సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అయితే అందరూ కాకపోయినా... కొందరి ఆడవాళ్ల గెలుపు వెనక కూడా మగాళ్లుంటారు. ఇండియన్ స్టార్ బాక్సర్ మేరీకోమ్ దంపతులను చూస్తే ఈ మాట నిజమేననిపిస్తుంది. ఓ వైపు బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూనే... మరోవైపు ముగ్గురు పిల్లల తల్లిగా వారి ఆలనాపాలన చూసుకుంటోందీ లెజెండరీ బాక్సర్. వీటితో పాటు అదనంగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందిస్తోందామె. ఇలా కెరీర్, కుటుంబం, పిల్లలు..ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకొని బాక్సింగ్ రింగ్‌లో రాణించాలంటే ఓ మహిళకు కత్తిమీద సామే అని చెప్పుకోవచ్చు. అయితే తన భర్త సహకారంతో వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకుంటున్నానని చెబుతోంది మేరీకోమ్. ఆయన అందించిన ప్రోత్సాహం వల్లే బాక్సింగ్‌లో అరుదైన విజయాలు సాధించానంటోంది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 12)న పెళ్లి పీటలెక్కారు మేరీకోమ్-కె ఒన్లర్. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
ఆయన సహకారంతోనే..!
మహిళల బాక్సింగ్‌కు సంబంధించి ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్...2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. వీటితో పాటు ఎన్నో అంతర్జాతీయ టోర్నీల్లో దేశానికి పతకాల పంట పండించిన ఆమె తన పంచ్ పవర్లకు గుర్తింపుగా ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకుంది. అంతేకాదు కొద్ది రోజుల క్రితం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించిందీ స్టార్ బాక్సర్. ఇటీవలే అధికారికంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆమె... ఆ క్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే 2005లో కె ఒన్లర్తో కలిసి పెళ్లి పీటలెక్కిన మేరీ..2007లో ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. అనంతరం 2013లో మరోసారి అమ్మగా ప్రమోషన్ పొంది మరో పండంటి బాబును ప్రసవించింది. కెరీర్, పిల్లలు, ఫ్యామిలీ విషయాలకు సంబంధించి తన భర్త ఎలాంటి సహకారం, ప్రోత్సాహం అందిస్తున్నారో చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది మేరీ. ఈ క్రమంలో తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భర్తపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది.
దేవుడికి థ్యాంక్స్!
తన పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘నిజమైన ప్రేమ అంటే ఒకే వ్యక్తితో పలుసార్లు ప్రేమలో పడడం. అలాంటి వ్యక్తితో మన జీవితాన్ని పంచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలా 15 ఏళ్లుగా నాతో ప్రేమను పంచుకుంటూ అన్ని విషయాల్లో నాకు అండగా నిలుస్తున్న నా భర్తకు ధన్యవాదాలు. ఇక నా జీవితాన్ని ఆయనతో ముడివేసి గొప్ప వరమందించిన ఆ దేవుడికి కూడా థ్యాంక్స్’ అని తన భర్తపై ఉన్న ప్రేమకు అక్షర రూప మిచ్చిందీ బాక్సింగ్ క్వీన్. ఇక కెఒన్లర్ కూడా తమ పెళ్లినాటి ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ‘ ఆ దేవుడే నిన్ను, నన్ను కలిపాడు. కాబట్టి మనల్ని ఎవరూ విడదీయలేరు’ అంటూ తన సతీమణిపై ప్రేమను కురిపించారు.
ఒలింపిక్స్‌లో అదే నా ఆయుధం!
2012లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న మేరీకోమ్ ప్రస్తుతం తన దృష్టంతా ఈ ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్ మీదే ఉందని చెబుతోంది. ఈ క్రమంలో ఇటీవలే అధికారికంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిందీ బాక్సింగ్ క్వీన్. ఒలింపిక్స్‌కు సంబంధించి జోర్డాన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లో సెమీస్‌కు చేరుకున్న మేరీ, రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ ఈ విజయంతో నేనెంటో మరోసారి నిరూపించుకున్నాను. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో నా భుజాల మీద ఉన్న బరువును కొద్దిగా తగ్గించుకున్నాను. అందరిలాగే ఒలింపిక్స్ క్రీడల కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అయితే మిగతా పోటీలతో పోలిస్తే ఈ అంతర్జాతీయ క్రీడల్లో ఒత్తిడి, భావోద్వేగాలు కొంచెం అధికంగా ఉంటాయి. ఓ క్రీడాకారిణిగా వీటిని అధిగమించడం అంత సులభమేమీ కాదు. అయితే బాక్సింగ్ బౌట్లో నాకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. అంతేకాదు 2012 లండన్ ఒలింపిక్స్‌లో నేను కాంస్య పతకం సొంతం చేసుకున్నా. కాబట్టి రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో అనుభవమే నా బలం అనుకుంటున్నా. బౌట్లో ఎదురయ్యే ప్రత్యర్థుల గురించి ఎక్కువ ఆలోచించకుండా మెరుగైన ఫలితాలు సాధించడం పైనే నా దృష్టిని కేంద్రీకరిస్తాను. ఇక కరోనాపై నేను కూడా అప్రమత్తంగా ఉన్నాను. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నా’ అని చెప్పుకొచ్చింది.
బాక్సింగ్ బౌట్లో రెండు దశాబ్దాల అనుభవమున్న మేరీ రెండోసారి ఒలింపిక్స్ బరిలో నిలిచింది. ఈ అంతర్జాతీయ పోటీల్లో ఆమె సత్తా చాటి స్వర్ణం సాధించాలని మనమూ కోరుకుంటూ మేరీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుదాం.