర్ఫాన్ కూడా చాలా సందర్భాల్లో.. క్యాన్సర్ కాటేసినా, సుతపా వల్లే తానింకా బతికి ఉన్నానని, తాను క్యాన్సర్‌తో పోరాడే యోధుడినైతే, తనను అలా మార్చింది తన భార్యేనంటూ ఆమెపై ఉన్న అనురాగాన్ని వివరించాడు.
|
మీ అభిమానానికి కృతజ్ఞుడిని..!
ఇర్ఫాన్ మృతి పట్ల మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇర్ఫాన్ కుమారుడు బాబిల్ స్పందిస్తూ ‘మీరు నాపై, మా కుటుంబంపై చూపిస్తోన్న అభిమానానికి కృతజ్ఞుడిని. ప్రస్తుతం బాధతో నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ విషయాన్ని మీరంతా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. త్వరలోనే నేను మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్యూ సో మచ్..!’ అని భావోద్వేగంతో రాసుకొచ్చాడు.
|
ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న తమ సంసార నావలో తన సహచరుడు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం అదే ఆవేదన సుతపా పోస్ట్‌లో కనిపిస్తోంది. శోకతప్త హృదయంతో తన భర్తతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సుతపా పెట్టిన ఈ పోస్ట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.