అత్తాకోడళ్ల అనుబంధానికి సంబంధించి మన సమాజంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అత్తాకోడళ్లంటే ఒకరంటే ఒకరికి పడదని, ఒకే ఇంట్లో ఉన్నా భిన్న ధృవాలుగా వ్యవహరిస్తుంటారని, వీరికి ఏ విషయాల్లోనూ పొసగదని చాలామంది అనుకుంటారు. అయితే అత్తమ్మ అంటే అమ్మకు ప్రతిరూపమని, కోడలు కూడా ఓ కూతురు లాంటిదే అని చాటిచెబుతున్న అత్తా కోడళ్లు కూడా మన చుట్టూ చాలామందే ఉన్నారు. అలాంటి కోవకే చెందుతారు సమీరా రెడ్డి-మంజ్రీ వర్దే. అత్తాకోడళ్లే అయినా తమ ఇద్దరి మధ్య తల్లీ-కూతుళ్లకు మించిన అనుబంధం ఉందని వీరిద్దరూ నిరూపిస్తున్నారు . ఈక్రమంలో ప్రస్తుతం టిక్‌టాక్‌లో ట్రెండ్ అవుతున్న ‘ఫ్లిఫ్ ది స్విచ్’ ఛాలెంజ్‌లో సరదాగా పాల్గొని సందడి చేశారీ సెలబ్రిటీ అత్తాకోడళ్లు.
ఏంటీ ‘ఫ్లిప్’ ఛాలెంజ్?
‘ఫ్లిప్ ది స్విచ్’...ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ వూపు వూపేస్తున్న టిక్‌టాక్ ఛాలెంజ్. అయితే గతంలో వచ్చిన ‘సాల్ట్ వాటర్’, ‘ద స్కల్ బ్రేకర్’ లాంటి మాదిరిగా ఇది ప్రమాదకరమైన ఛాలెంజ్ కాదు. చాలా సరదాగా సాగిపోతుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ‘ ఓ వ్యక్తి కెమెరా పట్టుకుని అద్దం ముందు నిలబడాలి. ఆ పక్కన మరొకరు ఏదైనా పాటకు సరదాగా డ్యాన్స్ చేస్తారు. అయితే సాంగ్ మధ్యలో ఒకరు లైట్ స్విచ్ ఆపేస్తారు. మళ్లీ స్విచ్ ఆన్ చేసేలోపు ఒకరి దుస్తులు మరొకరు వేసుకోవాలి. ఈసారి ముందు కెమెరా పట్టుకున్న వ్యక్తి సరదాగా స్టెప్పులేస్తారు. డ్యాన్స్ చేసిన వ్యక్తి కెమెరా పట్టుకుని వీడియో తీస్తారు. ఇదంతా కొన్ని సెకన్ల లోపే జరిగినట్లు కనిపిస్తుంది. హాలీవుడ్లో మొదలైన ఈ ఛాలెంజ్‌లో జెన్నిఫర్ లోపెజ్ లాంటి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సమీర కూడా ఈ సవాల్‌ను స్వీకరించారు.
మా అత్తమ్మ ఒక అద్భుతం!
తన అత్తమ్మ మంజ్రీ వర్దేతో కలిసి సరదాగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. అమెరికన్ ర్యాప్ సింగర్ ‘క్వావో’ పాటను ఇతివృత్తంగా ఎంచుకుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మొదట బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి ‘క్వావో’ సాంగ్‌కు సరదాగా స్టెప్పులేసింది సమీర. అదే సమయంలో మోనోక్రోమ్ ప్రింటెడ్ డ్రస్‌లో ఉన్న మంజ్రీ అద్దం ముందు నిల్చొని సెల్ఫీ కెమెరాతో ఈ వీడియోను చిత్రీకరించింది. అయితే అలా కన్ను మూసి తెరిచేలోపే అత్తా కోడళ్లిద్దరూ స్థానాలు మార్చకున్నారు. ఒకరి దుస్తులు మరొకరు వేసుకున్నారు. ఈసారి ప్రింటెడ్ డ్రస్ ధరించిన కోడలు అద్దం ముందు నిల్చొని వీడియో చిత్రీకరిస్తుండగా, బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది అత్తమ్మ. ఇలా ఎంతో సరదాగా సాగిపోయే ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది సమీర. ‘ మా అత్తగారు ఒక అద్భుతం. ఆమె నా శక్తినంతా దొంగిలించింది. నాలాగే ఎంతో క్రేజీగా ఉన్న ఈ నిజమైన గ్యాంగ్‌స్టర్‌కు నా ధన్యవాదాలు. మీరు కూడా ఈ ఛాలెంజ్‌ను ట్రై చేయండి. అదేవిధంగా మమ్మల్ని ట్యాగ్ చేయండి’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చిందీ అందాల తార.
నెట్టింట్లో ట్రెండింగ్!
‘నరసింహుడు’, ‘అశోక్’, ‘జై చిరంజీవ’... వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది సమీరా రెడ్డి. ఆ తర్వాత తమిళ, హిందీ సినిమాల్లోనూ మంచి విజయాలు అందుకుందీ ముద్దుగుమ్మ. 2014లో వ్యాపార వేత్త అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ 2015లో ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది. గతేడాది జులై 12న మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందిన సమీర ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇద్దరు పిల్లల ఆలనాపాలనలో మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె నిత్యం మహిళలకు స్ఫూర్తినిచ్చే పోస్ట్‌లు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ‘ఫ్లిఫ్ ది స్విచ్’ ఛాలెంజ్‌కు సంబంధించి సమీర రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీ అత్తా కోడళ్లు సరదాగా వేసిన స్టెప్పులు, హావభావాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ అత్తాకోడళ్లను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.