‘కష్టమైనా, సుఖమైనా.. ఇక నీతోనే..’ అంటూ బాస చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెడతారు నవదంపతులు. కలకాలం అన్యోన్యంగా ఉంటూ.. వైవాహిక జీవితంలోని స్వర్గపుటంచులను తాకుతూ తమకంటే ఉత్తమ జంట మరొకటి లేదని నిరూపిస్తారు. అచ్చం ఇలానే 51 ఏళ్ల పాటు ఎంతో సంతోషంగా గడిపిన ఓ అమెరికన్ జంటను.. తాజాగా కరోనా కాటు వేసింది. దీంతో బతుకులోనే కాదు.. చావులోనూ మాది విడదీయరాని అనుబంధమని నిరూపించిందీ జంట. ఈ క్రమంలో వీరి కుమారుడు ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలిపిన సందేశం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. మరి అతని మెసేజ్ ఏంటో మనమూ విందాం రండి..
అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాల మన్ననలందుకుంటోన్న అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అమెరికాలో మృత్యుఘోషను ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. ఈ క్రమంలోనే ఫ్లోరిడాకు చెందిన స్టువర్ట్ బేకర్ (74) అడ్రియన్ బేకర్ (72) అనే జంట కూడా తాజాగా కరోనాకు బలైంది. 51 ఏళ్ల క్రితం వివాహమాడి ఇంత కాలం ఎటువంటి పొరపచ్ఛాలు లేకుండా జీవితాన్ని గడిపిన ఈ జంట మరణం చాలామందిని కలచివేస్తోంది.
కరోనా మమ్మల్ని విడదీయలేదు..
మూడు వారాల క్రితం స్టువర్ట్ జ్వరం, ఆస్తమాతో ఆసుపత్రిలో చేరాడు. అప్పటికి అతని భార్య అడ్రియన్కు కరోనా లక్షణాలేవీ లేకపోవడంతో ఆమె స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో స్టువర్ట్ ఆక్సిజన్ స్థాయులు నెమ్మదిగా క్షీణించసాగాయి. అంతేకాదు.. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత అడ్రియన్ను పరీక్షించగా ఆమెకూ కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెలోనూ ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలా దాదాపు 10 రోజుల పాటు కరోనాతో పోరాడిన ఈ జంట 6 నిమిషాల వ్యవధిలో కన్నుమూసింది. ఇలా దాదాపు 51 ఏళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన తమను కరోనా కూడా విడదీయలేదంటూ ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో కథ విషాదాంతమైంది.
అందరూ కలిసి కొవిడ్ 19 వ్యాప్తిని ఆపండి..
తన తల్లిదండ్రుల మరణవార్తను అందరికీ తెలియజేస్తూ ట్విట్టర్లో ఓ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టాడు ఈ జంట కుమారుడు బడ్డీ బేకర్..‘నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ మాటలు చెబుతున్నా.. అందరికీ ఎంత కఠినతరంగా అనిపించినా స్వీయ నిర్బంధం పాటించండి.. కొవిడ్ 19 వ్యాప్తిని ఆపండి’.. అంటూ ఓ వీడియోను అందరితో పంచుకున్నాడు.
వీడియోలో ఏముందంటే..
‘మా అమ్మా, నాన్న ఎంతో అన్యోన్యమైన జంట. 6 నిమిషాల వ్యవధిలో వారిద్దరూ మరణించడం నన్నెంతగానో కలచివేస్తోంది. ఇలాంటిది మరెవరికీ జరగకూడదు. యువత తమకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని.. మాకు ఇలాంటి వైరస్ల వల్ల ఏం కాదనే భావనలో ఉంటారు. కానీ అలా అనుకోకుండా ఎవరైనా సరే.. సామాజిక దూరాన్ని పాటించడం చాలా ముఖ్యం. వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులను శుభ్రం చేసుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా ఇంట్లోనే ఉండండి’.. అంటూ ఇంత విషాద సమయంలోనూ కరోనాపై అవగాహన కల్పించాడు బడ్డీ బేకర్. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది.
ఇలాంటి విషాద సంఘటన మరెవరికీ రాకూడదంటే మనం చేయాల్సిన పనులు మూడే మూడు.. ఒకటి - ఇంట్లోనే ఉండడం, రెండోది - సామాజిక దూరం పాటించడం, మూడోది - వ్యక్తిగత పరిశుభ్రత. కాబట్టి మనమూ వీటిని పాటిద్దాం.. కరోనా నుంచి మనల్ని, మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న వారిని కాపాడదాం..!
Photo: twitter