కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో సామాన్యులు, సెలబ్రిటీలు.. అనే తేడా లేకుండా ఎవరికి వారు తమ వ్యక్తిగత పనులతో పాటు ఇంటి పనులను సైతం తామే స్వయంగా పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీ కపుల్ అనుష్కా శర్మ తన భర్త విరాట్ కోహ్లీ కోసం ఏం చేసిందో మీరే చూడండి..!
లాక్డౌన్ కారణంగా దేశ ప్రధాని దగ్గర నుంచి రోజు కూలీ వరకు స్వీయ నిర్బంధంలో గడుపుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఇంటి నుంచే తమ విధులకు హాజరవుతుంటే.. ఆ అవకాశం లేని వాళ్లు మాత్రం తమ విధుల నుంచి స్వచ్ఛందంగా సెలవు తీసుకుంటున్నారు. వీరిలో ఇళ్లలో పని చేసే వంట పనుషులు, పని పనుషులు, వాచ్మెన్లు, బార్బర్లు.. మొదలైన వాళ్లు కూడా ఉన్నారు. దీంతో వీళ్లు చేసే పనులను ఇంటి యజమానులే స్వయంగా పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనుష్క, కోహ్లీ కూడా ఇంట్లో తమ పనులను తామే చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా అనుష్క తన భర్తకు తానే స్వయంగా హెయిర్ కట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా తీసిన వీడియోను అనుష్క తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
కిచెన్‌లో వాడే కత్తెరతోనే!
ఈ వీడియోలో అనుష్క విరాట్‌కు హెయిర్ కట్ చేస్తుండగా.. తన జుట్టును మరింత స్టైలిష్‌గా ఎలా కట్ చేయాలో విరాట్ ఆమెకు సలహాలిస్తున్నాడు. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ ‘క్వారెంటైన్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది. నా భార్య చేసిన ఈ అందమైన హెయిర్‌కట్‌ని చూడండి. తను ఈ హెయిర్‌కట్ చేయడానికి కిచెన్‌లో వాడే కత్తెరను ఉపయోగించింది తెలుసా..!’ అంటూ చెప్పుకొచ్చాడు.
అనుష్క, కోహ్లీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ లాక్డౌన్ సమయంలో ఇంటిపట్టునే ఉంటూ తమలో దాగున్న టాలెంట్స్‌ని ఇలా బయటికి వెలికి తీస్తుండడం విశేషం.